తెలంగాణ

telangana

ఉప్పల్‌ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో వేళలు పొడిగింపు

By

Published : Apr 2, 2023, 12:31 PM IST

IPL Match at Uppal Stadium Today : నగరంలోని ఉప్పల్​లో నేడు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్​ కోసం కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. మ్యాచ్‌ కోసం 1,500 మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. బ్లాక్ టికెట్లు అమ్మకుండా మఫ్తీలో పోలీసు బృందాలు తిరుగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ దృష్ట్యా ఆ మార్గంలో అధిక సంఖ్యలో మెట్రో రైళ్లు నడవనున్నాయి.

IPL Match at Uppal Stadium
IPL Match at Uppal Stadium

IPL Match at Uppal Stadium Today : హైదరాబాద్​ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నేడు జరగనున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. సాధారణ పౌరులు, ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఉప్పల్​లో జరిగే మ్యాచ్​ల కోసం ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయని.. ఎవరైనా బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

1500 మందితో భద్రతా ఏర్పాట్లు : ఐపీఎల్‌ మ్యాచ్‌కు 1500 మంది పోలీసు సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా.. చర్యలు తీసుకున్నామన్న ఆయన.. క్రికెట్ మ్యాచ్‌ అయిపోయిన తర్వాత పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలన్నారు. స్టేడియం లోపల, బయట, తనిఖీ ప్రదేశాలు, గేట్ల వద్ద, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలలోనూ మొత్తం 340 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తక్షణ చర్యలు తీసుకునేందుకు, అన్ని సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా జాయింట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్​ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యవసర సమయంలో ప్రేక్షకులకు తక్షణ వైద్య సేవల కోసం 7 అంబులెన్సులను అందుబాటులో ఉంచామన్నారు. 4 ఫైర్‌ ఇంజిన్లు స్టేడియం వద్ద సిద్ధంగా ఉంటాయని సీపీ చౌహాన్ వివరించారు.

స్టేడియం చుట్టూ మఫ్తీలో పోలీసు బృందాలు : స్టేడియం చుట్టూ బ్లాక్ టికెట్లు అమ్మకుండా మఫ్తీలో పోలీసు బృందాలు తిరుగుతారని చౌహాన్ పేర్కొన్నారు. మహిళలపై ఎలాంటి వేధింపులకు తావు లేకుండా ప్రత్యేకంగా 'షీ టీం'లను నియమించినట్లు తెలిపారు. స్టేడియానికి నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామని.. భారీ వాహనాలు ఉప్పల్‌ స్టేడియం వైపునకు అనుమతి లేదని ట్రాఫిక్‌ డీసీపీ అభిషేక్ మహంతి తెలిపారు. వాహనదారులకు స్టేడియం వద్ద ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మెట్రో వేళల సమయం పెంపు : ఇవాళ ఐపీఎల్ మ్యాచ్‌ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్లను రాత్రి 1 గంట వరకు నడపనున్నారు. ప్రేక్షకులు 3.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను చూసేందుకు మధ్యాహ్నం నుంచే స్టేడియం చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో నేడు నాగోల్-అమీర్‌పేట్ మార్గంలో ఎక్కువ మెట్రో రైళ్లు నడపనుంది. మధ్యాహ్నం 12.30 నుంచి అధిక సంఖ్యలో మెట్రో రైళ్లు తిరుగుతాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్​రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details