తెలంగాణ

telangana

సంక్రాంతికి సినిమాలొస్తున్నాయి సరే.. జనాలు వెళ్తారా?

By

Published : Nov 8, 2020, 7:00 PM IST

ఈసారి సంక్రాంతి పండగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో జనాలు వెళ్తారా? థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయా? అనేది సందిగ్ధంగా మారింది.

telugu cinemas which got release on sankranthi 2021
సంక్రాంతికి సినిమాలొస్తున్నాయి సరే.. జనాలు వెళ్తారా?

సంక్రాంతికి, కొత్త సినిమాలకు విడదీయలేని అనుబంధం. ఎందుకంటే ఈ పండగ సీజన్​లో థియేటర్​లోకి వచ్చే స్టార్ హీరోల చిత్రాలు.. అభిమానుల్ని హుషారెత్తిస్తాయి.. ఈలల వేయిస్తాయి.. గోల పెట్టిస్తాయి.. నవ్విస్తాయి.. ఏడిపిస్తాయి.. ఇంకా ఎన్నో సరదాల్ని తీసుకొస్తాయి. కానీ అది ఒకప్పుడు. రాబోయే పండగ సరదా అలానే ఉంటుందా? అంటే సందేహమే. ఎందుకంటే కరోనా మహమ్మరి మొత్తం మార్చేసింది. భయాల్ని తీసుకొచ్చింది. అసలు థియేటర్​కు వెళ్లాలా వద్దా అనే సందేహాల్ని రేపింది.

మరి ఇలాంటి పరిస్థితుల మధ్య సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు హిట్ అవుతాయా లేదా అనే విషయం పక్కన పెడితే.. అసలు ప్రేక్షకుడు థియేటర్​కు మళ్లీ వెళ్తాడా అనేది పెద్ద ప్రశ్న.

వకీల్​సాబ్ లుక్​లో పవన్​కల్యాణ్

'వకీల్​సాబ్' నుంచి 'క్రాక్​' వరకు

కరోనా ప్రభావంతో ఈ ఏడాదిలో సగం ఇంట్లోనే గడిచిపోయింది. దీంతో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? వెండితెరపై తమ అభిమాన హీరో కొత్త సినిమా ఎప్పుడు చూస్తామా? అని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి.

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ 'వకీల్​సాబ్', రవితేజ 'క్రాక్', రామ్ 'రెడ్', నితిన్ 'రంగ్​దే', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్', నాగచైతన్య 'లవ్​స్టోరి' సినిమాలు వచ్చే సంక్రాంతి బరిలో ఉన్నాయి. వీటితో పాటే శర్వానంద్ 'శ్రీకారం', వెంకటేశ్ 'నారప్ప' కూడా ఈ జాబితాలో చేరే అవకాశముంది.

రవితేజ 'క్రాక్'.. రామ్ 'రెడ్' సినిమా

ఈ సినిమాలన్నింటిపై మంచి అంచనాలు ఉన్నా సరే వీటన్నింటికి సరిపడా థియేటర్లు దొరుకుతాయా? ఒకవేళ దొరికినా ప్రేక్షకుడు ఇంతకు ముందులా వస్తాడా? అనేది చూడాలి.

ఓటీటీకి అలవాటుపడ్డారు!

లాక్​డౌన్ ప్రకటించినప్పటి నుంచి థియేటర్లు మూసివేయడం, బయటకు వెళ్లకపోవడం వల్ల ఓటీటీలకు ప్రేక్షకులు బాగా అలవాటుపడిపోయారు. ఎన్నో భాషల్లోని మంచి మంచి సినిమాలు, సిరీస్​లు చూస్తున్నారు. తక్కువ ధరకే ఎక్కువ కంటెంట్ లభించడం వల్ల చూసే పరిధిని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే విడుదలైన 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య', 'కలర్​ ఫోటో', 'వి', 'నిశ్శబ్దం' లాంటి సినిమాలు చూశారు. దీనికి తగ్గట్లే ఓటీటీ ప్లాట్​ఫామ్స్ కూడా పండగను దృష్టిలో పెట్టుకుని సిరీస్​లతో పాటు కొత్త చిత్రాల విడుదలను ప్రకటించి వీక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి.

ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుడు

మరి థియేటర్ల పరిస్థితేంటి?

కరోనా ప్రభావంతో థియేటర్లు తెరుచుకున్నా పలు భద్రతా చర్యలు పాటించాల్సి ఉంటుంది. అందులో భాగంగా సీటుకు సీటుకు మధ్య దూరం పెరుగుతుంది. అందువల్ల కలిసి థియేటర్​కు వెళ్లినా సరే ఒంటరిగానే చూసిన అనుభూతి కలుగుతుంది. అలాంటప్పుడు థియేటర్​కు వెళ్లడం ఎందుకు మొబైల్​లోనే చూస్తే సరిపోతుంది కదా అని ప్రేక్షకుడు అనుకుంటే మాత్రం సంక్రాంతి సినిమాలపై దెబ్బపడినట్లే.

థియేటర్​ శానిటైజర్ చేస్తున్న ఫొటో
సీటుకు సీటుకు మధ్య దూరంగా కూర్చొని చూస్తున్న ప్రేక్షకుడు

ABOUT THE AUTHOR

...view details