Uppudu biyyam : ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై వీడని ఉత్కంఠ

author img

By

Published : Sep 19, 2021, 8:59 AM IST

ఉప్పుడు బియ్యం(Uppudu biyyam) కొనుగోళ్లపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. గత యాసంగి సీజన్​ ధాన్యం 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులైనా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వలు రాకపోవడం వల్ల అటు అధికారులు, ఇటు రైతులు అయోమయానికి గురవుతున్నారు.

ఉప్పుడు బియ్యం(Uppudu biyyam)పై ఉత్కంఠ ఇంకా వీడలేదు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడి నాలుగు రోజులైనా కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గత యాసంగి సీజను ధాన్యం నుంచి వచ్చే 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంలో కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నులైనా తీసుకోవాలని కేసీఆర్‌ కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గతంలో పేర్కొన్న 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల కన్నా అదనంగా తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా అధికారుల బృందం హస్తిన బాట పట్టనుంది. కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,500 కోట్ల వరకు భారం పడుతుంది. కేంద్రం అదనంగా తీసుకుంటుందన్న విశ్వాసం ప్రభుత్వానికి ఉన్నా జాప్యం జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది.

కేంద్రంతో మంతనాలు

పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో దిల్లీ వెళ్లే అధికారుల బృందం .. సోమవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) అధికారులతో సంప్రదింపులు జరపనుంది. ప్రస్తుతం ధాన్యం సేకరించడంలో ఎఫ్‌సీఐ తీవ్ర జాప్యం చేస్తోంది. 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను ఇప్పటి వరకు 18 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంది. అదనపు బియ్యం తీసుకునేందుకు కేంద్రం దాదాపుగా సుముఖత వ్యక్తం చేసింది. ఎంత మొత్తం తీసుకుంటుందో స్పష్టం కావాల్సి ఉంది.

అదనపు కోటాతో పాటు వేగంగా బియ్యం(Uppudu biyyam) తీసుకునేలా ఎఫ్‌సీఐని ఒప్పించాలని కూడా అధికారుల బృందం కేంద్రంతో చర్చించనున్నట్లు సమాచారం. గోదాములు ఖాళీగా లేకపోవటంతో ఎఫ్‌సీఐ ఆచితూచి ఉప్పుడు బియ్యాన్ని మిల్లర్ల నుంచి తీసుకుంటోంది. ఇప్పటికే మిల్లుల ప్రాంగణాలు ధాన్యం నిల్వలతో నిండిపోయి ఉన్నాయి. ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకునేందుకు మిల్లింగులో వేగం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మిల్లుల్లోని నిల్వలను త్వరితంగా తీసుకోకపోతే త్వరలో వచ్చే వానాకాల ధాన్యాన్ని నిల్వ చేయటం సమస్యగా మారుతుందని అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దిల్లీ వెళ్లే అధికారుల బృందం సోమవారం రాత్రి లేదా మంగళవారానికి అదనపు కోటా ఉత్తర్వులు వెంట తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.