తెలంగాణ

telangana

Dengue effect: రాష్ట్రంలో డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలపై తీవ్ర ప్రభావం

By

Published : Oct 11, 2021, 4:56 AM IST

రాష్ట్రంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. కేవలం 5 వారాల్లోనే 2,443 మంది కొత్తగా డెంగీ బారిన పడ్డారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Dengue fever increased in Telangana districts
రాష్ట్రంలో డెంగీ విజృంభణ

రాష్ట్రంలో ఒకవైపు కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా..మరోవైపు డెంగీ పంజా విసురుతోంది. వరసగా వర్షాలు కురుస్తుండటం ..పలుచోట్ల ఇళ్లలో, పరిసరాల్లో నీళ్లు నిలుస్తుండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. అదే స్థాయిలో డెంగీ జ్వరాల బారిన పడేవారి సంఖ్యా పెరుగుతోంది. గత అయిదు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2443 కొత్త కేసులు నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా..రాష్ట్రంలో మరో 11 జిల్లాల్లోనూ ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ దోమలు కుట్టకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆగస్టు నుంచి పెరిగిన ఉద్ధృతి

ఈ ఏడాదిలో జనవరి నుంచి జులై వరకూ డెంగీ కేసులు పరిమిత సంఖ్యలోనే నమోదయ్యాయి. ఆగస్టు నుంచి ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 601 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్క ఆగస్టులోనే దాదాపు రెండింతలు అధికంగా(1,720) నమోదయ్యాయి. సెప్టెంబరు 1 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ 2,443 నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే సమయంలో మలేరియా కేసులు కూడా తగ్గడం లేదు. గత 5 వారాల్లో కొత్తగా 107 మంది మలేరియా బారినపడినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఏటా ఆగస్టు-అక్టోబరు మధ్య కాలంలో డెంగీ కేసులు పెరుగుతుంటాయి. ఈ జ్వరాలకు కారణమయ్యే దోమలు నిల్వ ఉన్న నీరు, చెత్తలో వృద్ధిచెందుతాయి. ఇళ్లతోపాటు బడులు, కళాశాలలు, కార్యాలయాల్లో కుట్టడానికి అవకాశాలుంటాయి. సాధ్యమైనంత వరకూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా పాత టైర్లు, ఎయిర్‌కూలర్లు, వాడేసిన వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. దోమతెరలు వాడాలి’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఏడాదిలో అక్టోబరు 4 నాటికి అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన జిల్లాలు

ఆదిలాబాద్‌ 158, హైదరాబాద్‌ 1,189, కరీంనగర్‌ 115, ఖమ్మం 579, భద్రాద్రి కొత్తగూడెం 209, మహబూబ్‌నగర్‌ 346, మేడ్చల్‌ మల్కాజిగిరి 279, నిర్మల్‌ 141, నిజామాబాద్‌ 210, రంగారెడ్డి353, సంగారెడ్డి 109, సూర్యాపేట 164.

ఇదీ చూడండి:Dengue Fever: ఆస్పత్రుల్లో నిలువు దోపిడీ... డెంగీ పేరుతో లక్షలు గుంజేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details