తెలంగాణ

telangana

పీసీసీ నూతన ఎన్నికల కమిటీ పూర్తి.. వచ్చే నెల మొదటి వారంలో ప్రకటన

By

Published : Nov 30, 2022, 10:00 AM IST

PCC New Election Committee: తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ నూతన ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తయ్యింది. పాత, కొత్త కలయికలతో ఏర్పాటైన జంబో కమిటీ ప్రకటన.. వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న కమిటీలో కొందరికి ఉద్వాసన పలకడంతోపాటు.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మరికొందరికి పదవులు కట్టబెట్టారు. సీఎల్పీనేత భట్టి, మరికొందరు సీనియర్‌ నాయకులతో చర్చించి, తుది మెరుగులు దిద్ది జంబో జాబితాను ప్రకటించనున్నారు.

PCC New Election Committee
PCC New Election Committee

పీసీసీ నూతన ఎన్నికల కమిటీ పూర్తి.. వచ్చే నెల మొదటి వారంలో ప్రకటన

PCC New Election Committee: తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ ప్రక్షాళనతోపాటు, పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటుకు గత కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. భారత్‌ జోడోయాత్ర, మునుగోడు ఉప ఎన్నికలు ఉన్న కారణంగా ఆలస్యమైంది. అవన్నీ పూర్తి కావడంతో, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై గత కొన్ని రోజులుగా పీసీసీతోపాటు ఏఐసీసీ స్థాయిలోనూ కసరత్తు జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ప్రకటన చేసిన ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర కమిటీపై దృష్టి సారించింది.

డీసీసీ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రక్షాళన ప్రక్రియ చేపట్టేందుకు, పీసీసీ కసరత్తు చేసింది. అయితే రాబోయేది ఎన్నికలు జరిగే సంవత్సరం కాబట్టి ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులను మార్పు చేసేందుకు కొందరు స్థానిక నాయకులు ససేమిరా అంటున్నారు. దీంతో ఖాళీగా ఉన్న డీసీసీ అధ్యక్ష పదవులతోపాటు.. కొన్ని ఖచ్చితంగా మార్చాల్సిన పరిస్థితులు ఉండడంతో అంతవరకే పరిమితం కావాలని నిర్ణయించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ ఇంఛార్జీ కార్మదర్శులు బోసురాజు, జావిద్‌, రోహిత్‌ చౌదరిలు దిల్లీలో మకాం వేసి, ఈ కమిటీ ఏర్పాటుపై కసరత్తు చేశారు. పీసీసీతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ, ముగ్గురు కార్యదర్శులు ఎన్నికలు దగ్గర పడడంతో, ప్రతి నియామకంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికలకు వెళ్లాలంటే తనకు అనుకూలమైన నాయకులకు పదవుల్లో స్థానం కల్పించాలని, అలా చేయని పక్షంలో తాను ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుందని ఏఐసీసీ నాయకుల వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో దాదాపు 50శాతం పదవులు రేవంత్‌ తన వర్గానికి కట్టబెట్టుకోడానికి, అవకావం ఇచ్చినట్లు తెలుస్తోంది.

డీసీసీల విషయంలో స్థానికులతో మాట్లాడి నిర్ణయం:జిల్లా అధ్యక్షుల నుంచి మొదలు పెట్టిన కసరత్తు, ఆయా జిల్లాలకు చెందిన డీసీసీల విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చాలా చోట్ల స్థానిక నాయకులు డీసీసీల మార్పునకు.. విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా పార్టీకి పని చేయని డీసీసీ అధ్యక్షుల విషయంలో, కఠినంగా ముందుకు వెళ్లినట్లు సమాచారం.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, ఖైరతాబాద్‌ జిల్లాల అధ్యక్షులను కొత్తగా నియమించడంతోపాటు.. మరో ఆరేడుగురు డీసీసీలకు స్థానభ్రంశం కలుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక కార్యదర్శుల విషయంలో పార్టీ కోసం పని చేసిన వారిని దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు వందల మందిని కార్యదర్శులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు ప్రధాన కార్యదర్శులుగా 30 నుంచి 35 మందికి స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. గడిచిన ఒకటిన్నర సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసిన వారికే ఇందులో స్థానం కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడున్న పది మంది సీనియర్‌ ఉపాధ్యక్షులు కాకుండా, మరో పది మంది ఉపాధ్యక్షులను నియమించినట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న సీనియర్‌ ఉపాధ్యక్షులల్లో చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

అలాంటి వారిని తప్పించి, వేరొకరికి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఉంటే.. అందులో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పార్టీ ఆర్గనైజింగ్ వ్యవహారాలు చూసుకుంటుండగా, జగ్గారెడ్డి అడపాదడపా మీడియా సమావేశాలతో సరిపెట్టుకుంటుంటే మరో ముగ్గురు ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉంటే, అటు గాంధీభవన్‌ వచ్చి వెళ్లిపోతున్నారు.

తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ కార్యకలాపాలు సజావుగా మరింత బలోపేతంగా కొనసాగాలంటే కార్యనిర్వాహక అధ్యక్షులు.. పూర్తి స్థాయిలో పని చేసే వారుండాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీలో తీవ్ర అలజడి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పటికే పూర్తి చేసిన జాబితాను ప్రకటించే ముందు సీఎల్పీ నేత భట్టి, ఇతర నేతలతో చర్చించి ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే, తుదిమెరుగులు దిద్ది ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details