ETV Bharat / bharat

ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్​'

author img

By

Published : Aug 11, 2022, 2:08 PM IST

Updated : Aug 11, 2022, 2:19 PM IST

India gate history
ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్​'

India Gate News: అమర జవాన్ల జ్యోతుల విలీనంతో ప్రస్తుతం వార్తల్లోకి వచ్చిన దిల్లీలోని ఇండియా గేట్‌కు ఓ అంతర్జాతీయ నేపథ్యముంది. అంతేకాదు ఆంగ్లేయులు మనకు మాటిచ్చి చేసిన మోసానికీ.. అమాయక భారతీయ సిపాయిలకు చేసిన వంచనకు ఇదో మౌన సాక్ష్యం.

India Gate News: భారత్‌ను ఆర్థికంగా పీల్చి పిప్పి చేసిన ఆంగ్లేయులు మన మానవ వనరులను సైతం తమ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు. తమ వలస సామ్రాజ్య విస్తరణలో భాగంగా జరిగిన యుద్ధాలతో పాటు మొదటి ప్రపంచయుద్ధానికి కూడా భారత్‌నే ఇరుసుగా చేసుకున్నారు. యుద్ధ ఖర్చుల కోసం ఆ కాలంలోనే 10 కోట్ల పౌండ్లు భారత్‌ నుంచి అప్పుగా కాదు... అప్పనంగా బహుమతి రూపంలో తీసుకున్నారు. ఇదంతా భారతీయుల నుంచి పన్నుల రూపంలో సేకరించిన సొమ్ము. లక్షలమంది భారతీయులను ఆగమేఘాలపై సైన్యంలోకి తీసుకుని ప్రపంచయుద్ధంలో తమ తరఫున బరిలో దింపారు. ఇంకా ఇంగ్లాండ్‌ సైన్యంలో భర్తీలైనా పూర్తికాకుండానే భారతీయులతో యుద్ధం మొదలెట్టించారు. మొదటి ప్రపంచయుద్ధం ముగియగానే భారత్‌కు స్వయం ప్రతిపత్తి (స్వయంపరిపాలన) కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో... గాంధీ, రవీంద్రనాథ్‌ఠాగూర్‌ సహా చాలామంది నేతలు బ్రిటన్‌ పక్షాన నిలిచారు. బ్రిటన్‌ సైన్యంలో చేరాలంటూ భారతీయ యువకులను ప్రోత్సహించారు. ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌-మిత్ర దేశాలు నెగ్గగానే మనకు, ఆంగ్లేయులకు మైత్రి ఏర్పడుతుందని ఆశపడ్డారు! పాపం అక్కడ యుద్ధరంగంలోనూ మనవాళ్లు తెగించి పోరాడారు. ఆంగ్లేయుల కంటే వీరోచితంగా తమదిగాని దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. మొత్తం 75వేల మంది భారతీయ సైనికులు యుద్ధంలో ప్రాణాలర్పించారు. యుద్ధం ముగిసింది. బ్రిటన్‌ గెలిచింది. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయులకిచ్చిన మాటను మరచింది. స్వయం ప్రతిపత్తి మాట అటుంచి.. ఏకంగా పాలనను మరింత కఠినతరం చేసింది. భారతీయుల స్వేచ్ఛను పూర్తిగా హరిస్తూ రౌలత్‌ చట్టం రూపేణా మోసం చేసింది.

