తెలంగాణ

telangana

Tokyo Olympics: సెమీస్​కు భారత రెజ్లర్లు దీపక్​, రవి

By

Published : Aug 4, 2021, 10:12 AM IST

Updated : Aug 4, 2021, 10:58 AM IST

టోక్యో ఒలింపిక్స్ మెన్స్​ ఫ్రీస్టైల్​ రెజ్లింగ్​​ పోటీల్లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. దీపక్​ పునియా(86 కేజీల విభాగం), రవి దహియా(57 కేజీల విభాగం) సెమీఫైనల్లో అడుగుపెట్టారు.

Tokyo Olympics 2020: Ravi Dahiya, Deepak Punia Enter Semifinals
Tokyo Olympics: సెమీస్​కు భారత రెజ్లర్లు దీపక్​, రవి

భారత కుస్తీవీరులు రవికుమార్‌ దహియా (57 కిలోలు), దీపక్‌ పునియా (86 కిలోలు) సంచలనం సృష్టించారు. తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్‌ను రవి 14-4 తేడాతో చిత్తు చేశాడు. ఇక చైనాకు చెందిన లిన్‌ జుషెన్‌పై దీపక్‌ పునియా 6-3 తేడాతో విజయం సాధించాడు.

రవి దూకుడు

రవికుమార్‌ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా రెండో బౌట్లోనూ ప్రత్యర్థిని సాంకేతిక ఆధిపత్యంతోనే ఓడించాడు. అతడి ఉడుం పట్టుకు, టేక్‌డౌన్లకు జార్జి వలెటినోవ్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తొలి పిరియడ్‌లో వరుసగా 2, 2, 2 పాయింట్లు సాధించిన రవి 6-0తో ఆధిపత్యం సాధించాడు. ఇక రెండో పిరియడ్‌లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థికి కేవలం 4 పాయింట్లే వచ్చాయి. మరో 16 సెకన్లు ఉండగానే బౌట్‌ ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన టిగ్రరోస్‌పై రవి 13-2 తేడాతో విజయం సాధించాడు. సెమీస్‌లో కజక్‌స్థాన్‌ రెజ్లర్‌ సనయెన్‌ నురిస్లామ్‌తో తలపడనున్నాడు.

దీపక్‌ రక్షణాత్మకంగా..

తొలి బౌట్లో దూకుడుగా ఆడిన దీపక్‌ పునియా క్వార్టర్స్‌లో అటు దూకుడు ఇటు రక్షణాత్మక విధానంలో విజయం సాధించాడు. ప్రత్యర్థి అనుభవాన్ని గౌరవించాడు. లిన్‌ జుషెన్‌ను 6-3తో ఓడించాడు. తొలి పిరియడ్‌లో దీపక్‌ ఒక పాయింట్​ సాధించి 1-0తో ముందుకెళ్లాడు. ఇక రెండో పిరియడ్‌లో వరుసగా 2, 2, 1 సాధించాడు. ప్రత్యర్థికి 1,2 పాయింట్లు మాత్రమే రావడం వల్ల విజయం భారత కుస్తీవీరుడినే వరించింది. ప్రీక్వార్టర్స్‌లో అతడు నైజీరియాకు చెందిన అజియోమొర్‌ ఎకెరెకెమిని 12-1 తేడాతో చిత్తుగా ఓడించాడు. సెమీస్‌లో అతడు డేవిడ్‌ మోరిస్‌ టేలర్​తో తలపడనున్నాడు.

జావెలిన్​ త్రో

ఒలింపిక్స్‌ పురుషుల జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్‌-ఎ క్వాలిఫై రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫిన్లాండ్‌ అథ్లెట్‌ లస్సి ఇటెలాటాలో తర్వాతి స్థానంలో నీరజ్‌ చోప్రా నిలిచాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌ ఈనెల 7న(శనివారం) జరగనుంది.

మరోవైపు జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన మరో అథ్లెట్‌ శివ్‌పాల్ సింగ్‌ నిరాశపరిచాడు. గ్రూప్‌-బి క్వాలిఫై రౌండ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

ఇదీ చూడండి..'సెమీస్​లో గెలుస్తా.. సరికొత్త రికార్డు సృష్టిస్తా'

Last Updated :Aug 4, 2021, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details