తెలంగాణ

telangana

ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. భద్రాద్రి వద్ద 52 అడుగుల నీటిమట్టం

By

Published : Aug 11, 2022, 3:20 PM IST

bhadrachalam
bhadrachalam

bhadrachalam floods: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి నీటిమట్టం 52 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గరైంది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి 3 రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

bhadrachalam floods: గోదావరిలో వరదనీరు గంటగంటకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 13 లక్షల 70 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం 52 అడుగులకు చేరింది. వరద నీరు పెరగడంతో తెలంగాణ నుంచి భద్రాచలం సరిహద్దు ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు భద్రాచలంలోనే నిలిచిపోయాయి.

ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, భద్రాద్రి వద్ద 52 అడుగుల నీటిమట్టం

వరద నీరు పెరగడంతో నిన్నటి నుంచి భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, కూనవరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటిమట్టం పెరుగుతున్నందువల్ల భద్రాచలం కరకట్ట వైపుకు పోలీసులు ఆంక్షలు విధించారు. స్నానాలకు, గోదావరి వరదను చూసేందుకు ఎవరిని అనుమతించడం లేదు.

నెల కూడా కాలేదు:నెలరోజులు కూడా కాకముందో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాద్రివాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి మూడు రాష్ట్రాలకు భారీ వాహనాలను వెళ్లనీయడం లేదు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే రాత్రికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు లేకపోలేదు.

రికార్డ్ స్థాయిలో వరద: గోదావరి చరిత్రలో 1986లో అత్యధికంగా 75.6 అడుగుల స్థాయి మట్టం నమోదయింది. అప్పుడు నదిలో 32.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. గత నెల 16న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గరిష్ఠంగా 71.30 అడుగులకు నీటిమట్టం చేరగా 24.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. ఇలా దాదాపు 17 గంటల పాటు 71 అడుగులపైనే మట్టం కొనసాగింది. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా.. ఇప్పటికే వరదతో చితికిన బతుకులు.. మళ్లీ దుర్భర పరిస్థితుల్లోనూ జారుకునే పరిస్థితి ఉందని భద్రాద్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. కరకట్ట పటిష్టతపై ఇటీవల ఆందోళనలు వ్యక్తం కావడం స్థానికుల భయాన్ని మరింత పెంచుతోంది. ప్రతి ఏటా నది హద్దులపై సర్వే చేయాలని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.

ఏటా నది హద్దులపై సర్వే చేయాలి..గోదావరి తీరం వెంబడి నిర్మాణాలు పెరుగుతూ వస్తున్నాయి. నదికి ఒక మార్జిన్‌ ఉంటుంది. దాన్ని పరిరక్షించాలి. అడవులు, పొదలు అంతరించిపోవడమూ ప్రవాహ వేగం పెరగడానికి, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకురావడానికి కారణమవుతోంది. వర్షాకాలం, ఇతర కాలాల్లో నది ప్రవాహాన్ని అంచనా వేయాలి. ఇప్పటికైనా ఒక నిర్ధిష్టమైన గడువు పెట్టుకుని అక్కడి నుంచి ఆక్రమణలు పెరగకుండా చూస్తే భవిష్యత్తులో ముంపును అరికట్టవచ్చు. - భవానీ శంకర్‌, మాజీ పర్యవేక్షక ఇంజినీరు, హైడ్రాలజీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details