తెలంగాణ

telangana

రైతుల ఆలోచన ధోరణి మార్పుతో.. లాభసాటి సాగు

By

Published : Aug 2, 2020, 11:21 AM IST

రైతుల్లో లాభసాటి సాగు విధానాలపై అవగాహన లేకపోవడం వల్ల భారీగా నష్టపోతున్నారు. సాంకేతిక అవకాశాల గురించి విస్తరణ యంత్రాంగం అవగాహన కల్పించగలిగితే రైతులకు భరోసా ఏర్పడుతుంది. కానీ పరిశీలన, చొరవ లోపిస్తుండటంతో అధిక శాతం రైతులు మూస పద్ధతికి అలవాటుపడ్డారు. పంటను అదే రూపంలో అమ్మితే వచ్చేది మద్దతు ధరే. విలువ జోడించడం లేదా నేరుగా వినియోగదారులకు విక్రయించే ఆలోచన చేయగలిగేలా రైతుల్లోని నైపుణ్యాలకు పదును పెట్టాలి.

Editorial on situation of lack of awareness in farmers
రైతుల ఆలోచన ధోరణి మర్పుతో.. లాభసాటి సాగు

లాభసాటి సాగు పద్ధతులపై విస్తృత అవగాహన లోపించడంతో రైతుల్ని నష్టభయం వెంటాడుతోంది. 85శాతం చిన్న, సన్నకారు రైతులున్న దేశంలో పంటలసాగు వారికి ఆశావహంగా కనిపించడం లేదు. అవకాశాలు కళ్లముందే ఉన్నా, వాటిని అందిపుచ్చుకోవడంలో వైఫల్యమే అసలు సమస్య. నిరక్షరాస్యులు అధికంగా ఉండటం వల్ల సేద్యం దండగమారి వ్యాపకంగా ముద్రపడుతోంది. సాంకేతిక అవకాశాల గురించి విస్తరణ యంత్రాంగం అవగాహన కల్పించగలిగితే రైతులకు భరోసా ఏర్పడుతుంది. వాణిజ్య సరళిలో సాగు చేపట్టడం ద్వారా లాభసాటి ధరలు పొంది స్థిరమైన ఆదాయాలు దక్కించుకునే అవకాశముంది.

వ్యాపార దృక్పథం అవసరం

స్వాతంత్య్రానంతరం సాగుకు దశ దిశ కల్పించలేకపోవడం పాలకుల తప్పయితే, సాగుతప్ప మరో వ్యాపకం ఎరుగని రైతుల తీరుతో ఆ రంగంపై ఆధారపడినవారి భవిత అగమ్యగోచరమవుతోంది. పరిశీలన, చొరవ లోపిస్తుండటంతో అధిక శాతం రైతులు మూస పద్ధతికి అలవాటుపడ్డారు. వైవిధ్యాన్ని, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, ఆదాయ మార్గాలను పెంచుకునేలా పంటల సరళి మార్పు చేసుకోవడం రైతుల్లో లోపిస్తోంది. కాస్త నీరుంటే చాలు వరి తప్ప మరో ఆలోచన చేయని రైతుల సంఖ్య అత్యధికం. వారి ఆలోచనా దృక్పథం మారాలి. రైతులు వ్యాపారుల్లా మారాలి. పండించే పంటకు ఏయే నెలల్లో మంచి ధరలు వస్తున్నాయో పరిశీలించాలి. ఉదాహరణకు జూన్‌, జులై నెలల్లో సరఫరా తగ్గి కూరగాయల ధరలు మండిపోతుంటాయి. కృత్రిమ కొరత అంశాన్ని పక్కనపెడితే- ఇలాంటి సందర్భాలను పసిగట్టి, ఆ సమయంలో పంట చేతికందేలా చూసుకోవాలి. మార్కెట్‌ గిరాకీకి తగ్గట్లు మార్పు ఉండాలి. ఊరంతా ఒకే పంట వేసే బదులు సమీప మార్కెట్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. అర ఎకరంలోనే ఇంటికి కావలసినవన్నీ పండించే ‘అన్నపూర్ణ పద్ధతి’ని ఆచరించి చూపిన పార్వతీపురం జట్టు ట్రస్టు విజయగాథ మనకు తెలిసిందే. పండించే రైతుకు పాలు, ధాన్యం, పప్పులు, కాయగూరలను మార్కెట్లో కొనే పరిస్థితి రాకూడదు. ఎకరా రెండెకరాల్లో చీకూచింతా లేకుండా సేద్యం సాగించే పద్ధతులను ఆచరించాలి. అందుకు ఎన్నో నమూనా పద్ధతులు ఉన్నాయి. వీటిపై రైతులు, రైతుబిడ్డలు స్వయంగా అవగాహన ఏర్పరచుకోవాలి.

