ETV Bharat / sports

IPL 2023 : చరిత్ర సృష్టించిన ఉమేశ్​ యాదవ్​, మార్క్​వుడ్.. సూపర్​ బౌలింగ్​ గురూ!

author img

By

Published : Apr 2, 2023, 9:07 AM IST

ఐపీఎల్‌లో కోల్​కతా ఫాస్ట్‌బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మరోవైపు, లఖ్​నవూ బౌలర్‌ మార్క్‌వుడ్‌ ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మార్క్‌వుడ్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు.

umesh-yadav-becomes-bowler-most-wickets-against-single-opponent and markwood new record
umesh-yadav-becomes-bowler-most-wickets-against-single-opponent and markwood new record

ఐపీఎల్‌లో టీమ్​ఇండియా పేసర్‌, కేకేఆర్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్‌ రికార్డులకెక్కాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌.. ఈ అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్‌ యాదవ్‌ 34 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబయిపై అత్యధికంగా 33 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును ఉమేశ్‌ బ్రేక్‌ చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై పంజాబ్‌ కింగ్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో భారీ వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో డీఎల్‌ఎస్‌ ప్రకారం 16 ఓవర్లకు కోల్‌కతా విజయ సమీకరణం 154 పరుగులుగా ఉంది. 7 పరుగులు కేకేఆర్‌ వెనుకబడి ఉండడంతో పంజాబ్‌ను విజేతగా నిర్ణయించారు.

మార్క్​వుడ్​ నయా చరిత్ర..
ఇంగ్లాండ్‌ బౌలర్‌ మార్క్‌వుడ్‌ ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మార్క్‌వుడ్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్‌లో లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు మార్క్‌వుడ్‌. ఇప్పటివరకు లఖ్​నవూ తరపున మోసిన్‌ ఖాన్‌(4 వికెట్లు) 2022లో దిల్లీ క్యాపిటల్స్‌పై అత్యుత్తమంగా ఉంది. టీ20 క్రికెట్‌లోనూ మార్క్‌వుడ్‌కు ఇదే తొలి ఐదు వికెట్లు హాల్‌ కావడం విశేషం. ఐపీఎల్‌లో ఐదు వికెట్ల హాల్‌ అందుకున్న రెండో ఇంగ్లాండ్‌ బౌలర్‌గా మార్క్‌వుడ్‌ నిలిచాడు. ఇంతకముందు 2012 ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన దిమిత్రి మస్కరెనాస్‌ 25 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ఐదు వికెట్ల హాల్‌ నమోదవడం ఇది తొమ్మిదోసారి. ఇంతకముందు సోహైల్‌ తన్వీర్‌(2008), బాలాజీ(2008), అమిత్‌ మిశ్రా(2008), అనిల్‌ కుంబ్లే(2009), లసిత్‌ మలింగ(2011), దిమిత్రి మస్కరెనాస్‌(2012), సునీల్‌ నరైన్‌(2012), భువనేశ్వర్‌(2017).. తాజాగా 2023 ఐపీఎల్‌లో మార్క్‌వుడ్‌ ఈ ఘనత అందుకున్నాడు.

మ్యాచ్​ విషయానికొస్తే.. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుపై 50 పరుగుల తేడాతో లఖ్​నవూ ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ (56; 48 బంతుల్లో 7 ఫోర్లు) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. రిలీ రోసోవ్ (30) ఫర్వాలేదనిపించాడు. పృథ్వి షా (12), మిచెల్​ మార్ష్​ (0), సర్ఫరాజ్​ ఖాన్ (4), పావెల్​ (1), హకీమ్​ ఖాన్ (4), అక్షర్​ పటేల్ (16)​, చేతన్​ సకారియా (4), కుల్దీప్​ యాదవ్​ (6*), ముకేశ్​ కుమార్ (0*) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. ఇక, దిల్లీ బౌలర్లలో.. మార్క్‌ వుడ్ 14 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.