తెలంగాణ

telangana

Indrakaran reddy: 'దేవుని పేరిట కొత్త పాసుపుస్తకాలు తీసుకోవాలి'

By

Published : Sep 11, 2021, 5:11 PM IST

Updated : Sep 12, 2021, 5:09 AM IST

Indrakaran reddy about temple lands
దేవాలయ భూములపై ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష, ఆలయ భూములపై మంత్రి సమీక్ష

ఆలయాల సంబంధిత అంశాలపై అధికారులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలు మెరుగుపర్చాలని... ఈ విషయంలో రాజీపడకుండా పనిచేయాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేవుని పేరిట కొత్త పాసుపుస్తకాలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆలయాల భూములు దేవునికే చెందుతాయన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల్లో దేవుని పేరిట కొత్త పాసుపుస్తకాలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, అధికారులతో సమావేశమైన మంత్రి... ఆలయాల సంబంధిత అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలు మెరుగుపర్చాలని... ఈ విషయంలో రాజీపడకుండా పనిచేయాలని సూచించారు. ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్న ఆయన... ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

చిత్తశుద్ధితో పని చేయాలి

పవిత్రమైన దేవాదాయ భూముల పరిరక్షణకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్న మంత్రి... సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయ భూములపై సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని స్పష్టం చేశారు. ధరణి వెబ్ సైట్, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖలో ఆలయభూములు నిషేధిత జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాదాయ భూములు పరాధీనం, కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలయ భూముల లీజు వ్యవహారంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న మంత్రి... అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేవలకు ఉపయోగించని ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీం కింద జమ చేయడంతో పాటు రక్షణతో కూడిన అధిక వడ్డీ వచ్చేలా చూడాలని మంత్రి... అధికారులకు సూచించారు.

అలసత్వం వద్దు

లీజు బకాయిల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. కరోనా వల్ల దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో పాటు ఆదాయం పడిపోయిందని... అందుకు అనుగుణంగా అనవసర వ్యయాలను నియంత్రించాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ భూముల పరిరక్షణ, ఆదాయ వృద్ధి సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి... ఆలయ భూముల వినియోగం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ఆలయ ఆదాయ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని... క్యాష్ బుక్‌లో ఎప్పటికప్పుడు ఆదాయ, వ్యయాలను అప్డేట్ చేయాలని సూచించారు.

దేవుని మాన్యం స్వాధీనం..

స్పెషల్ డ్రైవ్ ద్వారా అన్యాక్రాంతమైన 2,622 ఎకరాల దేవదాయ శాఖ భూములను ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాల పరంగా చేస్తే అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 1040 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 502 ఎకరాలు, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో 200 ఎకరాలకు పైగా ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కరీంనగర్ లో 186, ఖమ్మంలో 185 ఎకరాలు, రంగారెడ్డిలో 132 ఎకరాలు, ఆదిలాబాద్ లో 115 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ లో 22, హైదరాబాద్ లో నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎక్కువ మొత్తంలో భూములు స్వాధీనం చేసుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇతర జిల్లాల అధికారులు కూడా మరింత ఉత్సాహంతో పని చేయాలని అన్నారు.

ఇదీ చదవండి:V. Hanumantha Rao: ఆ విషయంపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాస్తా

Last Updated :Sep 12, 2021, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details