తెలంగాణ

telangana

Congress on Assembly Sessions 2023 : అసెంబ్లీలో బీఆర్ఎస్​ను నిలదీసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న కాంగ్రెస్

By

Published : Aug 3, 2023, 6:00 AM IST

Congress on Telangana Assembly Sessions 2023 : అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు హస్తం పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ప్రజా సమస్యలను చర్చించేందుకు కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశాలల్లో కాంగ్రెస్‌ పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది.

Congress
Congress

Telangana Assembly Monsoon Sessions 2023 :తెలంగాణలో అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఎన్నిక‌ల ముందు జరగనుండడం, చిట్టచివ‌రి స‌మావేశాలు కావ‌డంతో ప్రభుత్వ తీరుపై ఎదురుదాడికి కాంగ్రెస్‌ సిద్దమవుతోంది. రేపు ఉదయం ప‌ద‌కొండున్నర గంటలకు స‌మావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవ‌ల మ‌ర‌ణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ‌న్న, మాజీ ఎమ్మెల్యేల‌ మ‌ర‌ణాల‌కి సంతాపం ప్రక‌టించిన తరువాత స‌భ వాయిదా ప‌డ‌నుంది. ఆ త‌ర్వాత స్పీక‌ర్ అధ్యక్షత‌న జ‌రగనున్న బీఏసీ స‌మావేశంలో అసెంబ్లీ ప‌ని దినాలు, ఎజెండాను ఖ‌రారు చేస్తారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు కనీసం 20 రోజులు అసెంబ్లీ స‌మావేశాలు కొనసాగించాల‌ని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టాలని యోచిస్తున్నారు.

Congress Strategy for Telangana Assembly Sessions 2023 : ఇటీవ‌ల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వ‌ర్షాల‌కు రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోవడం, వాతావరణ శాఖ హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చొరవచూపని వైనాన్ని ఎండగట్టేందుకు సీఎల్పీ సిద్దమైంది. రాష్ట్రంలో దాదాపు 15 ల‌క్షల ఎక‌రాల్లో పంటన‌ష్టం జరిగితే, ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లు మంజూరు చేయ‌డాన్ని హస్తం నేతలు త‌ప్పుబ‌డుతున్నారు. వరికి ఎకరానికి రూ.20 వేలు, పత్తికి రూ.15 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలని, ఇల్లు కూలిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, చనిపోయిన పశువులకు రూ.65వేలు లెక్కన ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తోంది. వీటన్నింటిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని హస్తం పార్టీ యోచిస్తోంది.

Telangana Assembly Sessions 2023 : ఈ అసెంబ్లీ స‌మావేశాలుచిట్టచివ‌రివి కావ‌డంతో... గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హ‌మీల అమ‌లుపై చర్చ కోసం కాంగ్రెస్ పట్టుబట్టాలని భావిస్తోంది. రుణ మాఫీ, డ‌బ‌ుల్ బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, భూ అక్రమాలు త‌దిత‌ర అంశాల‌పై ప్రభుత్వాన్ని నిల‌దీసేందుకు హాస్తం పార్టీ ఎమ్మెల్యేలు వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ నేత‌లు చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉండడంతో... ఎదురుదాడి చేసేందుకు వారు చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రాజెక్టులల్లో సాంకేతిక లోపంతోనే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని ప్రభుత్వాన్నిఇరకాటంలో పడేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన విషయాలను ప్రస్తావించేందుకు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరదల్లో జరిగిన నష్టంపై ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నారు.

ఆ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న హస్తం పార్టీ :ఇప్పటికే ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగా తమ వాదన వినిపించనున్నారు. ప్రభుత్వ హామీలు, వైఫల్యాలపై నిలదీయడానికి ఎవరెవరు ఏయే అంశాలపై మాట్లాడాలన్న అంశాన్ని సీఎల్పీ సమావేశంలో నిర్ణయించుకోనున్నారు. ప్రధానంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, సర్సీస్‌ కమిషన్‌ వైఫల్యాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ధరణి పోర్టల్‌ లోపాలు, 111 జీవో ఎత్తివేతతో తలెత్తనున్న ఇబ్బందులు, రుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధు, అవుటర్ రింగ్ రోడ్ టెండర్‌ తదితర అంశాలపై ప్రభుత్వ లోపాలను ఎండగట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగితే... ప్రజా సమస్యలపై చర్చించేందుకు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details