తెలంగాణ

telangana

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

By

Published : Aug 10, 2022, 7:22 AM IST

Updated : Aug 10, 2022, 2:41 PM IST

Godavari Krishna Flood: కృష్ణా గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటాన్ని బట్టి నాగార్జునసాగర్‌ గేట్లు గురువారం తెరుచుకునే అవకాశాలున్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

Godavari
Godavari

Godavari Krishna Flood: కృష్ణా గోదావరి నదుల్లో ఉద్ధృత ప్రవాహం నమోదవుతోంది. కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం గేట్లను ఒక్కోటి పెంచుతూ మంగళవారం రాత్రికి ఎనిమిదింటిని తెరిచారు. ఏపీ, తెలంగాణ ఉత్పత్తి కేంద్రాల ద్వారా జలవిద్యుత్‌ను తయారు చేస్తున్నారు. జలాశయం నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. నారాయణపూర్‌ నుంచి 1.46 లక్షల, తుంగభద్ర డ్యాం నుంచి 1.59 లక్షల క్యూసెక్కులు విడుదలవుతుండగా ఇవి మరింత పెరిగే సూచనలున్నాయి.

మరోవైపు నాగార్జునసాగర్‌ వద్ద 1.83 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మంగళవారం సాయంత్రానికి ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 578.20 అడుగుల వద్ద ఉంది. 589.50 అడుగులకు చేరుకున్నాక గేట్లు తెరవాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటాన్ని బట్టి గురువారం గేట్లు తెరచుకునే అవకాశాలున్నాయి. గతేడాది ఆగస్టు నెలలోనే సాగర్‌ గేట్లు తెరచుకున్నాయి. కృష్ణానదికి భారీ వరదలు వచ్చినపుడు తప్ప మరెప్పుడూ ఆగస్టులో గేట్లు తెరుచుకున్న దాఖలాలు లేవు.

భద్రాచలం వద్ద భారీ ప్రవాహం:గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల్లో లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) వద్ద 7.30 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన మానేరు ఇతర ఉపనదులు, వాగులతోపాటు ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో మేడిగడ్డ నుంచి దిగువకు పెద్దఎత్తున ప్రవాహం వెళ్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతోంది. అర్ధరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరిన నీటిమట్టం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఉదయం 12 గంటలకు గోదావరి నీటిమట్టం 50.40 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక అమల్లోకి రానుంది. గోదావరిలోకి ఎగువ నుంచి 12.79 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.

భద్రాది వరద ఉద్ధృతిపై కలెక్టర్ సమీక్ష: భద్రాదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతిని కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ జి.వినీత్ పరిశీలించారు. స్నాన ఘట్టాలు గోదావరి కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్​ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం 50.4 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఇంకొక రెండు మూడు అడుగులు పెరిగి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు.

వర్షాలు తగ్గుముఖం:బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఒడిశాపై కేంద్రీకృతమై ఉంది. రుతుపవనాల ద్రోణి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి వాయుగుండం ఏర్పడిన ప్రాంతం వరకూ వ్యాపించింది. తెలంగాణలో బుధ, గురువారాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని, అక్కడక్కడ ఒక మోస్తరుగా కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ..రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో 4.3, డిచ్‌పల్లిలో 3.9, సాలూరలో 3.3, చిమ్నంపల్లిలో 3.3, నిజామాబాద్‌లో 3.2 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది.

వాగులో చిక్కిన లారీ..

ఛత్తీస్‌గఢ్‌లో దంచి కొడుతున్న వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాయపూర్‌ వెళ్తున్న ఓ మినీలారీ మంగళవారం దంతరి జిల్లాలోని లోతట్టు వంతెనపై నుంచి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకుంది. డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీవర్షాలకు చాలాచోట్ల రహదారులు జలదిగ్భంధంలో చిక్కుకొని రాకపోకలు స్తంభించాయి.

Last Updated :Aug 10, 2022, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details