తెలంగాణ

telangana

మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం: ఈటల రాజేందర్

By

Published : Feb 24, 2023, 7:33 PM IST

EEtala rajender comments on KCR: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్​పై విమర్శలు చేశారు. బీఆర్​ఎస్​ పార్టీకి సరితూగే పార్టీ బీజేపీనేని అన్నారు. బీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన మాజీ పురపాలక ఛైర్ పర్సన్ శ్రావణితో ఆయన భేటీ అయ్యారు.

Huzurabad MLA Etela Rajender
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

EEtala rajender comments on KCR: రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు​ ధీటైన పార్టీ బీజేపీనేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల ప్రజాగోస బీజేపీ భరోసా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించని ముఖ్యమంత్రి కేసీఆర్... దేశ వ్యాప్తంగా ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు.

ఒక చేతితో ఇచ్చి.. ఇంకో చేతితో తీసుకుంటున్నారు: జగిత్యాల జిల్లా మల్యాల ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ వంటి పార్టీలను ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనపరిచారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు ధీటైన పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతు బంధు పథకంతో రూ.5000 చెల్లించిన ప్రభుత్వం.. ధాన్యం కోత పేరుతో మరో చేతితో రూ.5000 వసూలు చేసుకున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయబోయేది బీజేపీనని స్పష్టం చేశారు.

మాజీ పురపాలక ఛైర్ పర్సన్​తో ఈటల భేటీ: జగిత్యాలలో బీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన మాజీ పురపాలక ఛైర్ పర్సన్ శ్రావణితో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. గురువారం పార్టీకి రాజీనామా చేయగా.. ఆమెను కలసి బీజేపీలో చేరే విషయంపై చర్చించారు. ఆమెను బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఆహ్వానించామని తెలిపారు.

ప్రతిపక్షాలంటే కేసీఆర్​కి గౌరవం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను గడ్డిపోచలా తీసేస్తున్నారని విమర్శించారు. దీనికి ఉదాహరణ జగిత్యాల పురపాలక ఛైర్మన్ శ్రావణినేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఫామ్​హౌస్​లో ఉంటూ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పోలీస్​ వ్యవస్థ తప్ప ఇంకే వ్వవస్థ పనిచేయట్లేదు: రాష్ట్రంలో ఏ ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయట్లేదని కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి మాత్రమే పోలీస్​లు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలా బెదిరించే నాయకులను, అవమాన పరిచే నాయకులను చూడలేదని వెల్లడించారు. నాయకుల వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిందని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details