తెలంగాణ

telangana

TSLPRB: ఆ అభ్యర్థుల ఖాతాలో ముందే రెండు మార్కులు

By

Published : Sep 1, 2022, 6:50 AM IST

TSLPRB: కానిస్టేబుల్‌ స్థాయి ప్రాథమిక రాతపరీక్ష కీ ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. పరీక్ష కీని వెబ్​సైట్​లో ఉంచారు. ఈ పరీక్షలో మాత్రం ఎలాంటి ప్రశ్నలను తొలగించలేదని చెప్పింది. అయితే సరైన సమాధానాలతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ రెండు మార్కులు మాత్రం కలవనున్నాయని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది.

tslprb
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ

TSLPRB: యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్‌ స్థాయి ప్రాథమిక రాతపరీక్ష కీ ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. పోలీసుశాఖలో 15,644, ఆబ్కారీశాఖలో 614, రవాణాశాఖలో 63 పోస్టుల కోసం ఆగస్టు 28న ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈనేపథ్యంలో పరీక్ష కీని మండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఏవైనా అభ్యంతరాలుంటే బుధవారం ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 2 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. దీనికోసం ప్రతి అభ్యర్థి వ్యక్తిగత ఖాతాలో వెబ్‌ టెంప్లెట్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రతీ అభ్యంతరానికి ప్రత్యేక వెబ్‌ టెంప్లెట్‌ ద్వారా దరఖాస్తు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలా చేయకుంటే పరిగణనలోకి తీసుకోబోమన్నారు. మాన్యువల్‌గా చేసే దరఖాస్తులు చెల్లుబాటు కావన్నారు.

ఆ ప్రశ్నల్ని వదిలేసినా మార్కులే:ఎస్సై స్థాయి ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నాపత్రాల్లో దొర్లిన తప్పిదాల కారణంగా 8 ప్రశ్నలను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 8 మార్కులను కలిపారు. తాజాగా కానిస్టేబుల్‌ స్థాయి ప్రాథమిక పరీక్షలో మాత్రం ఎలాంటి ప్రశ్నల తొలగింపు జరగలేదు. అయితే సరైన సమాధానాలతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ రెండు మార్కులు మాత్రం కలవనున్నాయి. ఉదాహరణకు ‘ఎ’ బుక్‌లెట్‌లో 56వ, 129వ ప్రశ్నలకు నాలుగు ఆప్షన్లు సరైన సమాధానాలే. అభ్యర్థులు ఏ ఆప్షన్‌పై టిక్‌ చేసినా మార్కు వచ్చినట్లే. అలాగే ఆ రెండు ప్రశ్నల్ని వదిలేసినా మార్కు ఉన్నట్లే లెక్క.

* మరో మూడు ప్రశ్నలను వదిలేసినా మార్కుల్ని కలపనున్నారు. ఉదాహరణకు ‘ఎ’ బుక్‌లెట్‌లో 68వ ప్రశ్నకు ఆప్షన్‌ ‘4’.. 76వ ప్రశ్నకు ఆప్షన్‌ ‘4’.. 158వ ప్రశ్నకు ఆప్షన్లు ‘1’, ‘3’ సరైన సమాధానాలు. ఆయా ప్రశ్నలకు ఆ ఆప్షన్లను గుర్తించిన వారికి మార్కులిస్తారు. అలాగే ఆ మూడు ప్రశ్నల్ని గుర్తించని వారికీ మార్కులు కలపనున్నారు.

ఇవీ చదవండి:కానిస్టేబుల్‌ అభ్యర్థులను ఆ ప్రచారం నమ్మొద్దంటున్న టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్

దేశంలో ఎక్కడున్నా ఆ బడిలో చేరొచ్చు.. తొలి వర్చువల్​ స్కూల్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details