తెలంగాణ

telangana

Jeevan reddy on revanth: కాంగ్రెస్, భాజపా తెలంగాణకు పరాయి పార్టీలుగా మారాయి: జీవన్​ రెడ్డి

By

Published : Dec 25, 2021, 6:16 PM IST

Jeevan reddy on revanth: రాష్ట్ర మంత్రులను అవమానించేలా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి భాజపాకు బంట్రోతులా తయారయ్యారని ఆర్మూర్​ తెరాస ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి విమర్శించారు. ఆయన బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పూర్తిగా భాజపా స్తుతి పక్షమైపోయిందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై మరోసారి వ్యాఖ్యలు చేస్తే తరిమి కొడతామని తీన్మార్​ మల్లన్నను హెచ్చరించారు.

Jeevan reddy on revanth
ఆర్మూర్​ తెరాస ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

Jeevan reddy on revanth: సీఎం కేసీఆర్ రైతులకు బ్రాండ్ అంబాసిడర్​గా మారితే.. కాంగ్రెస్, భాజపా నేతలు బూతులకు బ్రాండ్​ అంబాసిడర్లు అయ్యారని ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు, ఎంపీల బృందానికి గాజులు, చీరలు పంపుతామంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మహిళలను కించపరిచారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులను అవమానిస్తున్న భాజపాకు రేవంత్​ రెడ్డి బంట్రోతులా మారారని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీగా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పూర్తిగా భాజపా పక్షమైపోయిందన్నారు. కాంగ్రెస్, భాజపాలు తెలంగాణకు పరాయి పార్టీలు అయ్యాయని ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు కేసీఆర్ కుటుంబ సభ్యులపై వాడుతున్న భాషను తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు.

చిన్న పిల్లలపై ఎవరైనా ఆ విధంగా మాట్లాడుతారా..! అమిత్​ షా, కిషన్​ రెడ్డి కుటుంబాలపై మేం అలా మాట్లాడితే బాగుంటుందా.? జర్నలిస్టులు వాటిని సమర్థిస్తారా? ఇకపై మల్లన్నను ఉరికొచ్చి కొడతాం. ఇంతకుముందు ఆర్మూర్​లో కొట్టాం. మళ్లీ ఎక్కడ కనపడితే అక్కడ కొడతాం. భాజపా తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. కాళేశ్వరానికి రూపాయి ఇవ్వలేదు. బియ్యం కూడా మేమే కొంటున్నాం. కాంగ్రెస్​, భాజపా రెండు కూడా పరాయి పార్టీలే. కిషన్​ రెడ్డికి ఆ మాత్రం తెలియదా? కేంద్రానికి వరి ఉరి కాబోతోంది. కాంగ్రెస్​కు ఏ ఎన్నికల్లో డిపాజిట్​ దక్కలేదు. కాంగ్రెస్​, భాజపాలు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. రేవంత్​ రెడ్డి భాజపాతో కుమ్మక్కయ్యారు. టీపీసీసీ రేవంత్​ రెడ్డి ఇవాళ భాజపాకు బంట్రోతుగా మారారు. ఆయన చేపట్టబోయే రచ్చబండ వారికే ఉరిబండ కానుంది. - జీవన్​ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే

మల్లన్నను తరిమికొడతాం

మరోసారి సీఎం కేసీఆర్​ కుటుంబసభ్యులపై అభ్యంతకర పదజాలం వాడితే తెరాస శ్రేణులు తరిమి కొడతాయని తీన్మార్​ మల్లన్నను జీవన్​ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న వాడిన భాషను అమిత్ షా కుమారుడిపై వాడితే భాజపా నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న ఇకనైనా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఎక్కడికక్కడే తరిమి కొడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

తెరాస ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details