తెలంగాణ

telangana

టాలీవుడ్ డార్లింగ్​.. పాన్​ ఇండియా స్టారయ్యాడు!

By

Published : Oct 23, 2020, 5:31 AM IST

డార్లింగ్ ప్రభాస్.. 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు చెబుతున్నారు.

prabhas birthday
డార్లింగ్ ప్రభాస్

"కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌" అని చెప్పిన ఓ ఆరడుగుల అందగాడు.. డార్లింగ్​గా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. భళిరా భళీ అంటూ 'బాహుబలి' సిరీస్​తో బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డుల్ని లిఖించాడు. దక్షిణాది చిత్రరంగం గ్రాఫ్​ పెంచడంలో తనదైన పాత్ర పోషించాడు. ప్రస్తుతం బహుభాషా సినిమాలు చేస్తూ పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగాడు. తన నటనతో విదేశాల్లోనూ గుర్తింపు తెచుకున్నాడు. అతడే ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు.

డార్లింగ్‌ పదానికి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ రెబల్​స్టార్​. ముచ్చటగా మూడక్షరాలతో ప్రభాస్​ అని పిలిస్తే పలికే ఆయన... నేడు 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు.

అదిరిపోయే లుక్స్​తో 'డార్లింగ్​'

1979 అక్టోబరు 23న సూర్య నారాయణరాజు, శివకుమారి దంపతులకు జన్మించాడు ప్రభాస్‌. సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ప్రముఖ కథానాయకుడు కృష్ణంరాజు ప్రభాస్‌కు పెదనాన్న. ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదట ప్రభాస్‌. స్వతహాగా సిగ్గరి అయిన ఆయన... వెండితెరపై అడుగుపెట్టి 19 సినిమాల్లో నటించాడు.

'కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్'

ఈశ్వర్​తో తొలిపరిచయం

2002లో జయంత్​ సీ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన 'ఈశ్వర్'​ సినిమాతో తెరంగేట్రం చేశాడు ప్రభాస్​. జోడీగా అందాల తార మంజుల కూతురు శ్రీదేవి నటించింది. 2003లో 'రాఘవేంద్ర', 2004లో 'వర్షం', 'అడవిరాముడు' చిత్రాల్లో ప్రేమికుడిగా మంచిముద్ర వేశాడు. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చక్రం' సినిమా ప్రభాస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఛత్రపతితో స్టార్​ ఇమేజ్​

2005లో వచ్చిన 'ఛత్రపతి' ప్రభాస్​కు స్టార్​ ఇమేజ్​ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో 'పౌర్ణమి' చిత్రంలో వైవిద్యభరితమైన పాత్ర పోషించాడు. ఇది ఆశించిన స్థాయిలో రాణించక పోయినా ప్రభాస్‌కు మాత్రం హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2007లో 'యోగి', 'మున్నా', 2008లో 'బుజ్జిగాడు', 2009లో 'బిల్లా', 'ఏక్‌ నిరంజన్​' చిత్రాలు ప్రభాస్‌ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాయి. 'బిల్లా' చిత్రంలో తన పెదనాన్న, రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుతో వెండితెర పంచుకున్నాడు.

రెబల్​ స్టార్​ కృష్ణంరాజుతో ప్రభాస్​

'డార్లింగ్‌'తో అందరి మన్ననలు..

2010లో 'డార్లింగ్‌' సినిమా ప్రభాస్‌పై రొమాంటిక్‌ హీరో ముద్ర వేసింది. తర్వాత 2011లో వచ్చిన 'మిస్టర్​ ఫర్​ఫెక్ట్​', 2012లో 'రెబల్‌', 2013లో 'మిర్చి' సినిమాలు ప్రభాస్‌ కెరీర్‌ గ్రాఫ్​ను మరింత పెంచేశాయి. 2015, 2017లో విడుదలైన బాహుబలి సిరీస్​లోని రెండు భాగాలు.. ప్రభాస్‌ కెరీర్‌ను ఎవరెస్ట్‌ అంత ఎత్తుకు తీసుకువెళ్లాయి.

డార్లింగ్ ప్రభాస్

'మేడమ్‌ టుస్సాడ్స్​'లో ప్రభాస్‌ శిల్పం

దక్షిణాది తారలెవరికీ దక్కని తొలి అవకాశం ప్రభాస్‌కు దక్కింది. మేడం టుస్సాడ్స్​లో ఆయన మైనపు శిల్పం కొలువు తీరింది. నంది అవార్డులు, ఫిలిం ఫేర్‌ అవార్డులు సైతం అందుకున్న ప్రభాస్‌... 'సాహో' చిత్రం ద్వారా చివరగా ప్రేక్షకులను పలకరించాడు.

పెళ్లి గురించీ చర్చే..

టాలీవుడ్‌ ఆన్‌ స్క్రీన్‌ పాపులర్ జోడీ ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారని ఎంతో ప్రచారం జరిగింది. వీరిద్దరి పెళ్లి జరగబోతోందని వార్తలు వచ్చాయి. ఈ వదంతులపై ప్రభాస్‌ను స్పందిస్తూ.. అనుష్క తనకు మంచి స్నేహితురాలని సమాధానం ఇచ్చాడు. అప్పట్నుంచి ఈ బ్యాచిలర్​ హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని అందరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

'మిస్టర్​ పర్​ఫెక్ట్​'

'రాధేశ్యామ్'లో విక్రమ్​ ఆదిత్యగా..

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్​'. పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. డార్లింగ్ ప్రభాస్​కు అడ్వాన్స్ బర్త్​డే విషెస్ చెబుతూ కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్​ కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే కారుపై స్టైల్​గా కూర్చొని ఉన్న ఆయన ఫొటోను బుధవారం విడుదల చేసింది.

రాధేశ్యామ్​ సినిమాలోని కొత్త పోస్టర్​

ఇదీ చూడండి:భాగ్యనగరికి అండగా మేము సైతమంటూ..

ABOUT THE AUTHOR

...view details