తెలంగాణ

telangana

Farm Laws repealed: రైతులోకం సాధించిన చారిత్రక విజయం

By

Published : Nov 20, 2021, 6:52 AM IST

వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.. రైతులోకం సాధించిన చరిత్రాత్మక విజయం. ఉద్యమంలో భాగంగా ఎముకలు కొరికే చలిని, నిప్పులు కక్కే ఎండల్ని, ఉక్కిరిబిక్కిరి చేసిన భీకర వర్షాలను కర్షకులు పోరాటస్ఫూర్తితో తట్టుకున్నారు. ఇన్ని రోజులు ఉద్యమం పట్టు సడలనివ్వకుండా అనుక్షణం జాగ్రత్తగా కాచుకున్న నేతలు; వారి వెన్నంటి నడిచిన వారందరూ విజయ సాధనలో కీలక పాత్రధారులే!

Farm Laws repealed
Farm Laws repealed

మూడు వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం (Farm Laws repealed) స్వాగతించదగింది. దేశ రాజధాని సరిహద్దుల్లో బారికేడ్లు, జలఫిరంగులు, బాష్పవాయుగోళాల్ని ధిక్కరించి కలిసికట్టుగా కదం తొక్కిన రైతులోకం సాధించిన చరిత్రాత్మక విజయమిది! రాష్ట్రాలతో, రైతు సంఘాలతో ఏమాత్రం సంప్రతించకుండా కేంద్రం నిరుడు ఏకపక్షంగా పట్టాలకు ఎక్కించిన వ్యవసాయ చట్టాల్ని (Farm Laws repealed) కర్షక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మండీలకు ముంతపొగ పెట్టే అడ్డగోలు శాసనాలు బడుగు రైతుల్ని కార్పొరేట్ల దయాధర్మానికి వదిలేస్తాయన్న భీతి- శ్రమజీవుల్ని సమైక్య పోరాటానికి ప్రేరేపించింది. తమ భవిష్యత్తు అగమ్యగోచరం కాబోతోందన్న ఆందోళనే దాదాపు ఏడాదిపాటు నిరసనోద్యమం (Farmers Protest news) కొనసాగించడానికి జీవ ఇంధనమైంది.

చట్టాల అమలును (farm laws 2020) కొన్నాళ్లపాటు వాయిదా వేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా, వాటిని వెనక్కి తీసుకునేదాకా మడమ తిప్పేదే లేదన్న అన్నదాతల పట్టుదల నిరుపమానం! పదకొండు దఫాల చర్చలు నిష్ఫలమయ్యాక, ప్రతిష్టంభన మరింతకాలం సడలకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న అంతర్గత మథనమే కేంద్రాన్ని తాజా నిర్ణయానికి (farm laws latest news) పురిగొల్పి ఉండాలి. త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీలో కమలదళం వందకు పైగా శాసనసభా స్థానాలు కోల్పోనుందని ఇటీవలి సర్వేలో వెల్లడైంది. ఓటర్లు తీర్పివ్వనున్న మరో రాష్ట్రం పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందంజ వేయనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రైతుల భయాందోళనల్ని ఉపశమింపజేసేలా వ్యవసాయ చట్టాలపై ఇకనైనా సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో వాటిల్లగల రాజకీయ నష్టాన్ని ఊహించే, రైతాంగాన్ని క్షమాపణ కోరి కేంద్రం మెట్టు దిగినట్లు స్పష్టమవుతోంది.

రైతు సంఘాల ఉక్కు సంకల్పం

పదిరోజుల వ్యవధిలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయన్న దశలో, గురునానక్‌ జయంతి నాడు వ్యూహాత్మకంగా వెనకంజ వేసిన కేంద్రం- ఇక రైతులందరూ ఇళ్లకు తిరుగుముఖం పట్టాలని కోరుతోంది. పార్లమెంట్లో చట్టాలు రద్దయ్యేదాకా (Farm Laws repealed) ఆందోళనను విరమించేదే లేదంటున్న రైతు సంఘాల స్పందనలో ఉక్కు సంకల్పం ప్రస్ఫుటమవుతోంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండును నెగ్గించుకునేదాకా అది ప్రజ్వరిల్లుతూనే ఉంటుందో లేదో చూడాలి! నూటపద్నాలుగేళ్ల క్రితం ఆంగ్లేయుల జమానాలో కరకు శాసనాలతో పొలం చేజారిపోతుందేమోనన్న పంజాబ్‌ రైతుల ఆందోళన, ఉద్యమంగా ఎదిగి కడకు (Farm Laws repealed) విజయవంతమైంది. నేటికి దాదాపు మూడున్నర దశాబ్దాల నాడు మహేంద్రసింగ్‌ టికాయిత్‌ సారథ్యాన సాగిన బోట్‌క్లబ్‌ ఆందోళనకు అప్పటి రాజీవ్‌ సర్కారు దిగివచ్చింది. ఆ కోవలో చేర్చదగ్గ రైతుల ప్రస్తుత అస్తిత్వ పోరాటం (Farm Laws news) ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి రాటుతేలింది.

అదరక.. బెదరక..

ఎముకలు కొరికే చలిని, చండ్రనిప్పులు కక్కిన ఎండల్ని, ఉక్కిరిబిక్కిరి చేసిన భీకర వర్షాలను కర్షకులు పోరాటస్ఫూర్తితో (Farmers Protest news) తట్టుకున్నారు. అధికార యంత్రాంగం తమను అష్టదిగ్బంధనం (Farmers Protest news) చేసినా, రహదారులపై మేకులున్న పట్టీలు అమర్చినా, ముళ్లకంచెలు వేసి అంతర్గత రోడ్లను మూసేసినా- ఆందోళనకారులు బెదరలేదు. ఉద్యమంలో పాల్గొన్నవారిపై 40వేలకు పైగా కేసులు బనాయించారు. సుమారు ఏడు వందలమంది రైతులు పోరాటంలో ప్రాణత్యాగం చేశారు. యూపీ, లఖింపుర్‌ ఖేరీ జిల్లాలో నిరసనకారులపైకి కేంద్ర మంత్రి కుమారుడి వాహనాలు దూసుకెళ్లి నలుగుర్ని బలిగొన్న దుర్ఘటన (Lakhimpur Kheri case) ఎందరినో కుదిపేసింది. అయినా తొణకని బెణకని రైతు నేతలు 'పోరు విత్తు నాటాం... పంట పండాకనే ఇంటికి తిరిగి వెళ్తా'మని ప్రతిన పూనారు. ఇన్ని నెలలపాటు ఉద్యమం పట్టు సడలనివ్వకుండా అనుక్షణం జాగ్రత్తగా కాచుకున్న నేతలు మహోద్యమ సేనానులు; వారి వెన్నంటి నడిచిన వారందరూ విజయ సాధనలో కీలక పాత్రధారులే!

ఇదీ చదవండి:ఫలించిన అన్నదాతల పోరాటం.. సాగు చట్టాలు రద్దు

ABOUT THE AUTHOR

...view details