తెలంగాణ

telangana

శాంతి కాముకులా? వార్తాహరులా?.. జర్నలిస్టులంటే ఎవరు?

By

Published : Nov 15, 2022, 7:17 PM IST

సమాధానం లేని ప్రశ్నంటూ ఉండదు. మిలియన్ డాలర్ల ప్రశ్నకైనా సమాధానం కచ్చితంగా ఉంటుంది. 'జర్నలిస్టులనే వారు శాంతి కాముకులా.. వార్తలను మోసుకెళ్లేవారా?' అనే చిన్న ప్రశ్న సంగతేంటి?

can Journalists Promote peace
can Journalists Promote peace

ఓ కొత్త భాష.. కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుందని అంటుంటారు. ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో భాషలు ఉన్నాయి. సమాచార మార్పిడికి భాషే చాలా కీలకం. వార్తల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సమాచారం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది దానిలోని వాస్తవికతపై ఆధారపడి ఉంటే.. ఈ సమాచారం ఎంత మందికి చేరుకుంటుందనేది దాని విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. అయితే, చివరకు వార్తను ప్రసారం చేసే సాధనం మాత్రం భాషే! కానీ, అదే భాషను మతపరమైన కోణంలో చూస్తే సమాచార వ్యాప్తి ప్రభావితం అవుతుంది. వాస్తవికత, సమగ్రత దెబ్బతింటుంది. వార్తల విషయంలో సమాచారానికి పెద్ద పీట వేసి.. భాషను సాధనంగానే చూడాల్సి ఉంటుంది. కానీ అదే భాషకు కాషాయ, ఆకుపచ్చ వంటి రంగులు పూస్తే.. సమాచారాన్ని హత్య చేసినట్లే అవుతుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్​లోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో కీలక సదస్సు జరిగింది. ఉర్దూ జర్నలిజం 200 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉర్దూ భాషను మతపరమైన కోణంలో చూడొద్దనేది వీరి ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో చాలా వరకు ఉర్దూయేతర నేపథ్యం ఉన్నవారే ఉండగా.. ఉర్దూ జర్నలిజం.. ఇతర భాషల జర్నలిజం వంటిదేనన్న అంశాలపై వీరంతా ప్రసంగాలు చేశారు. ఉర్దూ కేవలం ముస్లింల భాష కాదని, అందరికీ సంబంధించినదన్న సందేశాన్ని వినిపించారు. చారిత్రకంగా చూసినా ఉర్దూ అందరి భాషేనని అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. బ్రిటిష్ ఇండియా రాజధాని కోల్​కతాలో తొలుత ఉర్దూ పత్రిక ప్రారంభమైందని, దాన్ని స్థాపించింది హిందువేనని వక్తలు గుర్తు చేశారు.

జర్నలిస్టులు శాంతికి దూరమా?
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వక్తలు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు జర్నలిస్టులు అనేక అంశాలపై మాట్లాడారు. మీడియా.. శాంతిని ప్రచారం చేయాలా? లేదా? అనే అంశంపై వాడీవేడిగా చర్చ జరిపారు. మీడియా శాంతిని ప్రచారం చేయదని, నిజాలను చెప్పేందుకే మీడియా ఉందని ఓ వక్త వాదించారు. అయితే, మీడియా.. శాంతి ప్రచారక సాధనంగా ఉండాలా? లేదా వార్తలను ప్రసారం చేసే సాధనంగానా? అనే విషయంపై మాత్రం చిక్కుముడి వీడలేదు. జర్నలిజం ప్రాథమిక సూత్రాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఈ విషయాన్ని ఇప్పుడే తేల్చలేం.

శాంతిని ప్రోత్సహిస్తూ.. అహింసకు మద్దతు ఇవ్వడం అనేది అంశాలను కూడా జర్నలిజంలో ఓ అజెండాగా తీసుకోవచ్చు. కానీ, జర్నలిజం అనేది వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. నిజాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రతిబింబించేలా చేస్తుంది. ఎంత చేదు వాస్తవాలనైనా నిక్కచ్చిగా చెప్పగలగడమే జర్నలిజం విధి. జర్నలిస్టులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి.

(బిలాల్ భట్- ఈటీవీ భారత్ నెట్​వర్క్ ఎడిటర్)

ABOUT THE AUTHOR

...view details