తెలంగాణ

telangana

పోలవరం ప్రాజెక్టుపై కరోనా ప్రభావం

By

Published : May 18, 2020, 11:19 AM IST

కరోనా కలవరంతో కూలీలంతా స్వస్థలాలకు వెళ్లిపోవటంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఉన్న కొద్దిపాటి కూలీలలతో పనులు చేయిస్తున్నా అనుకున్న సమయానికి పోలవరం పూర్తవటం కష్టమే.

corona-effect-on-lift-irrigation-projects-in-ap
పోలవరం ప్రాజెక్టుపై కరోనా ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కరోనా కష్టమొచ్చింది. దాదాపు ఏడాది కాలంగా నిర్మాణ పనులు ఆగిపోయి ప్రభుత్వ సానుకూల నిర్ణయంతో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా కూలీల కొరత తలెత్తింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వేలాది మంది కూలీలు తట్టాబుట్టా సర్దుకుని ఎవరి గ్రామాలకు వారు వెళ్లిపోతుండటమే ఇందుకు కారణం.
కొన్ని నెలలుగా ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఒక్క పోలవరం, వెలిగొండ, చింతలపూడి వంటి కొన్ని ప్రాజెక్టుల్లో అక్కడక్కడా పనులు జరగడం మినహా దాదాపు అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మట్టి పనులు, కాంక్రీటు పనులూ చాలా చోట్ల చేయలేకపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టుల సమీక్ష - ప్రాధాన్యం పేరుతో నిర్మాణాలు నిలిపివేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఏ ప్రాజెక్టులు అవసరం? ఏది అవసరం లేదు? అన్న కోణాల్లో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి కార్యాలయ నిర్ణయం మేరకు కొలిక్కి తీసుకువచ్చారు. ఆ పనులను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించినా బిల్లుల చెల్లింపు సమస్యలతో అవీ సాగలేదు.

పోలవరానికీ కష్టమే
పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు చేసే దాదాపు 3,000 మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఉన్న కొద్ది మందితో పాటు స్థానికంగా మరో 200, 300 మందిని వినియోగించుకుని ఉన్నంతలో పనులు సాగిస్తున్నారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులూ మందకొడిగానే సాగుతున్నాయి. ఈ ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కీలకంగా ఉంటుందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఎట్టకేలకు శ్రామికులను పెంచి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఉన్నతస్థాయిలో ఆదేశాలు ఇస్తే కరోనా కారణంగా ఉన్న కూలీలే వెళ్లిపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

ఇదీ చదవండి:ఇవాళ కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ

ABOUT THE AUTHOR

...view details