తెలంగాణ

telangana

AUS vs NZ Final: మ్యాచ్​ను మలుపుతిప్పే సమర్థులు వీరు!

By

Published : Nov 14, 2021, 9:26 AM IST

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 final)​లో భాగంగా నేడు (నవంబర్ 14) న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్(AUS vs NZ Final) మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ను మలుపుతిప్పగలిగే సామర్థ్యమున్న కీలక ఆటగాళ్లెవరో చూద్దాం.

AUS vs NZ
ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021 final) ఆఖరి ఘట్టానికి వేళైంది. టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌(AUS vs NZ Final) అమీతుమీ తేల్చుకోనున్నాయి. కివీస్‌ తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా.. ఆసీస్‌కిది రెండో ఫైనల్‌(AUS vs NZ Final). 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది. కాగా, ఈ టోర్నీ ప్రతి మ్యాచ్​లోనూ కొందరు ఆటగాళ్లు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​(t20 world cup 2021 final)ను మలుపు తిప్పగలిగే సామర్థ్యమున్న వారెవరో చూద్దాం.

డేవిడ్ వార్నర్

వార్నర్

ఐపీఎల్​లో స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవడం, సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కోవడం వల్ల వార్నర్​(david warner news)ను కెప్టెన్సీ నుంచి తప్పించింది యాజమాన్యం. అలాగే తుదిజట్టులోనూ చోటు కల్పించలేదు. కానీ టీ20 ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శనతో మరోసారి తానేంటో నిరూపించాడు వార్నర్. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్​ల్లో 148.42 స్ట్రైక్ రేట్​తో 236 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లోనూ ఓపెనర్​గా వచ్చి పవర్​ప్లేలో వేగవంతంగా పరుగులు రాబడితే కివీస్​పై ఒత్తిడి ఖాయం.

కేన్ విలియమ్సన్

విలియమ్సన్

ఈ మెగాటోర్నీలో బ్యాట్​తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు విలియమ్సన్(kane williamson news). కానీ తనదైన రోజున ఎంత ఒత్తిడిలోనైనా రాణించగల సామర్థ్యం ఇతడి సొంతం. గతేడాది భారత్​తో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ ఇలాంటి ప్రదర్శనే చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఆడం జంపా

జంపా

ప్రస్తుత టీ20 ప్రపంచకప్​లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా(adam zampa t20 world cup). యూఏఈ పిచ్​లపై బంతిని టర్న్ చేస్తూ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్​ల్లో 12 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మిడిల్​ ఓవర్లలో బ్యాటర్లు ఇతడి స్పిన్ ఉచ్చులో చిక్కుకుంటే కివీస్​కు కష్టమే.

ఇష్ సోధి

ఇష్ సోధి

ఆస్ట్రేలియాకు జంపాలాగే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో కివీస్​కు అండగా నిలుస్తున్నాడు లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి(ish sodhi news). ఈ టోర్నీలో జరిగిన సూపర్-12 మ్యాచ్​ల్లో ప్రతిదాంట్లో వేసిన తొలి ఓవర్లోనే వికెట్ దక్కించుకుని ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచాడు సోధి. ఇంగ్లాండ్​తో జరిగిన సెమీస్​లోనూ అతడు వేసిన రెండో ఓవర్ తొలి బంతికి బట్లర్ లాంటి విధ్వంసకర బ్యాటర్ వికెట్ తీశాడు.

మ్యాక్స్​వెల్

మ్యాక్స్​వెల్

ప్రస్తుతం టీ20 క్రికెట్​లో అత్యుత్తమ ఆల్​రౌండర్​లలో ఒకరు మ్యాక్స్​వెల్(maxwell news). జట్టుకు అవసరమున్న సమయంలో తానున్నానంటూ ముందుకొచ్చి ఒంటి చేత్తో మ్యాచ్​ను లాగేసుకుంటాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్​ల్లో కేవలం 36 పరుగులే చేసి అంతగా ఆకట్టుకోకపోయినా.. ఇతడి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఫైనల్లో ఇతడు చెలరేగితే ప్రత్యర్థి జట్టు ట్రోఫీపై ఆశలు వదులుకోవాల్సిందే.

ఇవీ చూడండి: AUS vs NZ Final: ఆసీస్​ ఆధిపత్యమా.. కివీస్​ పంతమా?

ABOUT THE AUTHOR

...view details