తెలంగాణ

telangana

రీల్​ లైఫ్​లోనే కాదు.. రియల్​ లైఫ్​లోనూ హీరోలే!

By

Published : May 11, 2021, 7:11 AM IST

కష్టమన్న మాట వినిపించిన ప్రతిసారీ కన్నీళ్లు తుడిచేందుకు మేమున్నామంటూ ముందుకొస్తుంటారు సినీ ప్రముఖులు. తమ వంతు సాయమందించి ఆపన్నులకు అండగా నిలుస్తుంటారు. తెరపైనే కాదు నిజ జీవితంలోనూ రియల్‌ హీరోలుగా నిలుస్తుంటారు. అలా దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ మన హీరోలు తమకు అందిన సాయాన్ని చేస్తున్నారు.

Stars who have donated to help with the coronavirus pandemic so far
రీల్​ లైఫ్​లోనే కాదు.. రియల్​ లైఫ్​లోనూ హీరోలే!

దేశంలో రెండో దశ కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు సినీ తారలు నడుంబిగించారు. ఆర్థిక సాయం చేస్తూ కొందరు.. వైద్య సహాయాలు అందిస్తూ మరికొందరు అండగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాలనే వేదికలుగా చేసుకొని కరోనా బాధితుల అవసరాలూ తీరుస్తున్నారు.

సోనూసూద్‌ ఆపన్న హస్తం

తొలి దశ కరోనా సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అండగా నిలిచారు నటుడు సోనూసూద్‌. రియల్‌ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా కొవిడ్‌ బాధితులకు అందుబాటులో ఉంటూ.. అవసరార్థులకు ఆస్పత్రుల్లో పడకలు సమకూర్చడం సహా ఔషధాలు, ఆక్సిజన్‌ సిలెండర్లు లాంటివి అందిస్తున్నారు.

సోనూసూద్​

ఆయన కొన్ని వారాల క్రితం అత్యవసర చికిత్స కోసం భారతి అనే కరోనా బాధితురాల్ని ఎయిర్‌ అంబులెన్స్‌లో నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తూ ఆమె కరోనాతో పోరాడుతూ ఇటీవలే కన్నుమూసింది. కొవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందించాలని సోనూసూద్‌ ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

బిగ్‌బి రూ.2కోట్ల సాయం

కరోనాపై పోరాటంలో ప్రజలకు అండగా నిలిచేందుకు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముందుకొచ్చారు. దిల్లీలోని గురుద్వారా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రూ.2కోట్లు విరాళం ప్రకటించారు. దిల్లీలోని రాకప్‌ గంజ్‌ గురుద్వారాను కరోనా సంరక్షణా కేంద్రంగా మార్చారు. దీన్ని మొత్తం 300 పడకలతో ఏర్పాటు చేశారు. సోమవారం నుంచే ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ ఆస్పత్రిలోని ఏర్పాట్ల కోసమే బిగ్‌బీ రూ.2కోట్లు సాయమందించారు. ఈ విషయాన్ని ఆ గురుద్వారా నిర్వాహక అధ్యక్షులు మజిందర్‌ సింగ్‌ వెల్లడించారు.

అమితాబ్ బచ్చన్

"సరైన సమయంలో అమితాబ్‌ పెద్ద సాయమందించారు. దిల్లీలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన నాకు రోజూ ఫోన్‌ చేసి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే వారు. కొవిడ్‌ కేంద్ర నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకునేవారు. ఆస్పత్రిలో ఏర్పాట్లు, ఆక్సిజన్‌ కోసం తమ వంతు సాయమందిస్తానని మాటిచ్చారు. ఇప్పుడా మాట ప్రకారం భారీ సాయం అందించార"ని మజిందర్‌ తెలియజేశారు.

కొవిడ్‌ పోరులో 'రాధేశ్యామ్‌' టీం

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు 'రాధేశ్యామ్‌' చిత్ర నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్‌ ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం వేసిన ఆస్పత్రి సెట్ ప్రాపర్టీని హైదరాబాద్‌లోని ఓ కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి విరాళంగా అందించారు. ఇందులో మొత్తం 50 పడకలతో పాటు స్ట్రెచర్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఇతర వైద్య పరికరాలు వంటివి ఉన్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్ర ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి వెల్లడించారు.

