తెలంగాణ

telangana

Traffic Problems in Hyderabad : నగర​వాసులకు ట్రాఫిక్​ సమస్యలు.. ఎక్కడ చూసినా అవే పరిస్థితులు

By

Published : Jul 21, 2023, 10:54 AM IST

Rain Problems in Hyderabad : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. హైదరాబాద్‌ తడిసి ముద్దవుతోంది. మరో రెండు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. కానీ వర్షంతో పాటే నగరాన్ని ట్రాఫిక్‌ సమస్యా ముంచెత్తింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వాన.. మరోవైపు రహదారులపై ఇంజినీరింగ్‌ లోపాలు వెరసి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో గురువారం వాహనదారులకు నరకం కనిపించింది. వర్షంలో తడుస్తూ కిలోమీటరు ప్రయాణానికి గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయం.. సాయంత్రం తిరిగొచ్చే సమయంలో రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

Hyderabad Rains
Hyderabad Rains

Traffic Jam in Hyderabad Due to Rains :హైదరాబాద్‌లో మూడు రోజులుగా కురుస్తన్న వర్షం ప్రభావం.. గురువారం తీవ్రంగా మారింది. రహదారులపై నీళ్లు చేరి దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయం.. సాయంత్రం తిరిగొచ్చే సమయంలో రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉదయం చిన్నారులంతా బడికెళ్లిన కొద్దిసేపటికే.. ప్రభుత్వం రెండ్రోజుల సెలవు ప్రకటించడం ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

అప్పటికే చిన్నారుల్ని దింపేందుకు వచ్చిన స్కూల్‌ బస్సులు, ఇతర వాహనాలు, తల్లిదండ్రులు మళ్లీ తిరుగుముఖం పట్టి పాఠశాలలకు వెళ్లడం.. ఆ వెంటనే తిరిగి ఇళ్లకు చేర్చే క్రమంలో రెండు గంటలు నగరం నలుదిక్కులా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సిగ్నళ్లు హారన్ల మోతతో దద్దరిల్లాయి. మియాపూర్‌ నుంచి కొండాపూర్‌ రావడానికి సగటున 30 నిమిషాల్లోపే ఉండగా.. గురువారం కనీసం 3 గంటల సమయం పట్టింది.

Hyderabad Rains : మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి బేగంపేటకు వచ్చేందుకు.. 2 గంటలకు పైగా సమయం పట్టింది. మియాపూర్‌ నుంచి బాలానగర్‌ చౌరస్తాదీ అదే పరిస్థితి. బాలానగర్‌ వై జంక్షన్‌ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎల్బీనగర్‌ నుంచి పంజాగుట్ట వరకు ఎటుచూసినా రహదారులపై వాహనాలు బారులుతీరాయి. సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ మార్గంలో ఎక్కడా వాహనదారులకు దారి కనిపించనంతలా రద్దీ కనిపించింది.

Massive Traffic Jam in Hyderabad Due to Rains :మధ్యాహ్నం కొద్దిసేపు కుదుటపడ్డా.. వర్షం తీవ్రత పెరిగాక.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ట్రాఫిక్‌ తీవ్రత మరింత పెరిగింది. ఐటీ కారిడార్, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జేఎన్‌టీయూ, మూసాపేట, బాలానగర్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్‌లు కనిపించాయి. రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

రోజుల తరబడి కొనసాగుతున్న వర్షం.. ఐటీ కారిడార్‌ను ప్రభావితం చేసింది. వర్షంతో ద్విచక్రవాహనాలతో వచ్చేవారంతా.. కార్లతో రోడ్డెక్కడం, అక్కడక్కడా రహదారులపై నీరు చేరి ఇరుకుగా మారడం అన్నీ కలిసి ఐటీ కారిడార్‌లో ప్రయాణాన్ని సంక్లిష్టంగా మార్చాయి. ఐకియా చౌరస్తా దగ్గర వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దుర్గం చెరువు తీగల వంతెనపైనుంచి వేలాదిగా వచ్చిన వాహనాలు.. ఐకియా రహదారుల్లో ముందుకు కదలకుండా నిలిచిపోయాయి.

దుర్గం చెరువు ఎగువ నుంచి వచ్చే వరద.. మాదాపూర్‌ నెక్టార్‌ గార్డెన్‌ మీదుగా వెళ్తాయి. దీంతో రహదారిపై మోకాల్లోతు వరద నీరు చేరి వాహనాల వేగం నెమ్మదించింది. శిల్పారామం దగ్గర రోడ్డుపైనే నీళ్లు చేరి ఇరుకుగా మారింది. దీంతో బయోడైవర్సిటీ నుంచి ఐకియా అండర్‌పాస్.. అటు నుంచి సైబర్‌ టవర్స్‌ ఇటువైపు ఖాజాగూడ చౌరస్తా వరకూ వాహనాల రాకపోకలపై ప్రభావం కనిపించింది.

Rangareddy Rains : వానలతో ఆగమాగమాయే.. రాకపోకలు నిలిచిపాయే

Rain Problems in Hyderabad :కూకట్‌పల్లి వై జంక్షన్‌ నుంచి జేఎన్‌టీయూ వరకూ.. వర్షాకాలంలో ఏళ్ల తరబడి ఎదురయ్యే ఈ సారి కనిపించింది. వర్షం నీరు రోడ్డుపైకి చేరి దారి ఇరుకుగా మారి వాహనాలు నెమ్మదిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే వరద సమస్య ట్రాఫిక్‌ను జఠిలం చేస్తోంది. జేఎన్‌టీయూ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర భారీ రద్దీ కనిపించింది. మూసాపేట, బాలానగర్‌ మెట్రోస్టేషన్‌ దగ్గర ఇంజినీరింగ్‌ లోపాల కారణంగా రహదారిపై పెద్దఎత్తున నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ నుంచి భాగ్యనగర్‌ కాలనీలోని ఉషాముళ్లపూడికమాన్‌ వరకూ నీరు నిలిచింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details