తెలంగాణ

telangana

Group-2 Candidates Protest Hyderabad : గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల పోరుబాట

By

Published : Aug 10, 2023, 12:58 PM IST

Updated : Aug 10, 2023, 8:31 PM IST

Group-2 Candidates Protest Hyderabad : గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద అభ్యర్థులు నిరసనలతో హోరెత్తించారు. వివిధ ప్రాంతాల వేలాదిగా తరలివచ్చిన యువతీయువకుల నినాదాలతో కమిషన్‌ కార్యాలయ పరిసరాలు మార్మోగాయి. వాయిదా ప్రకటన వచ్చే వరకు కదలబోమంటూ అభ్యర్థులు పట్టుబట్టగా.. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. అభ్యర్థులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌, టీజేఎస్‌ నేతలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు.

Group 2 Candidates Protest at TSPSC Office
TSPSC Office

Group 2 Candidates Protest Hyderabad గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల పోరుబాట

Group-2 Candidates Protest Hyderabad : రాష్ట్రంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించ తలబెట్టిన గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ డిమాండ్‌ చేస్తూ వస్తున్న అభ్యర్థులు.. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో పోరుబాట పట్టారు. ఈ నెలారంభం నుంచి 23 వరకు వరుసగా గురుకుల పరీక్షలు ఉండగా.. వెంటనే గ్రూప్‌-2 పరీక్షలను ఖరారు చేయటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురుకుల, గ్రూప్ -2 సిలబస్ వేర్వేరు కావటంతో రెండింటిలో ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంటుందని అభ్యర్థులు వాపోతున్నారు.

Group-2 Candidates Protest at TSPSC Office : : ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి.. హైదరాబాద్‌ నాంపల్లికి వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. టీఎస్‌పీఎస్సీ (TSPSC)ముట్టడికి యత్నించారు. ఉదయం అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నేతలు వస్తుండగా పలువురిని అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఒక్కసారిగా వేలాది మంది తరలివచ్చి కార్యాలయం వద్ద బైఠాయించారు.

గ్రూప్‌-2 పరీక్షకు ఇలా ప్రిపేర్ అవ్వండి..!

వీరికి టీజేఎస్‌ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, కాంగ్రెస్‌ నేతలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌.. కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు అశోక్‌, రియాజ్‌ కమిషన్‌ కార్యాలయం వద్దకు చేరుకుని, అభ్యర్థులకు మద్దతు తెలిపారు.ప్రభుత్వం వాయిదా నిర్ణయం ప్రకటించే వరకు వెనక్కి తగ్గబోమని ఆందోళనకారులు తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ నేతృత్వంలో అభ్యర్థుల బృందం.. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు.

"అన్ని పరీక్షలు వెంటవెంటనే పెడితే ఎలా రాయగలుగుతాం. మేము గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నాం ఏడు సంవత్సరాలు ఖాళీగా ఉండి.. ఒకేసారి అన్ని పరీక్షలు పెడితే ఎలా? మేం శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాం. గ్రూప్‌ 2 సిలబస్‌ కూడా మార్చారు.. ప్రిపేర్‌ అయ్యే సమయం లేదు." - గ్రూప్- 2అభ్యర్థులు

Group 2 Exams Telangana 2023 : గ్రూప్-2 పరీక్షకు TSPSC ఏర్పాట్లు.. త్వరలో ఆ ఫలితాలు.!

Group 2 Exam Postpone Demand :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ఛైర్మన్‌ అందుబాటులో లేకపోవటంతో.. కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను కలిసి విన్నవించగా.. ఆమె 48 గంటల సమయం అడిగారు. ఆందోళన విరమించి తిరిగి వెళ్లాలని పోలీసులు కోరగా.. ససేమిరా అన్న అభ్యర్థులు పబ్లిక్‌ సర్వీసు కమిషన్ కార్యాలయం పక్కనున్న మైదానంలో బైఠాయించారు. ప్రభుత్వం ఏదైనా స్పష్టతనిచ్చే వరకు తాము కదలబోమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితి చేయిదాటకుండా బల్మూరి వెంకట్‌తో పాటు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు అశోక్‌, రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా కేసీఆర్ నీరోను తలపించారని.. ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు అగ్నిపరీక్ష పెడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిఆక్షేపించారు. అభ్యర్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. రాష్ట్ర సర్కార్ పట్టింపులకు వెళ్లకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు.

"అభ్యర్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ అందరికి వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం." - కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు

ఉదయం నుంచి అభ్యర్థులంతా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం పక్కన బైఠాయించడంతో.. పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడి నుంచి కదలకపోవటంతో పోలీసులు రంగంలోకి దిగి.. మైదానం ఖాళీ చేయించారు. పలువురు అభ్యర్థులు పట్టువీడకపోవటంతో స్వల్ప లాఠీఛార్జ్‌ చేసి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద కాసేపు ట్రాఫిక్‌ జామ్ అయింది.

మరోవైపు పోలీసుల అరెస్ట్‌లతో గాంధీభవన్ మెట్రోస్టేషన్‌లోకి వెళ్లి.. పలువురు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఒకే నెలలో మూడు వేర్వేరు పరీక్షలుంటే విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతారని.. గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exam Telangana) వాయిదా వేయాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు.

మరోవైపు... గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు వరసగా ఉన్నందున పరీక్ష తేదీలను రీషెడ్యూలు (Group-2 Re Schedule) చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ నెలలోనే గ్రూప్‌-2తో పాటు మరో 7 పరీక్షలు ఉన్నాయని వివరించారు. ఈ పిటిషన్లపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Telangana SI Results Released : తెలంగాణ ఎస్​ఐ తుది ఫలితాలు విడుదల

SSC Jobs : ఎస్​ఎస్​సీ భారీ నోటిఫికేషన్​.. డిగ్రీ అర్హతతో 1876 ఎస్​ఐ​ పోస్టుల భర్తీ!

Last Updated : Aug 10, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details