తెలంగాణ

telangana

ఆ దేశ రాజధాని మార్పు.. హడావుడిగా పనులు.. ఒక్కసారిగా ఎందుకిలా?

By

Published : Mar 9, 2023, 4:40 PM IST

ఇండోనేసియా రాజధాని ఏదంటే టక్కున చెప్పే సమాధానం జకార్తా. అయితే మరికొద్ది నెలల్లో ఆ దేశ రాజధాని జకార్తా కాదు.. దానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని బోర్నియో ద్వీపంలోని నుసంతర ప్రాంతం. ప్రస్తుతం కొత్త రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అసలు రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి? కొత్త నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

indonesia new capital
indonesia new capital

ఇండోనేసియా అనేక దీవుల సమాహారం. ఎక్కువ భాగం అటవీ ప్రాంతం కావడం వల్ల నేలపై జనాభా ఒత్తిడి ఉంటుంది. జావా ద్వీపంలోని రాజధాని జకార్తా ఇప్పటికే ఒకటిన్నర కోటికి పైగా జనాభాతో కిక్కిరిసిపోయింది. మరో పక్క సముద్రతీరంలోని జకార్తా ఏటా కిందకు కుంగుతోంది. ఏటా కొన్ని సెంటీమీటర్ల మేర నేల కుంగుతోంది. దీంతో జకార్తా ఎదుర్కొంటున్న భారీ పర్యావరణ సవాళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు రాజధానినే మార్చుతోంది ఇండోనేసియా ప్రభుత్వం.

బోర్నియో ద్వీపంలోని తూర్పున గల కాలిమాంటన్​ అటవీ ప్రాంతంలో నుసంతర పేరిట కొత్త నగరాన్ని నిర్మిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. అసలు ఇండోనేసియా రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి? పర్యావరణ కార్యకర్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? కొత్త రాజధాని నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయి? నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.

అసలు రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు?
ప్రస్తుతం జకార్తాలో సుమారు కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రేటర్​ మెట్రో పాలిటన్​ ప్రాంతంలో 35 లక్షల మంది ఉన్నారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో జకార్తా నగరం వేగంగా మునిగిపోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతుండటం వల్ల ఈ కొత్త రాజధాని నగరం అవసరమైంది. వేర్వేరు నివేదికల ప్రకారం 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక వంతు మునిగిపోయే అవకాశం ఉంది.

భూగర్భజలాల తోడివేత
వానలు భారీగా కురిసినా సరైన నీటి సంరక్షణ విధానాలు లేకపోవడం వల్ల జకార్తా ప్రజలు భూగర్భ జలాలను బోర్ల ద్వారా తోడివేస్తున్నారు. నగరం కిందకు దిగిపోయేందుకు ఇదే ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అనియంత్రిత భూగర్భ జలాల వెలికితీత వల్ల వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇండోనేసియా కొత్త రాజధాని

కొత్త రాజధాని ఎలా ఉంటుంది?
రాజధానిగా మారబోతున్న నుసంతర ప్రదేశం బోర్నియో ద్వీపంలోని తూర్పున గల కాలిమాంటన్​ అటవీ ప్రాతంలో ఉంది. నుసంతర అంటే ద్వీప సమూహం అని అర్థం. ప్రస్తుత రాజధాని జకార్తాకు 2 వేల కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రణాళిక ప్రకారం.. నుసంతరలో ప్రభుత్వ భవనాలు, ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. 1.5 మిలియన్లకు పైగా ప్రజలకు నుసంతరలో పునరావాసం కల్పించనున్నారు.

కొత్త రాజధాని ఎప్పుడు ప్రారంభం?
కొత్త రాజధాని నగరానికి ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్‌ వర్తింపజేస్తున్నామని నుసంతర నేషనల్​ క్యాపిటల్​ అథారిటీ ఆఫీసర్​ బాంబాంగ్​ తెలిపారు. చుట్టుపక్క ప్రాంతాల్లో భారీ సంఖ్యలో చెట్లు పెంచనున్నామని పేర్కొన్నారు. ఇండోనేసియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఆగస్టు 17న ఈ నగరాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణ పనులు.. 2045 నాటి పూర్తవుతాయని వెల్లడించారు. అదే సంవత్సరం ఇండోనేసియాలో 100వ స్వాతంత్య వేడుకలు జరగనున్నాయని ప్రకటించారు.

ఇండోనేసియా కొత్త రాజధాని నిర్మాణ పనులు

పర్యావరణవేత్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
అయితే కొత్త రాజధాని ఏర్పాటుపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నేషనల్​ టౌన్​ ప్లానింగ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ లెక్కల ప్రకారం రాజధాని ప్రాజెక్ట్ కోసం 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. దీంతో ఆ అటవీ ప్రాంతంలో చిరుతపులులతోపాటు అనేక ఇతర వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. అటవీ సమస్యలను పర్యవేక్షించే ఇండోనేసియా ప్రభుత్వేతర సంస్థ ఫారెస్ట్ వాచ్ ఇండోనేసియా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

అయితే ఇప్పటికే కొత్త రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నందున చుట్టుపక్క ఐదు గ్రామాలను అధికారులు ఖాళీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాల ప్రజలను తరలించనున్నారు. కాగా, కొత్త రాజధానికి స్థానిక నాయకుల నుంచి మద్దతు లభించిందని ఇండోనేసియా ప్రభుత్వం తెలిపింది. కొత్త రాజధాని నగరానికి భూములు అందిస్తున్న ప్రజలకు పరిహారం కూడా అందించామని చెప్పింది.

ఇండోనేసియా కొత్త రాజధాని నిర్మాణ పనులు

2019లో ప్రకటన..
అయితే ఇండోనేసియా రాజధానిని మార్చే ప్రణాళికను 2019లోనే ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. జకార్తా ఎదుర్కొంటున్న భారీ పర్యావరణ సవాళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే 2019లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. అందువల్ల 2022 నుంచి 2024 మధ్యలో రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు జకార్తానే ఇండోనేసియా రాజధానిగా కొనసాగనుంది.

ఇండోనేసియా కొత్త రాజధాని మ్యాప్​
ఇండోనేసియా కొత్త రాజధాని

ABOUT THE AUTHOR

...view details