తెలంగాణ

telangana

జంటనగరాల్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

By

Published : Apr 10, 2022, 3:45 AM IST

Updated : Apr 10, 2022, 3:59 AM IST

Sriramanavami Shobhayatra: శ్రీరామనవమిని పురస్కరించుకుని జంటనగరాల్లో నిర్వహించే శోభాయాత్ర అట్టహాసంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున కొనసాగే శ్రీరామనవమి శోభాయాత్ర ఊరేగింపులో భారీగా భక్తులు పాల్గొననున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఊరేగింపు కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

జంటనగరాల్లో అట్టహాసంగా శ్రీరామనవమి శోభాయాత్ర.. పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు
జంటనగరాల్లో అట్టహాసంగా శ్రీరామనవమి శోభాయాత్ర.. పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

Sriramanavami Shobhayatra: శ్రీరామ శోభాయాత్ర హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్‌ ఆలయం నుంచి ప్రధాన ఊరేగింపు ప్రారంభమై... హనుమాన్‌ వ్యాయామశాల వద్ద శోభా యాత్ర ముగుస్తుంది. ఈసాది ఖైరతాబాద్‌, అంబర్‌పేట్‌, నారాయణగూడ తదితర ప్రాంతాల నుంచి కూడా ఊరేగింపులు కొనసాగనున్నాయి. యాత్రలో భాగంగా శ్రీరాముని వేషధారణతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో పలువురు కనిపించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు: శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శోభాయాత్ర కొనసాగే సమయంలో ఆయా రహదారుల మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. వాహనాలను దారి మళ్లించి ఇతర రహదారుల మీదుగా వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆంక్షలు విధించారు. బోయగూడ కమాన్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్​లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభా యాత్ర చేరుకుటుంది.

6.5 కిలోమీటర్ల మేరక సాగే శోభాయాత్ర రాత్రి 10గంటలకు ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు గోషామహల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో, 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలోని ప్రధాన రహదారుల మీదుగా శోభాయాత్ర కొనసాగుతుందని... ఆయా వేళల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఆయా మార్గాల్లో శోభాయాత్ర ముగిసిన వెంటనే... బారికేడ్లు తీసి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు శోభాయాత్రకు సంబంధించిన సమాచారం కోసం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 2785 2482, హెల్ప్ లైన్ 9010203626 నంబర్లకు ఫోన్ చేయాలని... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు పేరిట సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేత: హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయనున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మూసివేస్తారు. వాహనదారులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.

ఇదీ చదవండి: నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం

Last Updated : Apr 10, 2022, 3:59 AM IST

ABOUT THE AUTHOR

...view details