తెలంగాణ

telangana

Center for Eye Infections: రామోజీ ఫౌండేషన్‌ సహకారంతో.. కంటి ఇన్ఫెక్షన్లకు ప్రత్యేక కేంద్రం

By

Published : Dec 16, 2021, 8:35 AM IST

Center for Eye Infections: కంటి ఇన్ఫెక్షన్లు, కార్నియా సమస్యలపై అవగాహన, చికిత్సల కోసం రామోజీ ఫౌండేషన్‌, ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఈఐ)ల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటైంది. కంటి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి త్వరితగతిన నిర్ధారణ, తక్కువ ఖర్చు, తక్కువ కోతతో చేసే శస్త్ర చికిత్సల కోసం అత్యాధునిక ప్రక్రియలు రూపొందించడంపై ఈ కేంద్రంలో దృష్టి పెట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Center for Eye Infections
కంటి ఇన్ఫెక్షన్లకు ప్రత్యేక కేంద్రం

Center for Eye Infections: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలో ‘ది రామోజీ ఫౌండేషన్‌ సెంటర్‌ ఫర్‌ ఐ ఇన్ఫెక్షన్స్‌’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్య సంస్థ ఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రశాంత్‌గార్గ్‌ ఈ విషయాన్ని తెలిపారు. కంటి ఇన్ఫెక్షన్లు, కార్నియా సమస్యలతో బాధపడే వారికి ఈ కేంద్రంతో చికిత్సలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ‘రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఎంతో ఉదారంగా అందిస్తున్న సహకారంతో నేత్ర సమస్యలపై ఎల్వీపీఈఐ మరింత కృషి చేస్తుంది. ఈ కేంద్రంలో కంటి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి త్వరితగతిన నిర్ధారణ, తక్కువ ఖర్చు, తక్కువ కోతతో చేసే శస్త్ర చికిత్సల కోసం అత్యాధునిక ప్రక్రియలు రూపొందించడంపై దృష్టి పెడతాం. ఎల్వీపీఈఐ గ్రామీణ నేత్ర సంరక్షణ వ్యవస్థ కేంద్రాలలో కార్నియా సంబంధిత ఇన్ఫెక్షన్ల పరీక్ష, చికిత్సలకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం. దీంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అంతగా తెలియని కంటి ఇన్ఫెక్షన్లలో లోతైన పరిశోధన చేయడానికి, నేత్ర సంరక్షణ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ సంస్థలకు కూడా సహకరిస్తాం’’ అని డాక్టర్‌ ప్రశాంత్‌గార్గ్‌ వివరించారు. మద్దతు అందించిన రామోజీరావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇన్ఫెక్షన్లు పెద్ద సమస్య

‘‘చాలామందిలో అంధత్వానికి శుక్లం ప్రధాన కారణం కాగా ఆ తర్వాతి స్థానం ఇన్ఫెక్షన్లదే. భారత్‌తోపాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువ. కార్నియా సంబంధిత తీవ్ర ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1.5 మిలియన్ల ప్రజలు చూపును కోల్పోతున్నారు. పని ప్రదేశంలో తగిలే గాయాలు, వ్యవసాయ సంబంధిత గాయాలు, ఇన్ఫెక్షన్‌కు దారి తీసి చాలామంది చూపు కోల్పోతున్నారు. పోషకాహార లోపం కూడా కంటి చూపును దెబ్బతీస్తోంది. చాలామంది యవ్వనంలోనే కంటి ఇన్ఫెక్షన్ల బారినపడుతుండటం వల్ల ఆయా కుటుంబాలపై భారం పడుతోంది. గడిచిన 18 నెలల్లో ఎల్వీపీఈఐలో దాదాపు 3800 మందికి చికిత్సలు అందించగా వీరిలో అధిక శాతం మంది కార్నియా సంబంధిత, కంటి వెనుక భాగం ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారే. గతేడాది చేపట్టిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సల్లో 50 శాతం ఇన్ఫెక్షన్ల కారణంగా తలెత్తినవే. మరోవైపు కొవిడ్‌ మహమ్మారి కారణంగా బ్లాక్‌ఫంగస్‌తో 500 మందికి కంటిచూపుపై ప్రభావం పడింది. వీరందరికి ఎల్వీపీఈఐలో విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించాం. వివిధ రకాల ఇన్ఫెక్షన్లపై ఇక్కడి పరిశోధన బృందాలు నిరంతరాయంగా అధ్యయనం చేస్తున్నాయి. ఈ కృషిని మరింత మెరుగుపరచడంలో రామోజీ ఫౌండేషన్‌ మద్దతు ఎంతో దోహదపడుతుంది. అనేకమందికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని డాక్టర్‌ ప్రశాంత్‌గార్గ్‌ వివరించారు.

ఇదీ చూడండి:కళ్లను కాపాడుకోండి.. నిర్లక్ష్యం చేస్తే ముప్పే!

ABOUT THE AUTHOR

...view details