తెలంగాణ

telangana

కామాంధుల చెరలో బాల్యం- చర్యలేవి?

By

Published : Oct 31, 2021, 7:45 AM IST

దేశవ్యాప్తంగా రోజుకు 120 మందికిపైగా చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతూ బంగరు బాల్యాన్ని కోల్పోతున్నారు. పిల్లలపై హేయ నేరాల నిరోధానికి అంటూ దాదాపు దశాబ్దం క్రితమే పోక్సో చట్టం చేశారు. కఠిన నిబంధనలను జతచేసి రెండేళ్ల క్రితం దానికి మరింతగా పదునుపెట్టారు. ఏమి లాభం? నత్తనడక విచారణలతో ఆ 'కఠిన చట్టం' (pocso act latest news) స్ఫూర్తి కాగితాలకు పరిమితమైంది.

Sexual abuse
పోక్సో చట్టం తాజా వార్త

ప్రతిదానికీ పోలీసులు, ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటే ఎలా? అసలు ఆ పిల్లలు ఆ సమయంలో బీచ్‌లో ఎందుకున్నారు?- గోవా సముద్ర తీరంలో ఇటీవల అత్యాచారానికి గురైన ఇద్దరు చిన్నారులను ఉద్దేశించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చేసిన (Sexual abuse causes) నీతిబాహ్య వ్యాఖ్యలివి! తన వాచాలత్వంపై విమర్శలు ముమ్మరించే సరికి 'నాకూ పిల్లలు ఉన్నారు.. ఆ దుర్ఘటన నన్ను కలచివేసింది' అని నాలుక మడతేసి మొసలి కన్నీళ్లు కార్చారు. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశంలో హరివిల్లు విరిస్తే- అవన్నీ తమకేనని ఆనందించే పసికూనలెందరో మదమెక్కిన మానవ మృగాల కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. బోసినవ్వుల బుజ్జాయిల నుంచి బడికి వెళ్లే బాలబాలికల వరకు దేశవ్యాప్తంగా రోజుకు 120 మందికిపైగా చిన్నారులు లైంగిక వేధింపుల పాలబడుతూ బంగరు బాల్యాన్ని కోల్పోతున్నారు. పిల్లలపై హేయ నేరాల నిరోధానికి అంటూ దాదాపు దశాబ్దం క్రితమే పోక్సో చట్టం (pocso act 2020) చేశారు. కఠిన నిబంధనలను జతచేసి రెండేళ్ల క్రితం దానికి మరింతగా పదునుపెట్టారు. ఏమి లాభం? నత్తనడక విచారణలతో ఆ 'కఠిన చట్టం' (pocso act latest news) స్ఫూర్తి కాగితాలకు పరిమితమైంది. ఏటికేడాది ఇంతలంతలవుతున్న కర్కశ కాముక కీచక సంతతితో దేశప్రతిష్ఠకు నిలువునా తూట్లు పడుతున్నాయి.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల పసిపాపపై ఆ ఊరి సర్పంచి భర్త తాజాగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రులు నిలదీయబోతే- వాళ్లను బంధించి ఆ ప్రబుద్ధుడు ఉడాయించాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పన్నెండేళ్ల చిట్టితల్లిని ఆమె తండ్రి స్నేహితుడే బలాత్కరించాడు. విశాఖపట్నంలో ఒక మాయగాడి మృగత్వానికి బలైన ఎనిమిదో తరగతి చిన్నారి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. కోజికోడ్‌(కేరళ), మంగళూరు(కర్ణాటక), కియోంఝర్‌(ఒడిశా), నాగ్‌పుర్‌, నవీ ముంబయి(మహారాష్ట్ర), లలిత్‌పుర్‌(ఉత్తర్‌ ప్రదేశ్‌), కైముర్‌(బిహార్‌), హనుమాన్‌గఢ్‌(రాజస్థాన్‌).. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు పసిమొగ్గలపై అత్యాచారాలతో గడచిన కొద్దిరోజుల్లోనే వార్తలకెక్కాయి. సూరజ్‌ షా అని హరియాణాలోని కలనౌర్‌కు చెందిన ఒక నీచుడు- ఓ చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో నాలుగు నెలల క్రితం తిహార్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ కేసు విచారణకు ఇటీవల దిల్లీ వెళ్ళాడు. ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న పసిపాపకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. వంద సీసీ కెమెరాలను జల్లెడపట్టి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తేనే కానీ, ఆ తోడేలు తిరిగి వలలో పడలేదు! సమాజానికి అతి ప్రమాదకరమైన ఆ మృగానికి అంత సులభంగా బెయిలు ఎలా మంజూరైంది? విచారణ వేగంగా పూర్తయ్యి, ఆ కేసులో శిక్ష పడి ఉంటే ఇప్పుడు ఇంకో చిన్నారి బలయ్యేది కాదు కదా! పోక్సో చట్టం కింద 2015-19 మధ్య దేశవ్యాప్తంగా 1.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో దాదాపు 20వేల కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. 2019 చివరి నాటికి 1.33 లక్షల పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్రం గత ఆగస్టులో లోక్‌సభాముఖంగా వెల్లడించింది. పైశాచిక ప్రవృత్తితో పేట్రేగిపోయే నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించాల్సిన చట్టం ఇలా చట్టుబండలు అవుతుండటమే దేశం దౌర్భాగ్యం.. భావితరం భద్రతకు అదే పెనుశాపం!

