ETV Bharat / state

Rangareddy Rains : వానలతో ఆగమాగమాయే.. రాకపోకలు నిలిచిపాయే

author img

By

Published : Jul 20, 2023, 8:01 PM IST

Etv Bharat
Etv Bharat

Heavyrains in Rangareddy district : ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరులో స్థానికులకు ఎదరువుతున్న సమస్యలను పరిష్కరించేందుకు పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్​రూం ఏర్పాటు చేశారు.

రంగారెడ్డి జిల్లాలో కుండపోత వానలు.. గ్రామాలకు నిలిచిన రాకపోకలు

Rain updates in Rangareddy district : రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వానలు దంచికొడుతున్నాయి. చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరులోని కాగ్నా, కొకట్, గాజీపూర్, బెల్కటూరు, రాంపూర్ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

తాండూరులో స్థానికులకు ఎదరువుతున్న సమస్యలను పరిష్కరించేందుకు పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అటు యాలాల మండలం గోవిందరావుపేట, పెద్దేముల్ మండలం గాజీపూర్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వికారాబాద్ జిల్లా దోర్నాల వాగు ఉద్ధృతి కారణంగా నాగారం, అంపల్లి, గురుదొట్ల, రాస్నం, పగిడాల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఆయా గ్రామాల ప్రజలు వాగు దాటకుండా పోలీసులు, రెస్క్యూ అధికారులు కాపలా కాస్తున్నారు. పడిగ్యాల్, మోమిన్​కలాన్, మైలారం గ్రామాలకు కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. స్టేషన్​ థారూర్ వద్ద మూసినది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో థారూర్, యాలల మండలాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం ధాటికి మోమిన్​పేట మండలం కేసారంలో మైబెల్లి శివయ్య ఇల్లు దెబ్బతినగా.. నవాబుపేట మండలం పుల్​మామిడిలో శివరాజమ్మ ఇల్లు కూలిపోయింది. కూలిన ఇంటిని డీఎల్​పీ అనిత, మండల అధికారులు పరిశీలించారు.

గిర్గెటచ్​పల్లి వెళ్లే దారిలో రైల్వేవంతెన వద్ద భారీగా వర్షం నీరు చేరడంతో కోట్​పల్లి, రాళ్లచిట్టంపల్లి, పీలారం, దేవరాపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిగిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పంటపొలాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో మునిగిపోయాయి. పట్టణ వాసులు ఇళ్లకే పరిమితం అయ్యారు. పరిగి మార్కెట్ యార్డులో నీరు చేరడంతో దుకాణాలను మూసివేశారు.

చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తంగడిపల్లి వద్ద ముసురువానకు ఓ ఇంటిగోడ కూలిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అలాగే మండల పరిధిలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పొలాల వద్ద పశువులకు మేత, నీళ్లు పెట్టేందుకు నానా తిప్పలుపడుతున్నారు. వర్షం ధాటికి కుమ్మెర గ్రామంలో 20 గొర్రెలు, 2 మేకలు మృతి చెందాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.