తెలంగాణ

telangana

Khairatabad Ganesh 2022 : పూజకు కొలువుదీరిన ఖైరతాబాద్‌ గణేశ్‌

By

Published : Aug 31, 2022, 9:40 AM IST

Khairatabad Ganesh
ఖైరతాబాద్‌ గణేశ్‌

Khairtabad Ganesh 2022 : హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ పంచముఖ లక్ష్మి మహా గణపతి రూపంలో గణనాథుడు భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మొట్టమొదటి సారిగా మట్టి వినాయకుడిని ఆకర్షణీయంగా రూపొందించారు. స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తోన్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పూజలకు కొలువుదీరిన ఖైరతాబాద్‌ గణేశ్‌

Khairtabad Ganesh 2022:హైదరాబాద్​లోని ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల పూజలు అందుకునేందుకు కొలువుదీరాడు. ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలీలు పూజలు నిర్వహిస్తారు. అనంతరం పదిన్నర గంటల నుంచి బడా గణేశ్‌ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. తొలిపూజలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పాల్గొంటారని కమిటీ సభ్యులు వెల్లడించారు. లంబోదరుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుతీరారు. జూన్ 10న విగ్రహం తయారీ పనులు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేశారు.

ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీకి కోటిన్నర రూపాయలు ఖర్చు అయ్యిందని నిర్వాహకులు తెలిపారు. మట్టి విగ్రహాల తయారీలో విశేష అనుభవం గడించిన వ్యక్తిని తీసుకువచ్చి రూపొందించినట్లు వెల్లడించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే సహజసిద్ధమైన రంగులతో విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వినియోగించారు. 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాధునికి సమర్పిస్తారు.

ఈసారి వినాయకుడిని హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని అందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. నిమజ్జనం సందర్భంగా బ్రహ్మాండమైన ఊరేగింపుతో తీసుకెళతామన్నారు. స్వామి దర్శనానికి ఖైరతాబాద్ మెట్రో రైలు మార్గం నుంచి ప్రవేశం ఏర్పాటు చేశారు. ఐమాక్స్ వైపు నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం చేశారు. గణేశ్‌ మండపం చుట్టూ భారీ భద్రత కల్పించారు. షీ టీమ్స్‌, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details