తెలంగాణ

telangana

IND VS WI: 'కోహ్లీ గురించి ఆందోళన పడొద్దు '

By

Published : Feb 14, 2022, 7:30 PM IST

Kohli Vikram rathour: వెస్టిండీస్​తో జరగబోయే టీ20 సిరీస్​లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్​ ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు టీమ్ఇండియా బ్యాటింగ్​ కోచ్​ విక్రమ్​ రాథోడ్​. పంత్​ను మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు పంపుతారని తెలిపాడు. ఈ సిరీస్​కు కేఎల్‌ రాహుల్ దూరమైనా.. అతడి స్థానంలో ఆడేందుకు ఇషాన్ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు.

kohli vikram rathour
kohli vikram rathour

Kohli Vikram rathour: కొంతకాలం నుంచి పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా మాజీ సారథి కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో విరాట్​ బాగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

"కోహ్లీ ఫామ్‌ కోల్పోయాడని చెప్పడం సరికాదు. నెట్స్‌లో బాగా రాణిస్తున్నాడు. అతడి కెరీర్లో ఇదొక దశ మాత్రమే. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలమైన విషయం నిజమే. కానీ, టీ20 సిరీస్‌లో అతడు ఎక్కువ పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది. అలాగే, మా బ్యాటింగ్‌ విభాగంలో ఎలాంటి సమస్యలు లేవు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాణించగలిగే సామర్థ్యం ఉంది. త్వరలో ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని మేం ప్రయోగాలు చేస్తున్నాం. ప్రస్తుతం కొంత మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరం కావడం దురదృష్టకరం. వాళ్లంతా అందుబాటులోకి వస్తే.. జట్టులో ఎవరి పాత్రేంటో నిర్ధారించడం కాస్త కష్టమైన విషయం"

-విక్రమ్‌ రాథోడ్.

కాగా, ఇటీవల విండీస్​తో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో కలిపి 8.6 సగటుతో 26 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 18 మాత్రమే. భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 16 (బుధవారం) నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

మిడిల్‌ ఆర్డర్‌లోనే పంత్‌..

"మిడిల్‌ ఆర్డర్​లో బ్యాటింగ్‌కు దిగి సత్తా చాటగలిగే అతి తక్కువ మంది ఎడమ చేతివాటం బ్యాటర్లలో రిషభ్ పంత్‌ ఒకడు. అందుకే, అతడిని మిడిల్‌ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు పంపుతాం. 2023 వన్డే ప్రపంచకప్‌ జట్టులో అతడు కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాగే, విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ దూరమైనా.. అతడి స్థానంలో ఆడేందుకు ఇషాన్ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సిద్ధంగా ఉన్నారు. అందుకే, పంత్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అహ్మదాబాద్‌లో పిచ్ నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. మిడిల్ ఆర్డర్‌ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ వంటి యువ ఆటగాళ్లతో మిడిల్‌ ఆర్డర్‌ బలంగా ఉంది" అని విక్రమ్‌ రాథోడ్‌ పేర్కొన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి.. రిషభ్‌ పంత్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

తక్కువ అంచనా వేయలేం..

"వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైనా.. టీ20 ఫార్మాట్‌లో ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. కచ్చితంగా గట్టి పోటీనిస్తుంది. యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. కానీ, సిరీస్ గెలవడం అంతకంటే ముఖ్యం" అని విక్రమ్‌ రాథోడ్‌ వెల్లడించాడు. విండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో పేసర్‌ అవేశ్ ఖాన్‌, లెగ్ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌లు భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: టీమ్ఇండియాపై అదరగొట్టి.. ఐసీసీ​ అవార్డుకు ఎంపికై

ABOUT THE AUTHOR

...view details