తెలంగాణ

telangana

Lata Mangeshkar: ఏడు దశాబ్దాల ప్రయాణం.. వేల గీతాల నిలయం

By

Published : Feb 6, 2022, 9:59 AM IST

Lata Mangeshkar dead: తన గాన మాధుర్యంతో శ్రోతల మనుసు దోచుకున్న లతా మంగేష్కర్​ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానుల్ని కంటతడి పెట్టిస్తూ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె సంగీత ప్రయాణంపై ప్రత్యేక కథనం.

singer lata mangeskar
లతా మంగేష్కర్

లతా మంగేష్కర్​ గానామృతం భారతీయ సినీ రంగానికి సుపరిచితం. పాడిన ప్రతి పాటదీ ఓ ప్రత్యేక స్థానం. మెలోడి, జానపదం, గజల్, ఖవ్వాలి రాగం, భక్తి గీతం.. ఏదైనా సరే లతా గొంతులో అలవోకగా సాగాల్సిందే. ఎలాంటి సాహిత్యానికైనా తన స్వరంతో పట్టం కట్టే అపురూప గానగీతిక లతా మంగేష్కర్.

36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు

లతా మంగేష్కర్‌.. ఏడు దశాబ్దాల పాటు కోట్లాది మంది శ్రోతలను తన స్వర మాధుర్యంతో అలరించారు. 1942లో తన గాత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎన్నో అద్భుత గీతాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. దాదాపు 980 చిత్రాలకు గాత్రాన్ని అందించారు. దేశ విదేశాలకు చెందిన 36 భాషల్లో 50వేలకుపైగా పాటలు పాడారు.

సింగర్ లతా మంగేష్కర్

మూడు దశాబ్దాలు.. గిన్నీస్​ రికార్డ్

1948- 1978 మధ్యకాలంలో 30 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు లతా. వచ్చిన తొలినాళ్లలో ప్రముఖ గాయని నూర్జహాన్‌ను అనుకరించిన మంగేష్కర్... ఆ తర్వాత సొంత శైలితో శ్రోతల మదిలో చెరగని ముద్ర వేశారు.

'ఆయేగా' పాటతో గుర్తింపు ఆగయా

కెరీర్​ ప్రారంభంలో లతా మంగేష్కర్‌కు తగిన గుర్తింపు రాలేదు. 1949లో వచ్చిన 'మహల్'లోని 'ఆయేగా ఆనే వాలా' పాటతో మొదటి హిట్‌ అందుకున్నారు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1960లో 'మొఘల్-ఏ-ఆజమ'లోని లతా పాడిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' శ్రోతలను సమ్మోహితులను చేసింది.

యుక్త వయసులో లతా మంగేష్కర్

లతా పాటతో నెహ్రూ కన్నీళ్లు

1963 జనవరి 27న చైనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ ఎదుట 'అయే మేరే వతన్ కే లోగో' పాట పాడారు లతా మంగేష్కర్‌. ఈ పాటను విన్న నెహ్రూ కన్నీరు పెట్టుకున్నారు.

లండన్​ 'రాయల్ ఆల్బర్ట్​ హాల్​'లో కచేరీ

1970ల నుంచి లతా మంగేష్కర్ సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్​లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారు. కచేరీలు చేస్తూనే సినిమా పాటలు పాడేవారు. 1985లో వచ్చిన సంజోగ్ సినిమాలోని 'జు జు జు' పాట ఆ ఏడాదిలోనే పెద్ద హిట్‌గా నిలిచింది.

ప్రముఖులకు పాటలతో నివాళి

కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి.. నివాళులర్పించారు.

సింగర్ లతా మంగేష్కర్

తెలుగులోనూ లతా హవా

లతా మంగేష్కర్‌.. తెలుగులో 'సంతానం' సినిమాలో నిదురపోరా తమ్ముడా పాటను అద్భుతంగా పాడారు. 'ఆఖరి పోరాటం'లో తెల్లచీరకు అనే గీతాన్ని ఆలపించారు. దేశభక్తి గీతాల్లోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన వందేమాతరం గీతానికి కూడా లతా గాత్రాన్ని అందించారు.

మ్యాగజైన్​ కవర్​పేజ్​పై లతా మంగేష్కర్

భారతీయ నేపథ్య గాయకుల రాణి అని లతా మంగేష్కర్‌ గురించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది. బుల్లితెలపైనా పలు షోల్లో కనిపించిన లత.. వర్దమాన గాయకులకు సూచనలు సలహాలు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details