తెలంగాణ

telangana

నిజరూప అవతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం

By

Published : Dec 29, 2022, 2:11 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యాయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో ఏడో రోజైన నేడు నిజరూప అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Bhadradi Ramaiah in real avatar
నిజరూప అవతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య ఈరోజు నిజరూప అవతారంలో శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. నిజ రూపంలో ఉన్న స్వామివారిని బేడా మండపంలో తీసుకువచ్చి ఆలయ అర్చకులు, వేద పండితులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. మహా నివేదన అనంతరం స్వామి వారు సకల రాజ లాంఛనాల నడుమ ఆలయం నుంచి బయలుదేరి మిధిలాల్ స్టేడియంకు చేరుకున్నారు.

అక్కడి నుంచి తాతకుడి సెంటర్ వరకు వెళ్లి అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనం ఇచ్చారు. లోక కంఠకులైన రావణుడు, కుంభకర్ణుడు వంటి రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారునిగా మహావిష్ణువు రాముడిగా అవతరించారని పురాణాలు తెలుపుతున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల సూర్యగ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు చెప్పారు.

ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు జనవరి 1 నుంచి మొదలుకానున్నాయి. జనవరి 1న సీతారాములకు తెప్పోత్సవం, 2న ముక్కోటి ఏకాదశి రోజు సీతారాముల ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా జనవరి 2 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details