National War Memorial: ఇంతలో.. బ్రిటన్‌ వలస రాజ్యాల్లో యుద్ధ స్మారకాలు నిర్మించాలని బ్రిటన్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఒక కమిషన్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన సభ్యుడు కొత్తదిల్లీ నిర్మాణ రూపశిల్పి ఎడ్విన్‌ ల్యూటన్‌. లండన్‌, ప్యారిస్‌లలో ఏర్పాటు చేసిన యుద్ధ స్మారకాల తరహాలో దిల్లీలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే ఇండియా గేట్‌! అఖిల భారత యుద్ధ స్మారకంగా దీనికి నామకరణం చేసి.. 1921 ఫిబ్రవరి 10న డ్యూక్‌ ఆఫ్‌ కానాట్‌తో శంకుస్థాపన చేయించారు. 1931 ఫిబ్రవరి 12న అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని ఆరంభించాడు. మొదటి ప్రపంచయుద్ధం, ఆఫ్గన్‌ యుద్ధాల్లో మరణించిన వారి సంస్మరణార్థం అంటూ పేర్కొన్న దీని శిలాఫలకంపై పేర్లను చెక్కారు. 75వేలమందికిపైగా భారతీయులు మరణిస్తే.. కేవలం 13 వేల 218 మంది పేర్లు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. మిగిలిన వారిని మరచిపోయారు. అనేకమంది ఆంగ్లేయ అధికారుల పేర్లు జోడించటం విశేషం. మనదిగాని యుద్ధం చేశాం. మనల్ని పీల్చిపిప్పి చేసినవారి కోసం ప్రాణాలొడ్డాం. ఆంగ్లేయులు మాత్రం... స్వయం పరిపాలన పేరు చెప్పి... 'గేట్‌' కట్టి విడిచిపెట్టారు! ఆ భారీ స్మారకంపై మనవాళ్లవి చాలామంది పేర్లను పక్కనబెట్టి ఆంగ్లేయుల పేర్లు చెక్కారు.

తమ చక్రవర్తి విగ్రహమే వద్దన్నారు
India Gate Amar Jawan Jyoti: తర్వాత కొద్దికాలానికి పక్కనే ఓ కనోపీ(ఛత్రం) ఏర్పాటు చేసి.. అక్కడ జార్జ్‌-5 చక్రవర్తి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయోద్యమకారులు ఈ విగ్రహంపై దాడి చేశారు. హేమవతి నందన్‌ బహుగుణ, మనుభాయ్‌షాలు విగ్రహం ముక్కు విరగ్గొట్టారు. 'నిరంకుశుడి మరణం' అంటూ నల్లజెండా చుట్టారు. స్వాతంత్య్రానంతరం కూడా 20 ఏళ్ల పాటు ఈ విగ్రహం అలాగే ఉండటం విశేషం. 1965లో సోషలిస్టు పార్టీ నేతలు ఈ విగ్రహంపైకెక్కి పాక్షికంగా ధ్వంసం చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ ఫొటో వేలాడదీశారు. ప్రజాభిప్రాయం కూడా ఈ విగ్రహానికి వ్యతిరేకంగా ఉండటంతో కేంద్రప్రభుత్వం దీన్ని తొలగించాలని నిర్ణయించింది. కానీ దీన్ని ఎక్కడ పెట్టాలనేది తేలక కొన్నాళ్లు సాగింది. తమ చక్రవర్తి విగ్రహాన్ని లండన్‌కు తీసుకెళ్లటానికి బ్రిటన్‌ ప్రభుత్వం నిరాకరించగా.. దిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషనరేట్‌లో కూడా స్థలం లేదన్నారు. దీంతో విగ్రహాన్ని తొలగించి కొన్నాళ్లపాటు ఎక్కడో ఉంచి.. తర్వాత బ్రిటిష్‌రాజ్‌ కాలంనాటి అనేక విగ్రహాలున్న దిల్లీ కరోనేషన్‌ పార్క్‌కు తరలించారు. 1971లో బంగ్లాదేశ్‌ అవతరణం తర్వాత.. ఈ ఇండియాగేట్‌ కిందే.. అమర జవాన్‌ జ్యోతిని 1972లో మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌ అవతరణ కోసం చేసిన యుద్ధంలో అమరులైన సైనికుల సంస్మరణార్థం తొలుత ఏర్పడినా.. తర్వాత ప్రతి భారతీయ సైనికుడి అమరత్వానికి దీన్నే ప్రతీకగా భావిస్తూ వచ్చారు.

Last Updated :Aug 11, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.