తెలంగాణ

telangana

రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

By

Published : Mar 13, 2021, 4:35 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు.. ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలతో ప్రచారం ముగిసింది. ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రముఖ పార్టీలు.. స్వతంత్ర్య అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన పోలింగ్.. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.

రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

సాధారణ ఎన్నికలను తలపించేలా సాగిన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రచార గడువు ముగిసింది. ఇవాళ పోలింగ్‌కు సంబంధించిన సామగ్రి పంపిణీ చేయనున్నారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ స్థానానికి మొత్తం తొమ్మిది నూతన జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 5 లక్షల 31 వేల 268 ఉన్నారు. మొత్తం 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో అధికంగా 93 మంది ఉండడంతో.. జంబో బాలెట్ పేపర్‌తో పాటు జంబో బాలెట్ బాక్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 8గంటల వరకు బషీర్ బాగ్, ఎల్బీ స్టేడియానికి రావాలని ఎన్నికల సిబ్బందికి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యాక సరూర్ నగర్ స్టేడియంలో బ్యాటెల్ బాక్సులను భద్రపరచనున్నారు. ఈ నెల 17న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

బరిలో 71 మంది..

వరంగల్‌-ఖమ్మం-నల్గొండలో 5 లక్షల 5వేల 565 మంది పట్టభద్ర ఓటర్లున్నారు. 731 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో.. జంబో బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తున్నారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు జరగనున్న పోలింగ్... 17న జరిగే లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని యంత్రాంగానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగడానికి ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో.. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ , స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం 3వేల 835 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు.

గతంలో కంటే భిన్నంగా..

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఎన్నికలు గతం కంటే భిన్నంగా ఈసారి తెల్ల బ్యాలెట్ పేపర్ తయారు చేశారు. మహారాష్ట్రలోని పుణె, కొల్హాపూర్, నాగపూర్, ఔరంగబాద్‌లో గులాబీ పేపర్ల కొరత వల్ల ఈసారి తెల్ల రంగు బ్యాలెట్​ను ముద్రించారు. అయితే రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎన్నికలు మాత్రం గులాబీ బ్యాలెట్ పేపర్‌తో సాగుతాయి.

ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో తెలుసా!

ABOUT THE AUTHOR

...view details