తెలంగాణ

telangana

ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ.. సినిమా చూపిస్తా!: రహానె

By

Published : Apr 24, 2023, 9:38 AM IST

ఐపీఎల్‌లో అనుకోకుండా చెన్నై తుది జట్టులో చోటు దక్కించుకుని.. అనూహ్యంగా చెలరేగిపోతున్నాడు అజింక్య రహానె. తన శైలికి భిన్నంగా విధ్వంసకరంగా ఆడుతున్నాడు. కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో మ్యాన్​ ఆఫ్​ మ్యాచ్​ అవార్డు అందుకున్న అతడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ajinkya rahane
ajinkya rahane

ఐపీఎల్‌ 16వ సీజన్​లో భాగంగా కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు.. 49 పరుగుల తేడాతో సూపర్​ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో చెన్నై బ్యాటర్లు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. బ్యాటర్లు పోటీ పడి మరీ దుుమ్ముదులిపారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. వెటరన్‌ ఆటగాడు, టెస్ట్‌ క్రికెటర్‌గా ముద్రపడ్డ అజింక్య రహానె ఇన్నింగ్స్‌ అయితే వేరే లెవెల్. టీ20లకు అస్సలు సెట్​ కాడు అనుకున్న రహానెలో ఇంత ఉందా అని క్రికెట్ అభిమానులు అనుకునేలా ఆడాడు. మెరుపు షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రహానెకు యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే తోడయ్యాడు. ఆఖర్లో జడేజా సైతం రెండు సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు.

రహానె

అయితే ఈ మ్యాచ్‌లో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడిన అజింక్య రహానెకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆ సమయంలో రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్‌లో దూకుడు పెరగడంపై స్పందిస్తూ.. ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా.. అన్న రేంజ్‌లో కామెంట్స్‌ చేశాడు. ధోనీ భాయ్‌ నేతృత్వంలోనే తాను రాటుదేలానని, అతను చెప్పింది చేస్తే ఆటోమాటిక్‌గా మనలో ఆటకు తగ్గ మార్పులు వస్తాయని అన్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని నాక్స్‌కు ఎంజాయ్‌ చేశానని, మున్ముందు ఇంకొంత దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.

కాగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రహానె తన ఆటతీరుకు భిన్నంగా వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో మెరుపులు మెరిపించాడు. ఆ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న అతడు.. 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఒంతిచేత్తో తన జట్టును గెలిపించాడు. అయితే ఇప్పుడు నెట్టింట రహానె పేరు మార్మోగిపోతుంది. అతడు ప్రపంచకప్​ జట్టులోకి తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.

మొత్తంగా చెన్నై బ్యాటర్ల సిక్సర్ల సునామీతో, బౌండరీల ప్రవాహంతో మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్‌ గార్డెన్స్‌ తడిసి ముద్దైంది. ధోనీ సేన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. ఛేదనలో కేకేఆర్‌ ఓ మోస్తరుగా పోరాడినప్పటికీ గెలుపుకు ఆమడు దూరంలోనే నిలిచిపోయింది. జేసన్‌ రాయ్‌, రింకూ సింగ్‌ బ్యాటుతో అదరగొట్టనప్పిటకీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

ABOUT THE AUTHOR

...view details