తెలంగాణ

telangana

Drug menace: కుప్పలుతెప్పలుగా మత్తుమందులు- పొంచి ఉన్న మహాముప్పు

By

Published : Nov 18, 2021, 6:46 AM IST

Updated : Nov 18, 2021, 8:45 AM IST

పెచ్చరిల్లుతున్న మాదకద్రవ్యాలతో (Drug menace) యువశక్తులు నిర్వీర్యమైపోతూ పెను విషాద దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. దేశీయంగా గంజాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంటే- హెరాయిన్‌ వంటి మత్తుమందులు విదేశాల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల నుంచి సముద్ర మార్గంలో గుజరాత్‌లోకి(Gujarat drugs news) మాదకద్రవ్యాలు వెల్లువెత్తుతున్నాయి. నిర్దేశిత కాలపరిమితితో కూడిన లక్ష్యాలు, సమధిక నిధులతో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏకతాటిపై పోరు సల్పితేనే- మాదకద్రవ్యాల భల్లూకం పట్టు నుంచి భారతావని బయటపడగలుగుతుంది!

India on the brink of drug menace
మాదక ఉగ్రవాద మహాముప్పు

భారతదేశం ఇప్పుడు 'మాదక ఉగ్రవాద' మహాముప్పు (Drug menace) ముంగిట్లో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల హెచ్చరించారు. మాదకద్రవ్యాలే పెట్టుబడిగా పెద్దయెత్తున డబ్బు సమకూర్చుకుంటున్న నేరముఠాలు- విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దులకు ఆవల నుంచి చైనా రువ్వుతున్న సవాళ్లతో పోలిస్తే- పెచ్చరిల్లుతున్న మాదకద్రవ్యాలతో యువశక్తులు నిర్వీర్యమైపోతూ ఆసేతుహిమాచలం అంతకు మించిన పెను విషాద దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. దేశీయంగా గంజాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంటే- హెరాయిన్‌ వంటి మత్తుమందులు విదేశాల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల నుంచి సముద్ర మార్గంలో గుజరాత్‌లోకి మాదకద్రవ్యాలు (Gujarat drugs news) వెల్లువెత్తుతున్నాయి.

గడచిన వారం రోజుల్లోనే అక్కడి మోరబి, ద్వారక జిల్లాల్లో రూ.900 కోట్ల విలువైన మత్తుమందులు పట్టుబడ్డాయి. డార్క్‌వెబ్‌ ద్వారా అంతర్జాతీయ స్మగ్లర్లతో అనుసంధానమైన మాదక ముఠా ఒకటి తాజాగా అహ్మదాబాద్‌ పోలీసులకు చిక్కింది. విజయవాడ చిరునామాతో గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయానికి (Gujarat drugs news) చేరిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ గుట్టు ఇటీవలే రట్టయ్యింది. ఆ తరవాతా అదురూబెదురూ లేకుండా మాదక ముఠాలు పేట్రేగిపోతున్న తీరు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం గంజాయి భారీగా పోటెత్తుతోంది. రెండు రోజుల క్రితం 1240 కేజీల సరకును హైదరాబాదు పోలీసులు పట్టుకుంటే- మహారాష్ట్రలోని నాందేడ్‌లో మరో 1127 కిలోల గంజాయిని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనపరచుకున్నారు.

విశాఖ నుంచి భోపాల్‌, కోటా, ఆగ్రా తదితర నగరాలకు గంజాయి (Drug menace) తరలింపునకు అమెజాన్‌ ఈ-కామర్స్‌ వేదికను (Amazon drug case) వినియోగించుకుంటున్న నేరగాళ్ల కుయుక్తులను మధ్యప్రదేశ్‌ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. 'నషా ముక్త్‌ భారత్‌' కోసం కొన్నాళ్లుగా ఆదర్శాలు ఎంతగా జోరెత్తుతున్నా- క్షేత్రస్థాయిలో బలగాల మధ్య సమన్వయ రాహిత్యంతో ఆచరణే కొల్లబోతోంది. పోనుపోను వెర్రితలలు వేస్తున్న దారుణ విష వ్యసన సంస్కృతి- ప్రజారోగ్యాన్ని వధ్యశిలపైకి ఈడ్చుకుపోతోంది!

డార్క్‌వెబ్‌ ద్వారా మత్తుమందుల క్రయవిక్రయాలు గడచిన మూడేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయని ప్రపంచ మాదకద్రవ్యాల నివేదిక-2021 స్పష్టీకరించింది. క్రిప్టో కరెన్సీ విపణిని నియంత్రించడం, డిజిటల్‌ చెల్లింపులను ఒక కంట కనిపెడుతూ అనుమానిత లావాదేవీలను గుర్తించడం వంటివి కట్టడి చర్యల్లో కీలకమని అది సూచించింది. మత్తుమందుల క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపడంలో కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం కోసం అయిదేళ్ల క్రితమే నార్కో సమన్వయ కేంద్ర వ్యవస్థను కొలువుతీర్చినా- అంతర్జాల ఆధారిత అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే సమర్థ యంత్రాంగమే దేశంలో కొరవడింది. మాదక వ్యాపారం దేశ భద్రతకే పెనుప్రమాదంగా పరిణమించినట్లు ఉద్ఘాటించిన కేంద్ర హోంశాఖ- దాన్ని నిలువరించాలంటే ఎన్‌సీబీలో కొత్తగా మూడు వేల మంది సిబ్బందిని నియమించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది.

కంబోడియా, వియత్నాం వంటి దేశాలు మాదకాసురులకు మరణశిక్షలు విధిస్తున్నాయి. సత్వర విచారణలు, కఠిన శిక్షల భయమే లేని భారతదేశంలో నేరగాళ్ల ఆటలు (Gujarat drugs news) యథేచ్ఛగా సాగిపోతున్నాయి. యువభారత భవితను బలితీసుకుంటున్న మాదక మహోత్పాతాన్ని నిరోధించాలంటే- ఎన్‌సీబీ, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీసు విభాగాలు సమష్టిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించాలి. మత్తుమందులతో ముంచుకొచ్చే ప్రమాదాలపై విద్యాలయాల్లో చైతన్య ప్రచారమూ జోరందుకోవాలి. ఆ దిశగా నిర్దేశిత కాలపరిమితితో కూడిన లక్ష్యాలు, సమధిక నిధులతో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏకతాటిపై పోరు సల్పితేనే- మాదకద్రవ్యాల (Drug menace) భల్లూకం పట్టు నుంచి భారతావని బయటపడగలుగుతుంది!

ఇవీ చూడండి:అభినవ సావిత్రి.. భర్త విడుదల కోసం నక్సల్స్​తో పోరాటం!

బారికేడ్​పై నుంచి జంప్ చేసిన ఏనుగు- కుక్క పిల్లల్ని దత్తత తీసుకున్న కోతి!

Last Updated : Nov 18, 2021, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details