తెలంగాణ

telangana

వైకల్యాన్ని ఓడించి.. విజేతలుగా నిలిచి..

By

Published : Sep 6, 2021, 7:30 AM IST

దిగ్విజయంగా ముగిసిన తాజా టోక్యో విశ్వ దివ్యాంగ క్రీడా సమరంలో భారతీయ ఆటగాళ్లు ఒడిసిపట్టిన పతకాలు పందొమ్మిది! అచంచల ఆత్మవిశ్వాసం, గెలిచి తీరాలన్న తపనకు కఠోర సాధన జతకలిస్తే విజయం తథ్యమని నిరూపించిన క్రీడాకారులపై ఆసేతుహిమాచలం అభినందనల వర్షం కురుస్తోందిప్పుడు. గతానికి భిన్నంగా 54 మందితో టోక్యో బరిలోకి దిగిన భారత బృందంపై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పోటీపడుతున్న తొమ్మిది క్రీడాంశాల్లో కనీసం 15 పతకాలు సాధిస్తారని కథనాలు వెలువడ్డాయి.

Tokyo Paralympics
విశ్వ దివ్యాంగ క్రీడా సమరం

ఆరు దశాబ్దాల పారాలింపిక్స్‌ చరిత్రలో ఇంతవరకు ఇండియా సాధించిన పతకాలు పట్టుమని పన్నెండు. దిగ్విజయంగా ముగిసిన తాజా టోక్యో విశ్వ దివ్యాంగ క్రీడా సమరంలో భారతీయ ఆటగాళ్లు ఒడిసిపట్టినవి పందొమ్మిది! అచంచల ఆత్మవిశ్వాసం, గెలిచి తీరాలన్న తపనకు కఠోర సాధన జతకలిస్తే విజయం తథ్యమని నిరూపించిన క్రీడాకారులపై ఆసేతుహిమాచలం అభినందనల వర్షం కురుస్తోందిప్పుడు. గతానికి భిన్నంగా 54 మందితో టోక్యో బరిలోకి దిగిన భారత బృందంపై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పోటీపడుతున్న తొమ్మిది క్రీడాంశాల్లో కనీసం 15 పతకాలు సాధిస్తారని కథనాలు వెలువడ్డాయి. అందరి ఆశలకు మించి రాణించిన ఆటగాళ్లు- అయిదు స్వర్ణాలతో సహా 19 పతకాలను కైవసం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించారు.

అలా ఆరంభమైంది...

టేబుల్‌ టెన్నిస్‌లో భవీనాబెన్‌ పటేల్‌ రజత పతకాన్ని గెలుచుకోవడంతో ఇండియా విజయ ప్రస్థానం ఆరంభమైంది. ఆపై షూటింగ్‌లో అవని లెఖరా ప్రపంచ రికార్డును సమం చేస్తూ పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. జావెలిన్‌త్రో, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌లలో సుమిత్‌ అంటిల్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణ నాగర్‌, మనీష్‌ నర్వాల్‌ బంగరు పతకధారులయ్యారు. షూటింగ్‌ రేంజిలో తమ గురికి తిరుగు లేదని చాటుతూ అవని, సింగ్‌రాజ్‌ అధానాలు చెరో రెండు పతకాలను చేజిక్కించుకొన్నారు. పారాలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్‌లో విశేషంగా రాణించిన ఇండియా- అథ్లెటిక్స్‌లోను ఘన విజయాలను నమోదుచేసింది. అయిదేళ్ల క్రితం రియో పోటీలతో పోలిస్తే పతకాల పట్టికలో చాలా ముందుకొచ్చి 24వ స్థానాన్ని సాధించింది. పసినాళ్లలోనే పోలియో వంటి వ్యాధుల కోరల్లో చిక్కినా, ఎదిగిన వయసులో తీవ్ర ప్రమాదాలకు గురై దివ్యాంగులైనా- చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన విజేతల అపూర్వగాథలన్నీ అద్వితీయ స్ఫూర్తిపాఠాలే. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారితో పోలిస్తే బతుకు చీకట్లను ఛేదించుకొంటూ, మరింత క్రీడాస్ఫూర్తి, పట్టుదల కనబరుస్తూ పారాలింపిక్స్‌లో పోటీపడ్డ వారందరూ- క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ అభివర్ణించినట్లు నిజజీవిత హీరోలే!

విజయ సాధనకు అంగవైకల్యం ఆటంకం కాబోదని విఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఏనాడో ఉద్ఘాటించారు. కానీ, దేశీయంగా దివ్యాంగులకు అసలు అవకాశాలు ఎంత మేరకు లభిస్తున్నాయన్నదే కీలక ప్రశ్న! దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది వరకు దివ్యాంగులు ఉన్నట్లు అంచనా. వీరిలో 34 లక్షల మందికే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు ఇటీవల ఓ అధ్యయనంలో వెలుగుచూసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో వారికి ప్రోత్సాహం అంతంతమాత్రమే; స్వయంఉపాధికి ప్రభుత్వ పథకాలూ అంతగా అక్కరకు రావడం లేదు. 'దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. తనిఖీ చేస్తే భయంకర వాస్తవాలు నిగ్గుతేలతాయి' అని తెలంగాణ హైకోర్టు నిరుడే వ్యాఖ్యానించింది.

బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వ్యవస్థలు, కార్యాలయాల్లో ప్రత్యేక ర్యాంపుల వంటివి ఏర్పాటు చేయాలన్న నిబంధనలూ క్షేత్రస్థాయిలో నీరుగారిపోతున్నాయి. ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ తదితర దేశాలు మేలిమి విధానాలతో దివ్యాంగులను అక్కున చేర్చుకొంటున్నాయి. తద్భిన్నమైన దుర్భర దృశ్యాలతో దేశీయంగా వారి హక్కులు కొల్లబోతున్నాయి. విద్య, ఉపాధుల్లో దివ్యాంగుల పట్ల నెలకొన్న దుర్విచక్షణకు చరమగీతం పాడుతూనే- ఆసక్తి ఉన్న రంగాల్లో వారు ఎదిగేందుకు చేయూతనందించాలి. పారాలింపిక్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పోటీపడటానికి అవరోధమవుతున్న మౌలిక సదుపాయాలు, నిధులు, వైకల్య వర్గీకరణ నిపుణుల కొరతను అధిగమించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు చురుగ్గా స్పందిస్తేనే- అంతర్జాతీయ యవనికపై భారతీయ కీర్తిప్రభలు మరింతగా తేజరిల్లుతాయి!

ఇదీ చూడండి:paralympics: ఘనంగా, దిగ్విజయంగా పారాలింపిక్స్

TAGGED:

ABOUT THE AUTHOR

...view details