ETV Bharat / opinion

కర్ణాటక పోరు.. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సగం మంది డిపాజిట్లు లాస్​.. ఎందుకిలా?

author img

By

Published : Apr 26, 2023, 8:48 AM IST

Candidates losing deposits in last 3 Karnataka Assembly elections
Candidates losing deposits in last 3 Karnataka Assembly elections

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు వెలుగుచూస్తుంటాయి. రామనగర జిల్లా ఆ రాష్ట్రానికి నలుగురు ముఖ్యమంత్రులను ఇవ్వగా.. అదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2008 నుంచి అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోతున్నారు! మరి ఈ సారి ఏం జరుగుతుందో?

ఐటీ, పర్యాటక రంగాలకు మాత్రమే కాకుండా రాజకీయంగానూ ప్రత్యేకతను సంతరించుకున్న రాష్ట్రం కర్ణాటక. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఇక్కడి రాజకీయ పరిస్థితులే వేరు. మైసూర్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి గత ఎన్నికల వరకు రాజకీయంగా భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

1983 తర్వాత అక్కడ ఏ రాజకీయ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేపట్టలేదు. అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వం రెండోసారి దాన్ని నిలబెట్టుకోలేక పోయింది. అయితే మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. కర్ణాటకలో 2008 తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల్లో అధిక శాతం పోటీదారులు తమ సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోతున్నారు. కొన్నిసార్లు అభ్యర్థుల్లో మూడో వంతు మంది సైతం కోల్పోతున్నారని ఎన్నికల కమిషన్ చెబుతోంది. వచ్చే నెలలో అక్కడ మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

ఏయే ఎన్నికల్లో ఎలా..
2008లో జరిగిన ఎన్నికల్లో 2242 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. అందులో 1694 మంది డిపాజిట్లు కోల్పోయారు. 2013 ఎన్నికల్లో మొత్తం 2948 పోటీ చేయగా.. 2419 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆ తర్వాత 2018 ఎలక్షన్లలో మొత్తం 2892 పోటీలో నిలబడగా.. అందులో డిపాజిట్లు కోల్పోయిన వారి సంఖ్య 1146కి తగ్గింది.

పార్టీల పరంగా చూస్తే..

  1. బీజేపీ: కర్ణాటకలో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో నిలబెట్టింది. అందులో 110 మంది గెలుపొందగా.. 31 మంది డిపాజిట్లు కోల్పోయారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 223 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా.. అందులో 40 మంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. ఇక 2018 ఎన్నికల్లో 224 నియోజకవర్గాల్లో పోటీ చేసి 104 గెలిస్తే.. 39 స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదు.
  2. కాంగ్రెస్: 2008లో జరిగిన ఎన్నికల్లో 222 స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో 80 మంది విజయం సాధిస్తే.. 11 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2013లో 122 స్థానాల్లో గెలిస్తే.. 23 స్థానాల్లో డిపాజిట్లు పోయాయి. 2018లో 223 స్థానాల్లో పోటీకి గానూ 80 సీట్లు గెలిచి 13 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది హస్తం పార్టీ.
  3. జేడీఎస్: 2008 ఎలక్షన్లలో జేడీఎస్ 219 మందిని బరిలోకి దింపితే అందులో 28 మంది మాత్రమే గెలిచారు. 107 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2013లో 222 నియోజకవర్గాల్లో పోటీకి గానూ 40 సీట్లలో విజయం సాధిస్తే.. 110 మంది అభ్యర్థులకు డిపాజిట్లు దక్కులేదు. ఇక 2018లో 37 మంది గెలవగా.. 107 మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు.
  4. స్వతంత్ర అభ్యర్థులు: కర్ణాటకలో ఇక స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వస్తే.. 2008 ఎన్నికల్లో పోటీ చేసిన 944 మందిలో 923 మంది డిపాజిట్లు నష్టపోయారు. 2013 లో 1217 మంది అభ్యర్థులకు గానూ 1190 మంది డిపాజిట్లు కోల్పోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 1153 అభ్యర్ధులు పోటీ చేస్తే 1138 మందివి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ఎంత మొత్తం డిపాజిట్ చెయ్యాలి?
ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1951, సెక్షన్ 31 (1) (ఎ) ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 10 వేలు చెల్లించాలి. అదే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ. 25 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు అయితే నిర్దేశిత అమౌంట్​లో సగం కట్టాలి. అంటే అసెంబ్లీ ఎన్నికలకు రూ.5 వేలు, పార్లమెంట్ ఎన్నికలకు రూ.12,500 చెల్లించాలి.

సెక్యూరిటీ డిపాజిట్లు ఎప్పుడు కోల్పోతారు?
ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951లోని సెక్షన్ 158 ప్రకారం ఏదైనా నియోజకవర్గంలో పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్లలో అభ్యర్థికి ఆరో వంతు కంటే తక్కువ వస్తే.. వారు ఆ డిపాజిట్లు కోల్పోతారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్లు పోలైతే అందులో అభ్యర్థులకు కనీసం 16,666 ఓట్లు రావాలి. అంతకంటే తక్కువ వస్తే డిపాజిట్లు దక్కవు.

కర్ణాటకలో 16వ అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలు అదే నెల 13న వెల్లడించనున్నారు. మొత్తం 224 స్థానాలుండగా ఇప్పటికే నామినేషన్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.