ప్రభాస్​

"ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్‌ సిలెండర్ల కొరత ఎక్కువగా ఉంది. అందుకే యూవీ క్రియేషన్స్‌ వారు హాస్పిటల్‌ సెట్‌ ప్రాపర్టీని నగరంలోని ఓ కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి విరాళంగా అందించింది. ఈ కష్టకాలంలో నిర్మాతలు చేసిన సాయం పట్ల ప్రభాస్‌ సహా.. మొత్తం చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేసింద"ని రవీందర్‌ రెడ్డి చెప్పారు.

రోజూ వెయ్యిమందికి ఆహారం

కొవిడ్‌ బాధితుల ఆకలి తీర్చుతూ తన ఉదారతను చాటుకుంటున్నారు బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌. ఆయన 'హోప్‌ ఫర్‌ వెల్ఫేర్‌' అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రోజూ వెయ్యి మంది కరోనా రోగులకు ఆహారం అందిస్తున్నారు. ఆ విషయాన్ని ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్వయంగా వెల్లడించారు.

ఫర్హాన్​ అక్తర్​

"నగరంలో కొవిడ్‌ ఉద్ధృతి చూసినప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా సాయం కోరాం. ఫర్హాన్‌ వెంటనే స్పందించారు. ఆయన సాయంతోనే వారణాసి నగరంలో ఆస్పత్రుల్లో పగటి పూట రోజూ వెయ్యి మందికి ఆహారం అందిస్తున్నాం. అలాగే రాత్రి వేళ నగరంలోని శ్మశానాల వైపు దృష్టి సారించి అక్కడి సిబ్బందికి కావాల్సిన సాయమందిస్తున్నామ"ని ఆ ప్రతినిధి తెలియజేశారు.

నిఖిల్‌ ఇలా.. సందీప్‌ అలా

తొలి దశ కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాలు అందించి తన వంతు సాయమందించారు కథానాయకుడు నిఖిల్‌. ఇప్పుడాయన రెండో దశ కరోనా సమయంలోనూ కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు సామాజిక మాధ్యమాల వేదికగా తన వంతు కృషి చేస్తున్నారు. అవసరమున్న రోగులకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు సమకూర్చడం సహా ఔషధాలు లాంటివి అందిస్తున్నారు. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి ఓ చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు నిఖిల్‌ వెల్లడించారు.

"ఈ క్లిష్ట సమయంలో మా వంతు సహాయం అందించాలని భావించాం. కొందరు స్నేహితులం కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి సామాజిక మాధ్యమాల ద్వారా సాయం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అన్నట్లుగా మనమే సాయంగా నిలవాల"న్నారు నిఖిల్‌.

నిఖిల్​, సందీప్​ కిషన్​

మరో యువ హీరో సందీప్‌ కిషన్‌ కొవిడ్‌ బాధిత కుటుంబాల్లో చిన్నారులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. కరోనా బారిన పడి తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లల్ని చదివించేందుకు ఓ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. అలా కుటుంబాల్ని దూరం చేసుకున్న పిల్లల గురించి తెలిస్తే. sundeepkishancovidhelp@gmail.com కి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాంటి చిన్నారులకు తమకు చేతనైనంతగా కొన్నేళ్ల పాటు ఆహారం, విద్య అందిస్తానని అన్నారు.

బాధితుల దాహం తీర్చి

అడివి శేష్​

నటుడు అడివి శేష్‌ కొవిడ్‌ బాధితుల దాహం తీర్చి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిల్లో నీటి సమస్య ఉందని తెలుసుకున్న ఆయన.. వెంటనే అక్కడి బాధితుల కోసం 865 లీటర్ల మంచినీళ్ల బాటిళ్లను అందించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో వెయ్యి లీటర్ల సామర్థ్యమున్న నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేసి.. అక్కడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.

ఇదీ చూడండి:'సీటీమార్​' కోసం చాలా కష్టపడ్డా: దిశా పటానీ

ABOUT THE AUTHOR

...view details