పోక్సో కేసులను సత్వరం విచారించాలని, అందుకు గానూ జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను కొలువుతీర్చాలని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితమే సర్కారుకు సూచించింది. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 389 న్యాయస్థానాల్లో- ఈ ఏడాది జూన్‌ నాటికి 343 సాకారమయ్యాయి. అయినా పెండింగ్‌ కేసుల కొండలు తరగడం లేదు. సభ్యసమాజం తలదించుకునేలా తమ పశువాంఛలకు పసివాళ్లను బలితీసుకునే హైనాలకు మరణదండన విధించేలా 2019లో చట్టాన్ని సవరించినా- చిన్నారులపై దుష్కృత్యాలు ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 1386 పోక్సో కేసులు నమోదైతే, ఏడాది తిరిగే సరికి వాటి సంఖ్య 1598 అయ్యింది. తెలంగాణలో గడచిన ఏడేళ్లలో ఈ వికృత నేరాలు దాదాపు మూడు రెట్లు ఎగబాకాయి. రాజస్థాన్‌లో ఈ ఏడాది తొలి అయిదు నెలల్లోనే 1200 పోక్సో కేసులు వెలుగుచూశాయి. తరతమ భేదాలతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే దుస్థితి! అమాయక చిన్నారులను కాటేస్తున్న వారిలో 95శాతం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులే! తండ్రులు, తాతలు, అన్నలు, ఉపాధ్యాయులు.. ఇళ్లలో, బడుల్లో తిష్ఠవేస్తున్న గోముఖ వ్యాఘ్రాల బారిన పడిన పసివాళ్లలో అత్యధికులు తమ బాధలను బయటికి చెప్పుకోలేక బిక్కుబిక్కుమంటున్నారు. జీవితాంతం వెంటాడే చేదు అనుభవాలతో కుంగి కృశించిపోతున్నారు. పోనుపోను పతనమవుతున్న సామాజిక నైతిక విలువలు, సారహీనమవుతున్న చదువులు, సెల్‌ఫోన్లలో వరదలెత్తుతున్న అశ్లీల దృశ్యాలు వెరసి- పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం ఏమీ ఎరగని చిన్నారులకు పీడకలలు మిగిలిస్తున్నాయి!

పసివాళ్లపై చిత్రీకరించిన అశ్లీల దృశ్యాల కోసం అంతర్జాలాన్ని జల్లెడపెట్టే మదోన్మత్తుల సంఖ్య నిరుడు దేశీయంగా దాదాపు 95శాతం పెరిగినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. అటువంటి అభ్యంతరకర, నిషేధిత నీలిచిత్రాల వీక్షణానికి అలవాటుపడ్డ వెయ్యి మందికి పైగా ప్రబుద్ధులు ఈ ఒక్క ఏడాదిలోనే పట్టుబడ్డారు. ఆన్‌లైన్‌ తరగతుల మాటున ఆ బూతుకు అలవాటు పడ్డ ఎనిమిది నుంచి పదకొండేళ్ల పిల్లలు ముగ్గురు ఇటీవల అస్సామ్‌లో ఓ ఆరేళ్ల పసిబిడ్డను పొట్టనపెట్టుకున్నారు. కేరళలో పదిహేనేళ్ల పిల్లాడు పట్టపగలే దారికాచి 23 ఏళ్ల యువతిపై అత్యాచార ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ నిషేధాలను దాటుకుని మరీ మొబైళ్లలోకి ప్రవహిస్తున్న నీలిచిత్రాలు- పసిమనసులను కలుషితం చేస్తున్నాయి. హేయ నేరాలకు పురికొల్పుతున్నాయి. తల్లిదండ్రులు తమ మగపిల్లలు ఏమి చేస్తున్నారో, అంతర్జాలంలో ఏమేమి చూస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి. చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగట్టే వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గతంలో ఉద్ఘాటించారు. పోక్సో చట్టం కింద శిక్షలు పడ్డవారికి క్షమాభిక్షకు అర్జీ పెట్టుకునే అవకాశమూ ఇవ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ మేరకు రాజ్యాంగ సవరణకు పార్లమెంటు చొరవ తీసుకోవాలని సూచించారు. చట్టపరంగా పకడ్బందీ చర్యలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలతో నవతరాన్ని కాచుకోవాలి. బాలలపై అకృత్యాలను అరికట్టడంలో పాలకులెంత ఆలస్యం చేస్తే- దేశ భవిష్యత్తు అంతగా అంధకార బంధురమవుతుంది!

- శైలేష్‌ నిమ్మగడ్డ

ఇదీ చదవండి:'కాంగ్రెస్​ను వీడటమే ఫైనల్​'- రాజీ వార్తలపై కెప్టెన్​

ABOUT THE AUTHOR

...view details