తెలంగాణ

telangana

'రాహుల్​ ఆడకపోవడం భారత్​కు మంచిదైంది'

By

Published : Mar 21, 2021, 1:15 PM IST

కేఎల్ రాహుల్ లేకపోవడం ఇంగ్లాండ్​తో చివరి టీ20లో మన జట్టుకు కలిసొచ్చిందని గావస్కర్ అన్నాడు. దీంతో పాటు కోహ్లీ-రోహిత్ ఓపెనింగ్​పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Sunil Gavaskar backs idea of Kohli-Rohit opening the batting
'రాహుల్​ ఆడకపోవడం భారత్​కు మంచిదైంది'

టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం ఒక విధంగా టీమ్‌ఇండియాకు కలిసొచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టీ20లో టీమ్‌ఇండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్‌(64), కోహ్లీ(80*) అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించి శుభారంభం అందించారు. దీంతో ఈ మేటి బ్యాట్స్‌మెన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో ఈ కొత్త ఓపెనింగ్‌ జోడీ ఇలాగే కొనసాగాలని గావస్కర్ ఆశించాడు.

'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువ ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేయాలి. విరాట్‌ కోహ్లీ కూడా ఇలాగే ఓపెనింగ్‌ చేసి బ్యాటింగ్‌ చేయాలి. రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం ఒక విధంగా టీమ్‌ఇండియాకు కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కొత్త జోడీ భవిష్యత్‌పై ఆశలు పెట్టుకునేలా చేసింది. సచిన్‌ కూడా మొదట్లో మిడిల్‌ఆర్డర్‌లో ఆడేవాడు. అతడిని ఓపెనింగ్‌లో పంపించగానే టీమ్‌ఇండియా రూపురేఖలే మారిపోయాయి. అది అతడి వ్యక్తిగత ప్రదర్శన మీదే కాకుండా జట్టు మొత్తంపైనే ప్రభావం చూపింది. కాబట్టి, బాగా ఆడేవారిని ముందుగా బ్యాటింగ్‌కు పంపాలి. రోహిత్‌, కోహ్లీ జోడీని ఇలాగే కొనసాగించాలి' అని గావస్కర్‌ అన్నాడు.

దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్

రాహుల్‌ ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నుంచి పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టీ20లో ఒక్క పరుగు చేసిన అతడు తర్వాత 0, 0, 14 పరుగులు చేశాడు. దీంతో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న అతడిని టీమ్‌ఇండియా చివరి మ్యాచ్‌లో పక్కకు పెట్టింది. ఈ క్రమంలోనే రోహిత్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్‌ చేశాడు. దాంతో వారిద్దరూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఈ కొత్త ప్రయోగం బాగా పనిచేయడం వల్ల కోహ్లీ రోహిత్‌తో మళ్లీ ఓపెనింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే మ్యాచ్‌ అనంతరం చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details