తెలంగాణ

telangana

వెలువడని ఉప్పుడు బియ్యం ఉత్తర్వులు.. సీఎం జోక్యం తప్పదా?

By

Published : Sep 24, 2021, 9:33 AM IST

Uppudu biyyam

ఉప్పుడు బియ్యం(Uppudu biyyam) కొనుగోళ్లపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. గత యాసంగి సీజన్​లో 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులైనా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వలు రాకపోవడం వల్ల అటు అధికారులు, ఇటు రైతులు అయోమయానికి గురవుతున్నారు.

అదనంగా ఉప్పుడు బియ్యం (Uppudu biyyam) తీసుకునేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపినా ఉత్తర్వులు మాత్రం వెలువడటం లేదు. మరోదఫా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్ర పౌరసఫరాల శాఖ అధికారులు దిల్లీలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యాసంగికి సంబంధించిన ఉప్పుడు బియ్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్ది నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్న విషయం విదితమే. గత సీజను ధాన్యం నుంచి 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం వస్తాయి. కేవలం 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలని ఇటు అధికారులు, అటు మంత్రులు కేంద్రాన్ని కోరారు. నాలుగు రోజులుగా దిల్లీలో చర్చలు జరుపుతున్నారు. అదనపు బియ్యం విషయంలో మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఎఫ్‌సీఐ బుధవారం నివేదిక ఇచ్చినట్లు సమాచారం. సుమారు 20 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా తీసుకునేందుకు సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలిసింది. అధికారిక ఉత్తర్వులు గురువారం సాయంత్రం వరకూ అందలేదు.

సీఎం జోక్యం మరోదఫా తప్పదా?

సీఎం కేసీఆర్‌ శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మరోదఫా జోక్యం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం అదనపు బియ్యం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల తరహాలో ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. బియ్యంగా మార్చి అమ్మితే నష్టం అధికంగా ఉంటుంది. దీంతో ధాన్యమే విక్రయించాలి. అలా చేసినా కనీసం రూ.3వేలకోట్ల వరకు నష్టం వస్తుందని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి చేయక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details