సాగు కోసం తెచ్చిన రుణాలను వెంటనే తీర్చేయాలనే ఆత్రుతలో చిన్న రైతులు ఉంటారు. సంస్థాగత రుణాలు అందరికీ అందవు కాబట్టి అధిక వడ్డీల భారం పడకుండా కల్లాలలోనే పంటను అమ్మేస్తుండటం పరిపాటి అయింది. వారికి సంస్థాగత రుణాలు అందించగలిగితే ఈ దుస్థితి తప్పుతుంది. ధర లేనప్పుడు ఉత్పత్తిని నిల్వ చేసుకుని సమయం వచ్చేదాకా ఆగే అవకాశం రైతుకు ఉంటుంది. రుణ సమస్యలు లేనివారు మంచి ధర పొందేందుకు యత్నిస్తున్నారు. అలానే గ్రామం దాటి పంట తరలించే పరిస్థితులు మెరుగుపడాలి. ఒక ఉత్పత్తికి ఇతర విపణుల్లో ఉన్న ధరలు నేడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా పంట తరలింపుతో మెరుగైన ధరలు పొందే వీలుంది. ప్రభుత్వమూ ఆయాప్రాంతాల్లో ఆహారశుద్ధి రంగాన్ని విస్తరిస్తే ఉత్పత్తులకు మార్కెట్‌ సమస్యలు తీరి, స్థిరమైన ఆదాయాలు అందుతాయి. సేంద్రియ సేద్య విధానాలను అనుసరిస్తే కాలనీ, గేటెడ్‌కమ్యూనిటీ సంఘాల వారి ఆదరణా పొందవచ్ఛు కరోనా ప్రభావంతో ప్రజల ఆలోచనా ధోరణుల్లో వచ్చిన సానుకూల మార్పుల దృష్ట్యా రసాయనాలు లేని ఆహారోత్పత్తుల సాధనకు ఉపక్రమించాలి. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. రైతులూ లాభపడతారు. సేంద్రియ ఉత్పత్తులు విక్రయించే దుకాణాలు, సూపర్‌ మార్కెట్లను సంప్రతించి వారితో ఒప్పందాలు చేసుకుంటే మద్దతు ధర కంటే మంచి ధర లభిస్తుంది. సేంద్రియ సేద్యం వల్ల భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడులూ అందుతాయి. పర్యావరణ పరిరక్షణా సాకారమవుతుంది. సేద్యం గురించి ఓనమాలు తెలియని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉద్యోగాలు మానేసి వినూత్న రీతిలో వ్యవసాయ వాణిజ్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంటే- అన్నీ తెలిసిన రైతులు చిన్నపాటి చొరవ చూపితే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాలి.

నైపుణ్యాల సాధనతో...

