తెలంగాణ

telangana

ఆపదలో సాయం.. మోదీకి థ్యాంక్స్​ చెప్పిన ఆ దేశ మాజీ క్రికెటర్లు

By

Published : Apr 8, 2022, 12:35 PM IST

ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​ ఇటీవల ఆ దేశానికి తక్షణ సాయం అందించింది. ఈ నేపథ్యంలో లంక మాజీ క్రికెటర్లు కొందరు భారత్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Jayasuriya Thanks Modi: ఆర్థిక మాంద్యంతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంకకు భారత్‌ ఆపన్న హస్తం అందివ్వడంతో శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్‌ జయసూర్య, అర్జున రణతుంగ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు గాడితప్పి అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో భారత్‌ ఒక బిలియన్‌ డాలర్ల తక్షణ సహాయం అందించింది. ఈ నేపథ్యంలోనే లంక క్రికెటర్లు స్పందించారు.

''పొరుగున ఉన్న భారత్‌ మాకెప్పుడూ పెద్దన్నలా అభయహస్తం అందిస్తోంది. భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రుణపడి ఉంటాం. శ్రీలంకలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం బతకడం చాలా కష్టంగా ఉంది. భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా ఆదుకుంటే ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడతామని ఆశిస్తున్నాం.'' అని జయసూర్య పేర్కొన్నాడు. మాజీ కెప్టెన్‌, ప్రస్తుత మంత్రి అర్జున రణతుంగ సైతం మోదీ పెద్ద మనసుని కొనియాడారు. ''భారత్‌ మాకెప్పుడూ అండగా ఉంది. పెద్ద సోదరుడిలా ఆదుకుంటోంది. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని మాకు అవసరమైన నిత్యావసర వస్తువులను భారత్‌ అందజేస్తోంది. మందులు, పెట్రోల్‌, డీజిల్‌, బియ్యం లాంటి వాటికి మరికొద్దిరోజుల్లో కొరత ఏర్పడనుంది. వాటిని భారత్‌ భారీ మొత్తంలో సమకూర్చడం సంతోషంగా ఉంది'' అని రణతుంగ చెప్పారు.

మరోవైపు లంకలో నెలకొన్న పరిస్థితులపై ఇతర క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్దనే, భనుక రాజపక్స, లసిత్‌ మలింగ తదితరులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ దేశంలో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రజలు భోజనం, కరెంటు, పెట్రోల్‌, డీజిల్‌ లాంటి కనీస అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. పాలకుల తప్పిదాలతో దేశం ఆర్థికంగా చితికిపోయిందని, ఫలితంగా ప్రజలు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్ని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details