తెలంగాణ

telangana

నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ

By

Published : Aug 20, 2022, 5:01 AM IST

Cm kcr praja deevena sabha రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోన్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్‌ మునుగోడు మండల కేంద్రంలో జరిగే ప్రజా దీవెన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సుమారు లక్ష మందికి పైగా జనాలు వస్తారనే అంచనా నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో గత పది రోజులుగా తెరాస శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.

Cm kcr praja divena sabha in munugode, nalgonda district
నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ

Cm kcr praja deevena sabhaగతేడాది ఏప్రిల్‌లో జరిగిన నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలోనూ రెండు నెలలు ముందుగా కృతజ్ఞతాసభ పేరుతో అధికార తెరాస హాలియాలో సీఎం సభను ఏర్పాటు చేసింది. ఉపఎన్నిక నవంబరులో ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఇప్పుడూ అదే మాదిరిగానే పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో నియోజకవర్గానికి హామీల వర్షం కురిపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గంలో భారీ కాన్వాయ్‌తో మధ్యాహ్నం రెండు గంటలకు మునుగోడుకు చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడే మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ఈ సభలోనే పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.

అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల తెరాస అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ అసమ్మతి నేతలు ఇప్పటికే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ సభ అనంతరం నియోజకవర్గంలోని సర్పంచిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాతనే అభ్యర్థిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు ఈటీవీభారత్‌కు వెల్లడించారు.

మరోవైపు శనివారం రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా (20 ఆగస్టు) నేడు మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్ర చేయాలని నిర్ణయించాయి. ఆరు మండలాలు, ఒక ప్రతిపాదిత మండల కేంద్రాల్లో జరిగే పాదయాత్రల్లో పీసీసీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పొర్లుగడ్డతండాలో జరిగే పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్ర సందర్భంగా మన మునుగోడు - మన కాంగ్రెస్‌ కరపత్రాలను ప్రతి బూత్‌లో అంటించాలని పార్టీ శ్రేణులకు పీసీసీ నేతలు పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటూ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సభ రోజే నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్ర చేయడం, అందులోనూ రేవంత్‌రెడ్డి పాల్గొనుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

మునుగోడుపై భాజపా ఫోకస్‌, ఎంతలా అంటే

'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'

ABOUT THE AUTHOR

...view details