తెలంగాణ

telangana

Hyderabad Metro Phase 2 : హైదరాబాద్​ నలువైపులా మెట్రో.. రూ.69 వేల కోట్లతో 278 కి.మీ. మేర నిర్మాణం

By

Published : Aug 1, 2023, 7:16 AM IST

Metro Phase 2 Hyderabad : హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.69,100 కోట్లతో నగరం నలుదిశలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా 8 మార్గాలతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది.

Metro
Metro

హైదరాబాద్‌లో ఫేస్​-2 మెట్రోరైలు విస్తరణకు మంత్రివర్గం ఆమోదం

Hyderabad Metro Phase-2 : శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో బృహత్‌ ప్రణాళికలను సిద్ధం చేసింది. నగరం ఎంత పెరిగినా, ఎన్ని పరిశ్రమలు వచ్చినా, లక్షలాది మంది వచ్చినా.. అందుకు తగినట్లు మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.69 వేల కోట్లతో రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో 278 కిలోమీటర్ల మేర పెద్దఎత్తున మెట్రో ప్రాజెక్టు విస్తరించాలని తీర్మానించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రోకు అదనంగా.. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఇందుకు అదనంగా మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా ఎనిమిది మార్గాలతో పాటు ఔటర్‌రింగ్‌ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది.

TS Cabinet Approves Extension of Metro Phase-2 : ఫార్మా సిటీ రానుండడంతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి జల్‌పల్లి, తుక్కుగూడల మీదుగా కందుకూరు వరకు మెట్రోను విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్‌ టూ లెవెల్‌ కారిడార్‌ను నిర్మించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానిపై ఒక అంతస్తు వాహనాలు, మరో అంతస్తులో మెట్రో రైలు రాకపోకలుంటాయి.

కేంద్రం సహకారం ఉన్నా.. లేకున్నా పూర్తి చేస్తాం: ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా ఈ మార్గం నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌కు, అక్కడి నుంచి లక్డీకపూల్‌ వరకు, విజయవాడ మార్గంలో ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకుమెట్రో రైలు విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉప్పల్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ వరకు, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మెట్రో విస్తరణలో భాగంగా.. కొత్తూరు-షాద్‌నగర్‌ వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఉప్పల్‌ నుంచి ఈసీఐల్ క్రాస్‌రోడ్‌ వరకు కూడా నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నామని.. లేకున్నా మెట్రోను పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

"మెట్రోను విస్తరించడానికి కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. దీన్ని రాబోయే మూడు, నాలుగేళ్లలో పూర్తి చేయాలని మున్సిపల్​ శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాం. వారు సహాయం చేస్తే మంచిది. ఒకవేళ వారు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ప్రయత్నం చేస్తాం. కేంద్రం నుంచి సహకారాలు అందడానికి కేంద్రాన్ని అడుగుతాం. ఇప్పుడు వారు సహాయం చేయకపోయినా 2024లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో బీఆర్​ఎస్​ పాత్ర కీలకంగా ఉంటుంది". - కేటీఆర్​, మున్సిపల్ శాఖ మంత్రి

తొలి దశ మెట్రోలో 69.2 కిలో మీటర్లను మూడు మార్గాల్లో చేపట్టారు. మిగిలిన 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రోను పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండోదశ (A)లో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మార్గం నిర్మాణం టెండర్‌ దశలో ఉంది. రెండో దశ-(B)లో బీహెచ్​ఈల్​- మియాపూర్‌ - గచ్చిబౌలి - లక్డీకపూల్‌ 26 కిలోమీటర్ల మార్గంతో పాటు నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ 5 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.9,100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి డీపీఆర్​ అందజేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details