తెలంగాణ

telangana

Revanth reddy: 'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో ఒకరోజు రాహుల్​ గాంధీ'

By

Published : Aug 4, 2021, 5:46 PM IST

Updated : Aug 4, 2021, 8:04 PM IST

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు తనతో సహా ఎవరు పాల్పడినా చర్యలు ఉంటాయని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేయాలని కోరారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో గాంధీభవన్​లో రేవంత్​ సమావేశమయ్యారు. అనంతరం ఆగస్టు 9న దళిత, గిరిజన దండోరా సందర్భంగా గోడ పత్రిక ఆవిష్కరించారు.

revanth reddy
రేవంత్​ రెడ్డి

ఆగస్టు 9నుంచి ప్రారంభమయ్యే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో ఒకరోజు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. తేదీ, స్థలం పార్టీ నేతలే నిర్ణయించాలని సూచించారు. హుజూరాబాద్​ అభ్యర్థి విషయంలో కార్యకర్తలు సామాజిక వర్గం, పార్టీ కోసం పనిచేసే వారే కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్​ గాంధీభవన్​లో పార్టీ ముఖ్య నేతలతో రేవంత్​ సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తనతో సహా ఎవరూ పాల్పడినా చర్యలుంటాయని రేవంత్​ హెచ్చరించారు. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దని హితవు పలికారు. బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేస్తేనే గౌరవం పెరుగుతుందని చెప్పారు.

దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా గోడ పత్రిక ఆవిష్కరణ

గోడపత్రిక ఆవిష్కరణ

ఆగస్టు 9న ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లిలో జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ గోడపత్రికను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆగస్టు 11 నుంచి 21వరకు పది రోజులపాటు 5 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా ప్రతి రోజూ ఒక ప్రాంతంలో 2నుంచి 3 వేల మందితో ర్యాలీలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. అదే విధంగా 7 సమావేశాలు నిర్వహించాలని.. మండలంలో ఉన్న మొత్తం ఓటర్లలో పదిశాతం మీటింగ్‌కు వచ్చేలా ప్రణాళిక చేయాలని వివరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అనుబంధ సంఘాల నాయకులను క్షేత్రస్థాయిలో పని చేయించాలని చెప్పారు. ఆదివాసీల జీవితాలు బాగుపడటానికి కాంగ్రెస్​ మరో పోరాటానికి సిద్ధమైందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్​ గిరిజన, ఆదివాసీ, దళిత వాడల్లో చూస్తే వాళ్ల జీవితాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో సీఎం కేసీఆర్​ ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. వారి కోసం పోరాడటానికి, మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సెప్టెంబర్​ మొదటివారంలో తెలంగాణకు రానున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులొచ్చినా ఇంద్రవెల్లి గడ్డ నుంచి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తాం. లక్షకు ఒక్కరు తక్కువైనా కేసీఆర్​ వద్ద గులాంగిరీ చేస్తా. ప్రజలందరి మద్దతుతో దండోరాను విజయవంతం చేయాలి.

- రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

గిరిజనులకు కూడా ఇవ్వాలి

దళితులకు రూ. పది లక్షలు ప్రకటించినట్లే... గిరిజనులకు కూడా రూ. పదిలక్షలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన బిడ్డలను చిత్ర హింసలకు గురి చేస్తుంటే కేసీఆర్‌కు కనపడటం లేదా అని ప్రశ్నించారు. కుమురం భీం స్పూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. లక్షమందితో దండోరా నిర్వహిస్తామని.. లక్షకు ఒక్కరు తక్కువైనా... మీకు గులాంగిరి చేస్తామని సవాల్‌ విసిరారు. తుడుందెబ్బ అంటే ఉడుం పట్టు అని నిరూపిస్తామని స్పష్టం చేశారు. గిరిజనులు అమాయకులే అయినా.. ఆలోచన లేని వారు కాదని, గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదని రేవంత్​ ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకే దళిత బంధు ప్రకటించారని ధ్వజమెత్తారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తారో... ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు. ఈ ఏడేళ్ల కాలంలో ప్రభుత్వం రూ.15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే... అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత అని ప్రశ్నించారు.

దళిత, గిరిజన దండోరాను విజయవంతం చేయాలి: రేవంత్​ రెడ్డి

కాంగ్రెస్​లో చేరికలు

హుజూరాబాద్​ అభ్యర్థి విషయంలో పొన్నం ప్రభాకర్, దామోదర రాజా నర్సింహులు కలిసి సిఫారసు చేయాలని వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కాంగ్రెస్​లో చేరారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి తెరాస, భాజపాలకు చెందిన గిరిజన నాయకులతో పాటు కుమురం భీం మనవడు వెడ్మా బొజ్జు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు గిరిజన నాయకులు పార్టీలో చేరారు. వీరందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రేవంత్​ ఆహ్వానించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Constituencies bifurcation: 'అసెంబ్లీ సీట్లు పెరిగితే కేంద్రానికి నష్టమేంటి..?'

Last Updated : Aug 4, 2021, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details