ETV Bharat / sports

Lovlina Borgohain: 'సెమీస్​లో గెలుస్తా.. సరికొత్త రికార్డు సృష్టిస్తా'

author img

By

Published : Aug 3, 2021, 9:58 PM IST

భారత బాక్సింగ్ ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు వచ్చింది మూడు పతకాలే. అవి కూడా కాంస్యాలే. కాగా, అందులో ఒకటి ఈ టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా సాధించింది. ఈ కాంస్యాన్ని రజతంగానో లేదా స్వర్ణంగానో మార్చాలంటే సెమీస్‌ పోరులో టర్కీ బాక్సర్‌, ప్రపంచ ఛాంపియన్ బుసెనజ్ సుర్మెనెలిని ఓడించాలి. అది అంత సులువేమీ కాకున్నా.. అసాధ్యమేమీ కాదని లవ్లీనా చెబుతోంది. బుధవారం జరిగే ఆ పోరులో విజయం సాధించి భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించి తీరుతామని లవ్లీనాతో పాటు ఆమె కోచ్ అలీ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

Tokyo Olympics 2020, Lovlina Borgohain
టోక్యో ఒలింపిక్స్​ 2020, లవ్లీనా బోర్గోహైన్

అద్భుతం ఎప్పుడూ మౌనంగానే జరిగిపోతుంది. ఆ అద్భుతం జరిగిన తర్వాత వినిపించే శబ్ధం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు కూడా ఇప్పుడు దేశం మొత్తం ఇలానే ప్రతిధ్వనిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకాన్ని కాయం చేసిన లవ్లీనా భారత మహిళా బాక్సింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచింది. వారం క్రితం వరకూ ఎవరికీ తెలియని లవ్లీనా 69 కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో గెలిచి సెమీస్‌లో అడుగు పెట్టింది. మరో మెట్టు ఎదిగి ఒలింపిక్స్ ఫైనల్‌ చేరిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా నిలవాలని యావత్ భారతం కోరుకుంటోంది. బుధవారం జరిగే సెమీస్‌లో లవ్లీనా మహిళా బాక్సింగ్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ బుసెనజ్ సుర్మెనెలితో పోటీ పడనుంది.

అసోంకు చెందిన 23 ఏళ్ల లవ్లీనా మొదట్లో మాయ్ థాయి సాధన చేసింది. ఆ తర్వాత బాక్సింగ్ రింగ్‌లోకి ప్రవేశించి భారత్‌కు బాక్సింగ్‌లో మూడో ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసింది. ఇంతకు ముందు భారత్‌ నుంచి ఒలింపిక్ పతకాల పోడియం మీద 2008లో విజేందర్‌ సింగ్‌, 2012లో మేరీ కోమ్ నిలువగా.. 9 ఏళ్ల తర్వాత టోక్యోలో భారత్ పేరు వినపడేలా లవ్లీనా పంచ్ విసిరింది. ఇప్పుడు ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా సాధన చేస్తున్న లవ్లీనా మ్యాచ్ సమయాలకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది. సెమీస్‌లో బుసెనజ్‌తో జరిగే బౌట్‌ మధ్యాహ్నం వేళ కాగా రెండు రోజులుగా ఆ సమయంలోనే లవ్లీనా ప్రాక్టీస్ చేస్తున్నట్లు జాతీయ కోచ్ మొహ్మద్ అలీ ఖతార్ తెలిపారు.

ఇదీ చదవండి: PV Sindhu: స్వదేశానికి పీవీ సింధు- దిల్లీలో ఘనంగా సన్మానం

"సెమీస్ విజయంపై లవ్లీనా చాలా అత్మవిశ్వాసంతో ఉంది. క్వార్టర్స్‌ బౌట్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ అయిన చైనీస్ తైపీ బాక్సర్‌ నీన్‌- చిన్‌ చెన్‌ను 4-1 తేడాతో ఓడించిన లవ్లీనా బంగారు పతకం సాధించి తీరుతానని చెప్పింది. బోర్గోహిన్ ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు అందించినప్పటికీ ఆ విషయం పెద్దగా ఎవరికీ తెలీదు."

-మొహ్మద్​ అలీ ఖతార్, జాతీయ కోచ్.

సెమీస్‌లో లవ్లీనాతో తలపడే సుర్మెనెలి వయస్సు కూడా 23 ఏళ్లే. 2015లో నాటి తమ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో టర్కీకి ఒలింపిక్స్‌ పతకం తెస్తానని హామీ ఇచ్చినట్లు సుర్మెనెలి తెలిపింది. ఈ ఏడాది జరిగిన రెండు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణంతో మెరిసిన సుర్మెనెలి కూడా ఫైనల్ చేరే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2019లో లవ్లీనా, సుర్మెనెలి ఛాంపియన్ షిప్స్‌లో పోటీ పడగా లవ్లీనా కాంస్యంతో సరిపెట్టుకోగా టర్కీ బాక్సర్ మాత్రం విజేతగా నిలిచింది. అయితే ఇప్పటివరకు వీళ్లు ఎప్పుడూ నేరుగా తలపడింది లేదు. గతంలో బాక్సింగ్‌ రింగ్‌లో భయపడేదాన్నని చెప్పిన బోర్గోహిన్ ఇప్పుడు మాత్రం తాను భయాన్ని వదిలేసి రింగ్‌లోకి వెళ్తున్నానని చెప్పింది. భారత్‌ పేరును ఫైనల్‌లో చేర్చుతానని ఆత్మ విశ్వాసంతో చెప్పింది.

చెప్పి మరీ చేసింది..

దేశానికి ఒలింపిక్‌ పతకం తీసుకొస్తానని లవ్లీనాకు ఎంతో నమ్మకముండేదని.. ఆ విషయాన్ని నిజం చేసిందని లవ్లీనా తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. టోక్యోకు వెళ్లే ముందు కూడా ఆ విషయాన్ని తమతో పంచుకుందని.. పతకంతోనే తిరిగి ఇంటికి వస్తానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. లవ్లీనా బంగారు పతకం సాధించాలని తమతోపాటే గ్రామంలోని అనేక మంది ప్రార్థిస్తున్నారని.. కొందరు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: India at Olympics today : కలిసిరాలేదు.. అన్నింటా ఓటమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.