తెలంగాణ

telangana

నిరాడంబరతకు నిలువుటద్దం ఈ 'మణిపూస'

By

Published : Jul 29, 2021, 5:32 AM IST

అత్యంత పేదరికం నుంచి ఉత్తుంగ తరంగంలా ఎదిగి అంతర్జాతీయ క్రీడా యవనికపై మెరిసింది మీరాబాయి చాను. వెండిపతకం సాధించి సొంతింటికి వెళ్లిన మీరాబాయి తన ఇంట్లో నేలపై కూర్చునే భోజనం చేయటం ఆమె నిరాడంబరతకు అద్దం పట్టింది.

meerabhai chanu
మీరాబాయ్ చాను

మీరాబాయి చాను.. ఇప్పుడు ఈ పేరంటే తెలియని వారుండరు. అత్యంత పేదరికం నుంచి ఉత్తుంగ తరంగంలా ఎదిగి అంతర్జాతీయ క్రీడా యవనికపై మెరిసింది. కుటుంబ పరిస్థితులు ప్రతిభకు ప్రతిబంధకం కాదని నిరూపించి అసాధారణ ప్రతిభ కలిగి ఉన్న మరెందరికో ప్రేరణగా నిలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో వెండితునక సాధించి భారతజాతిని అబ్బురపర్చిన మీరాబాయి.. తన నిరాండంబరతతో అంతకుమించిన ప్రశంసలు అందుకుంటోంది.

అవేవీ అడ్డుకాదు..
కలలను సాకారం చేసుకునేందుకు పేదరికం అడ్డుకాదని టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకం సాధించిపెట్టిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను నిరూపించింది. అత్యంత పేదరికం నుంచి అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌గా ఎదిగిన ఆమె టోక్యో విశ్వక్రీడల్లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. ఒలిపింక్స్ లాంటి అత్యున్నత స్థాయి వేదికపై సత్తా చాటడమంటే మామూలు విషయం కాదు. డబ్బు, దర్పం, ప్రోత్సాహం ఇత్యాదికాలు ఉన్నా పతకం సాధించటం అంత తేలికకాదు. అయినా మీరాబాయి ఇవేవీ లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని ముద్దాడింది. వెండి పతకంతో మట్టిలో మాణిక్యంలా మెరిసింది.

నేలపై కూర్చునే భోజనం చేస్తున్న మీరాబాయి

నేలపై కూర్చునే భోజనం..
మణిపూర్‌లోని ఓ పల్లెటూరులో నివసించే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన మీరా.. వెయిట్‌లిఫ్టింగ్‌ ప్రయాణం కట్టెలు మోయటంతో మొదలైంది. తన రాష్ట్రానికి చెందిన కుంజురాణిని చూసి వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న మీరా తమ గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోచింగ్‌ కేంద్రానికి వెళ్లి శిక్షణ పొందింది. వసతుల లేమి మధ్య అసమాన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన ఆమె అనతికాలంలోనే స్పాన్సర్ల దృష్టిని ఆకర్షించింది. స్పాన్సర్ల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌ అయింది. అయినా ఆమెలో కించిత్తు గర్వం కూడా లేదు. వెండిపతకం సాధించి సొంతింటికి వెళ్లిన మీరాబాయి తన ఇంట్లో నేలపై కూర్చునే భోజనం చేయటం ఆమె నిరాడంబరతకు అద్దం పట్టింది. ఎదిగినకొద్ది ఒదిగి ఉండాలన్న స్ఫూర్తిని చాటింది.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​లో స్వర్ణం సాధిస్తే రూ.3 కోట్ల నజరానా

ABOUT THE AUTHOR

...view details