తెలంగాణ

telangana

Uttam Kumar reddy: ఆ రాష్ట్రంతో పాటు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు : ఉత్తమ్‌

By

Published : Apr 18, 2022, 6:54 PM IST

Updated : Apr 18, 2022, 7:57 PM IST

Uttam Kumar reddy: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని.. కర్ణాటకతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని అభిప్రాయపడ్డారు. పోలీసు వ్యవస్థను నాశనం చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఆయన మాట్లాడారు.

Uttam Kumar reddy
ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి

Uttam Kumar reddy: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను సర్వ నాశనం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఏపీలో పోలీసు వ్యవస్థకు మంచి పేరు ఉండేదని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను ప్రజలు చీత్కరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాలు, దోపిడీ కోసం పోలీసులను వాడుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అనుకూలంగా ఉన్నవారికే పదోన్నతులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు 20 జిల్లాల్లో ఐపీఎస్‌లకు పోస్టింగ్‌ ఇవ్వట్లేదని వెల్లడించారు. సమర్థత, నిజాయితీ ఉన్న పోలీసులకు పోస్టింగ్‌ ఇవ్వట్లేదని ఉత్తమ్​ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటకతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారన్నారు. గవర్నర్‌ వ్యవస్థను తెరాస ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. నియోజకవర్గాల్లో కూడా ప్రొటోకాల్‌ పాటించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఇంత వికృతమైన పరిపాలన ఊహించలేదు. కుటుంబపాలన, పోలీసు అధికారుల మాఫీయా నడిపిస్తోంది. పోలీసుల వేధింపులు తాళలేక రామాయంపేటలో ఓ కుటుంబం బలైంది. కేసీఆర్ పాలన పోలీసులు, డబ్బుతో నడుస్తోంది. తెరాసను ప్రజలు బొందపెట్టడం ఖాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పోలీసులకు మంచి పేరు ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ వల్ల సర్వనాశనమైంది.

- ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ఎంపీ

తెరాస నేతలు, పోలీసు అధికారుల వేధింపులు తాళలేక రామాయంపేటలో ఓ కుటుంబం బలైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై హత్య చేస్తే.. ఇంతవరకు దోషులను పట్టుకోలేదన్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కొడుకు చేసిన పనికి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో అతీగతీ లేదని మండిపడ్డారు.

హైదరాబాద్ పరిధిలో డీసీపీలు ఏళ్ల తరబడి ఓకే దగ్గర పనిచేస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. తెరాస ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు తీసుకుని ఎస్సై, ఇతర పోస్టింగ్​లకు రికమెండ్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని పోస్టింగ్​లు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఖమ్మంలో మున్సిపల్ కౌన్సిలర్ ముస్తఫాపై దొంగ కేసు పెడితే కోర్టు కొట్టేసిందన్నారు. హుజూర్​నగర్​లో గోపీగౌడ్ అనే వ్యక్తి పై తప్పుడు కేసు పెట్టి.. అతను తెరాసలో చేరిన తర్వాత కేసు తొలగించారన్నారు. ఎమ్మెల్యేలకు ఐదారుమంది పైలెట్ ఎస్కార్ట్​లు ఎందుకని ప్రశ్నించారు. గ్రామాల్లో తెరాస నేతలు అరాచకం సృష్టిస్తున్నారని.. కేసీఆర్ మేనల్లుడు సంతోష్ చెప్తేనే పోలీసు శాఖలో బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు.

పోలీసు వ్యవస్థను నాశనం చేసిన ఘనత కేసీఆర్‌దే: ఉత్తమ్

ఇవీ చూడండి:'తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాలకే భారీగా ఖర్చు.. ఇదే కొనసాగితే..'

దిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. విచారణకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి

'అతడ్ని పెళ్లి చేసుకో'.. బలవంతపెట్టిన భర్త.. 15 మందితో కలిసి దాడి

'పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు'

Last Updated : Apr 18, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details