తెలంగాణ

telangana

Peddapeta ideal Lady farmer : పెద్దపేట రజిత.. పంటల సాగు విజేత

By

Published : Jan 28, 2022, 5:26 PM IST

Peddapeta ideal woman farmer: వ్యవసాయంపై మక్కువతో సాగురంగంలో రాణిస్తున్నారు ఓ యువతి. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతికను ఉపయోగించుకుని మెలుకువలు నేర్చుకుంటూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. బంతిపూలు, కూరగాయలు, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తూ... లాభాలు గడిస్తున్నారు. ఆమే పెద్దపేటకు చెందిన రజిత.

Peddapeta ideal Lady farmer, farmer Rajitha story
పెద్దపేట రజిత.. పంటల సాగు విజేత

పెద్దపేట రజిత.. పంటల సాగు విజేత

Peddapeta ideal woman farmer : ఇటీవల కాలంలో మహిళలు వ్యవసాయంలో సత్తా చాటుతున్నారు. తమదైన స్టయిల్​లో సాగు చేస్తూ... ఉత్తమ రైతులుగా నిలుస్తున్నారు. వినూత్న ఆలోచనలతో సాగు చేస్తూ... మంచి లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయం చేయాలనే ఆసక్తితో సాగువైపుగా మళ్లి... ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళా రైతు రజిత.

యూట్యాబ్ చూస్తూ... సాగు

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దపేటకు చెందిన రజితకు వ్యవసాయం చేయడమంటే ఇష్టం. గతంలో సాగు పనులు చేసిన అనుభవంతో ముందడుగు వేశారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల గురించి ఆరా తీశారు. బ్రాహ్మణపల్లి శివారులో మూడెకరాల భూమిని సాగుకోసం ఎంచుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో బంతిపూలు సాగు చేశారు. అనుకున్నదానికంటే రెట్టింపు లాభం గడించారు. ఎకరన్నర పొలంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ పండిస్తున్నారు. మార్కెట్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా... యూట్యూబ్‌లో చూసి సాగులో మెలకువలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

స్టార్టింగ్ వ్యవసాయం నార్మల్​గా చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత మార్కెటింగ్ సమస్య వల్ల కూరగాయలు, పూలు, పండ్లు సాగు మొదలుపెట్టాం. బంతి సాగు మేం ఊహించిన దానికంటే మంచి లాభాలు వచ్చాయి. ఇక అంతర పంటలుగా మునగ, క్యాబేజ్, కాలీఫ్లవర్, మిర్చి వంటివి ఉన్నాయి. వ్యవసాయంలో ఏం మిగలడం లేదు అనేది అవాస్తవం. అందులో దిగి.. ఇష్టంగా కష్టపడి సాగు చేస్తే చాలామంచి ఫలితాలు వస్తాయి.

-రజిత, సాగుదారు

రకరకాల పంటలు

బంతిపూల సాగు విజయవంతం కావడంతో అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు వేయాలని నిర్ణయించుకున్నారు. స్థానిక వాతావరణానికి అనుకూలంగా పంటలు పండిస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతులను అవలంభిస్తూ... సొంతంగా వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నారు. సహజ పద్ధతులను ఉపయోగిస్తూ చీడపీడల నుంచి పంటలను కాపాడుతున్నారు. చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడా నర్సరీ లేకపోవడం గమనించిన రజిత... మెుక్కలు పెంచుతున్నారు. నర్సరీ ద్వారా మెుక్కలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

వ్యవసాయం చేస్తా నాకు కొంచెం సపోర్టు ఇవ్వండి అని అడిగారు. తనకు సాగుపై చాలా ఆసక్తి ఉంది. కొత్త కొత్త ఆలోచనలు ఉన్నాయి. వినూత్నంగా పంటలు పండించాలని చెప్పారు. మేం కూడా సరే అని ప్రోత్సాహం ఇచ్చాం. వ్యవసాయం ఎలా చేయాలి? ఏ సమయంలో పండిస్తే.. ఎలాంటి లాభాలు ఉంటాయి? ఎలాంటి ఎరువులు వాడాలి? వంటివాటిని సొంతంగా నేర్చుకున్నారు. ఎవరి సాయం లేకుండా వ్యవసాయంలోని మెళుకువలు నేర్చుకున్నారు. వ్యవసాయంపై అవగాహన ఉండి.. ఇష్టంతో చేస్తే మహిళలు కూడా సక్సెస్ అవుతారు.

-సంతోష్, సహాయకులు

వ్యవసాయక్షేత్రానికి వస్తున్న రైతులకు రజిత సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగు పద్ధతులు వివరిస్తున్నారు. తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి:Ideal woman Farmer Kothapalli : కృషీ లక్ష్మి.. అరక దున్నుతూ.. ఉపాధి కల్పిస్తూ..!

ABOUT THE AUTHOR

...view details