మార్కెట్‌ నైపుణ్యాల సాధన, మిశ్రమ పంటల సాగు, పంటల సరళిలో మార్పులు తదితర ఆలోచనలు రైతుకు మంచి ఫలితాలను అందిస్తాయి. శాస్త్రీయంగా తరచూ పంట మార్పిడి చేపట్టాలి. సీజన్ల విరామ సమయంలో స్వల్పకాల దిగుబడులిచ్చే కూరగాయ పంటలు సాగు చేయాలి. ఖర్చు తగ్గించుకుంటూ నికరాదాయం పెంచుకునే ఆలోచనలు అవసరం. నాణ్యమైన పంట, విలువు జోడింపు, మెరుగైన ధర తరహా ఆలోచనలు సాగాలి. రోజులు మారుతున్నాయి. సమీప వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలను సంప్రతిస్తే మెరుగైన సాగు పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం తదితరాల గురించి రైతులు తెలుసుకోవచ్ఛు మేలు రకం వంగడాలు, పంట నాణ్యత, అత్యాధునిక సాగు పద్ధతులు, సాంకేతిక మెలకువల గురించి అవగాహన పెంచుకోవచ్ఛు ప్రభుత్వమూ సాగుదారులందరికీ రుణాలు అందించాలి. మార్కెట్లలో మౌలిక వసతులు పెంచాలి. ఉత్పాదకత పెంచేలా విస్తరణ సేవలు పెంపొందించాలి. కూలీల సమస్యను అధిగమించేందుకు మహిళా సంఘాలకు యంత్రాలు, పనిముట్లను ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచాలి. రైతుకు ఆదాయ భద్రత కల్పించాలి. రైతుల చొరవ, ప్రభుత్వ చేయూత, అవగాహన పెంచేలా యంత్రాంగం కృషిచేస్తే నైపుణ్యాలను అందిపుచ్చుకొని రైతులు సేద్యాన్ని లాభసాటిగా మార్చుకోగలుగుతారు!

అధిక ధరకు వ్యూహాలు

పంటను అదే రూపంలో అమ్మితే వచ్చేది మద్దతు ధరే. విలువ జోడించడం లేదా నేరుగా వినియోగదారులకు విక్రయించే ఆలోచన చేయగలిగేలా రైతుల్లోని నైపుణ్యాలకు పదును పెట్టాలి. అపార్టుమెంట్లు, కాలనీలు, గేటెడ్‌కమ్యూనిటీ సంఘాలు కూడా ఈ దిశగా ఆలోచించాలి. కుటుంబాలకు కావలసిన ధాన్యం, పూలు, పండ్లు, పప్పులను సరఫరా చేసే బాధ్యతను రైతులకే అప్పగించాలి. పెద్ద పట్టణాలకు సమీపంలోని రైతులూ వీరిని కలిసి తమ పంటకు విలువ చేకూర్చి వారికి సరఫరా చేయాలి. ఉదాహరణకు రైతులు సాంబమసూరి/ సోనా/తెలంగాణ సోనా బియ్యం తింటారనుకుంటే రైతులు తమ పంటను మరపట్టించి ఈ సంఘాలకు సరఫరా చేయాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి సరఫరా చేస్తే వ్యాపారులకు దక్కే కమిషన్‌ మిగిలి, వినియోగదారులు, రైతుకు లాభసాటిగా ఉంటుంది. ఇలా ఎక్కడికక్కడ స్థానికంగా పండించే అన్ని రకాల పండ్లు, కూరగాయలను వినియోగదారులకు నేరుగా సరఫరా చేసేందుకు రైతులు మరికొంత చొరవ చూపితే చక్కని ఫలితాలు అందివస్తాయని గ్రహించాలి. మైసూరు తదితర ప్రాంతాల్లో రైతులు ఏటా ఆరేడు స్వల్పకాలిక పంటలు తీస్తున్నారు. వర్షాధార భూముల్లో నేలను విభజించుకుని ఒక పంట మార్కెట్‌కు వెళ్లే సమయంలో మరో పంట పూత దశలో ఇంకోటి నాటే దశలో ఉండేలా ఏడాది పొడవునా ఆదాయం పొందడంలో వారు సఫలమయ్యారు.

- అమిర్నేని హరికృష్ణ

ABOUT THE AUTHOR

...view details