తెలంగాణ

telangana

ఆ సంస్థల్లో ఆడిటింగ్‌ మర్చిపోయిన వాణిజ్య పన్నుల శాఖ

By

Published : Apr 13, 2023, 9:06 AM IST

Commercial Taxes Department Forgot Auditing: వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఆడిట్‌ చేయడాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పూర్తిగా మర్చిపోయింది. తద్వారా వ్యాపార లావాదేవీల అక్రమాల్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. నిర్దేశించిన పన్నులకంటే ఎక్కువ చెల్లించామంటూ దరఖాస్తు చేసుకునే వారికి ప్రతి ఏడాది సగటున రూ.1,200 కోట్ల మేర తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు.

Commercial Taxes Department Forgot Auditing
Commercial Taxes Department Forgot Auditing

వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఆడిటింగ్‌ను మర్చిపోయిన వాణిజ్య పన్నుల శాఖ

Commercial Taxes Department Forgot Auditing: రాష్ట్రంలో మూడున్నర లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించే వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. ఆవన్నీ తమ వ్యాపార కార్యకలాపాలకు చెందిన జీఎస్టీ, విలువ ఆధారిత పన్నులను చెల్లిస్తుంటాయి. 2017లో జీఎస్టీ చట్టం వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి ఆడిట్‌ జరగలేదు. వాస్తవానికి కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ కానీ, ఎప్పటికప్పుడు వ్యాపార, వాణిజ్య సంస్థలను తనిఖీ చేసి పన్నుచెల్లింపు నిశితంగా పరిశీలించాలి.

ఎక్కడైనా తేడాలు ఉన్నట్లు తనిఖీలు, ఆడిటింగ్‌లో గుర్తిస్తే వెంటనే నోటీసులిచ్చి తగ్గిన పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2018-23కి సంబంధించి ఇప్పటి వరకు ఆడిట్‌ జరగకపోవడంతో వ్యాపార, వాణిజ్య సంస్థల అక్రమాల్ని గుర్తించే అవకాశం లేకుండా పోయింది. గడువు ముగిశాక ఆడిట్‌ చేసి పన్నులు చెల్లింపులు సక్రమంగా లేదని తేల్చినా.. పెద్దగా ప్రయోజనం ఉండదని అధికారులు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో వెళ్తేతప్ప గుర్తించలేం: ప్రధానంగా స్థిరాస్తి, గ్రానైట్, హోటళ్లు, బంగారు క్రయవిక్రయాలు వంటి అనేక వాణిజ్య సంస్థల్లో ఇప్పటికీ నగదు లావాదేవీలు ఎక్కువగా ఉంటున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఆ లావాదేవీలను రికార్డుల్లో రాయరని, వాటిపై ఎంత చెల్లించారో కనిపెట్టేందుకు ఆయా సంస్థల బ్యాంకుల లావాదేవీలు, జీఎస్టీ, ఐటీ రిటర్నులు, ఇతర చెల్లింపులను పక్కాగా పరిశీలించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయికి వెళ్తేతప్ప 100 శాతం లావాదేవీలకు పన్నులు చెల్లిస్తున్నారా లేదా అనేది గుర్తించలేరు. పలువురు వ్యాపారులు పొరపాటున ఎక్కువ పన్ను చెల్లించామని దరఖాస్తు చేస్తే వాణిజ్య పన్నుల శాఖ సొమ్ము వెనక్కి ఇస్తోంది.

లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా?: ఆ విధంగా 2017-19 మధ్య రూ.9 వేల కోట్లుకు పైగా వెనక్కి ఇచ్చినట్లు అంచనా. ఐతే అలా ఇచ్చేముందు ఫిర్యాదు చేసిన సంస్థ లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా? ఉంటే 100 శాతం పన్నులు చెల్లించారా? లేదా, అడిగినంత సొమ్ము ఇవ్వాల్సిన అవసరముందా? అనే అంశాలపై తనిఖీలు చేయడం లేదు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తే ఆడిగిన మొత్తంలో కనీసం 10 నుంచి 20 శాతం సొమ్ము వెనక్కి ఇచ్వాల్సిన అవసరమే ఉండదని అధికారులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు ఆడిట్‌ గడువు పొడిగించుకుంటూ వస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆడిట్‌ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details