తెలంగాణ

telangana

తెలుగు ప్రజల ఓటే శాసనం.. కర్ణాటకలో 12 జిల్లాల్లో ప్రభావం.. మద్దతు ఎవరికో?

By

Published : Apr 26, 2023, 11:12 AM IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న కర్ణాటకలో తెలుగువారి ప్రభావం అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానుంది. స్థిరాస్తి వ్యాపారం, వ్యవసాయం, ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారు గణనీయంగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్లో వీరి చైతన్యం కొన్ని నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసేంతగా మారింది. అందుకే వచ్చే నెల 10న జరగనున్న కర్ణాటక విధానసభ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి.

KARNATAKA ASSEMBLY ELECTION
KARNATAKA ASSEMBLY ELECTION

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓటు కీలకం కానుంది. అనేక ప్రాంతాల్లో గెలుపోటములను తెలుగువారు నిర్దేశించనున్నారు. సంఖ్యాపరంగా 12 జిల్లాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి బళ్లారి, కోలారు, బెంగళూరు గ్రామీణం, బెంగళూరు నగరం, రాయచూరు, కొప్పళ, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, యాదగిరి, బీదర్‌, కలబురగి జిల్లాల్లోని నియోజకవర్గాల్లో తెలుగువారి సంఖ్య స్థానికుల కంటే ఎక్కువ. మామూలుగానైతే.. కర్ణాటకలో లింగాయత్‌, ఒక్కలిగ, ఎస్సీ/ఎస్టీలు, పార్టీల ప్రణాళికలు, ప్రాంతాల అభివృద్ధి, ప్రస్తుత పాలన వంటి అంశాలు ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయిస్తుంటాయి. కానీ ఈ 12 జిల్లాల్లో తెలుగు వారు కీలకంగా మారుతుంటారు.

ఎన్నికలు పోటాపోటీగా సాగే ప్రతిసారీ గెలుపోటములను వెయ్యి నుంచి ఐదు వేల ఓట్లు శాసిస్తుంటాయి. కర్ణాటకలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రతిసారీ కనీసం 17 శాతం సీట్లయినా ఇలాంటి స్వల్ప తేడాలతోనే ఉంటున్నాయి. 2008లో 30 స్థానాల్లో ఐదు వేల కంటే తక్కువ, 34 స్థానాల్లో వెయ్యి ఓట్ల కంటే తక్కువ తేడాతో అభ్యర్థులు గెలిచారు. 2013లో 49 స్థానాల్లో, 2018లో 52 స్థానాల్లో ఐదు వేలు అంతకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. ఇలాంటి సందర్భాల్లో తెలుగు ఓటర్ల పాత్ర కీలకం కాబోతోంది. ఈసారి ఎన్నికల్లోనూ తక్కువ ఓట్ల ఆధిక్యం నమోదయ్యే స్థానాల సంఖ్య 50కిపైగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే అభ్యర్థులు తెలుగు ఓటర్లను ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల ఎఫెక్ట్
కర్ణాటకలోని తెలుగు ఓటర్ల నాడిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని రాజకీయ సమీకరణాలు కొంతమేరకు ప్రభావితం చేస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదని చంద్రబాబు బహిరంగంగా విమర్శించటంతో తెదేపాను అభిమానించే కర్ణాటక తెలుగు ప్రజలు సహజంగానే భాజపా పట్ల వ్యతిరేకత చూపడాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ఉమ్మడి బళ్లారి, కొప్పళ, రాయచూరు, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు నగరం, గ్రామీణల్లో మొత్తం 64 స్థానాలకుగాను భాజపా కేవలం 20 చోట్ల గెలవటం గమనార్హం.

బీఆర్ఎస్ ప్రచారం ప్రభావమెంత?
తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీలు జాతీయ పార్టీల విషయంలో తటస్థంగా ఉండటంతో ఆ ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. ఆయన నేరుగా జనతాదళ్‌ ఎస్‌కు మద్దతు ప్రకటిస్తూ.. కల్యాణ కర్ణాటక ప్రాంతాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రచారం తెలుగు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి.

తెలుగువారిలో చైతన్యం
పదేళ్లుగా కర్ణాటకలోని తెలుగు ఓటర్లలో చైతన్యం పెరిగింది. కర్ణాటక కేబినేట్‌లోనూ తెలుగు నేతలకు ప్రాధాన్యమివ్వటంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కన్నడ రాజకీయాల్లో తెలుగువాళ్ల భాగస్వామ్యం పెరుగుతోంది. ఐటీ ఉద్యోగులు, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన సంఘాలు ఎన్నికల్లో ఓటు వేయాలని తమతమ సభ్యులను జాగృతం చేస్తున్నాయి. తుమకూరు, చిత్రదుర్గ, యాదగిరి, బీదర్‌, కలబురగి జిల్లాల్లో సగటున ఒక్కో నియోజకవర్గంలో 20% మంది తెలుగువారున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే కల్యాణ కర్ణాటకలోని 40 నియోజక వర్గాల్లో తెలుగు ఓటర్లు సగటున 45 శాతం దాకా ఉంటారని అంచనా.

ABOUT THE AUTHOR

...view details